Pages

Saturday, July 31, 2010

పట్టించుకోవడం

ఎంత చాకిరి చేస్తున్నానో!ఇంట్లో ఎవరు పట్టించుకోరు అంటుంది ఇంటి ఇల్లాలు.

చెమటోడ్చి సంపాదిస్తున్నా ఒఖ్ఖరు పట్టించుకోరు అంటాడు ఇంటి యజమాని.

చదువుకోరా,బాగుపడరా! అంటే ఎంతచెప్పినా పట్టించుకోడే ఈ పిల్లాడు,వాడి గోలే వాడిది.

ఇత్తదిబిందే చిల్లుపడితే గూటి మైనం పట్టిస్తే సరి ఇక నీళ్లుకారవు.ఈయన రిటైరయిన దగ్గరనుంచి ఇంట్లో ప్రతిదానిని పట్టించుకోని ప్రాణాలు తీస్తున్నారు.

వీధి లైట్లు పగలల్లా వెలుగుతూనే వున్నాయి,మునిసిపాలిటి వాళ్ళు పట్టించుకోరా?

పసివాడి కడుపు పాడయిందా?ఇంత వాము కషాయం పట్టిస్తే {తాగిస్తే]సరి.

ఈ కవిగారు పట్టుకొంటే వదలరు,ఆయన రచనలన్నీ వినాల్సిందే!

సూర్య గ్రహణం పట్టు 2.30కి ,విడుపు 6.కి

ఎంత గొప్ప వాడయినా పట్టు,విడుపు వుండాలి{సర్దుకోవడం]

ఇంజినీరింగ్ చదవరా అంటే డాక్టరు చేస్తానని ఉడుం పట్టు పట్టి కూచున్నాడు.

వధూవరులిద్దరూ"పట్టు' వస్త్రాలు కట్టుకొని పీటల మీద కూర్చున్నారు.

మందు పట్టిచ్చినట్లుంది,నారాయణ లేచి తిరుగు తున్నాడు.

ఆ అబ్బాయికి లేఖ్ఖలలో అంత పట్టు లేదండి.

ఇవాళ మా ఆవిడ గారెలు బాగా వండింది,మరో పట్టు పట్టండి బావగారూ!

ఎక్కడికేడితే అక్కడ మా వాడు పలాస్త్రి పట్టి లాగా అటుక్కుపోతాడు.

గడపకు పసుపురాసి నాలుగు కుంకుమ పట్టిలు పెట్టమ్మా!

పట్టుకాడ {పటకార]తో పాలగిన్నే దింపు.

ఆవిడ పట్టు పట్టిందంటే చచ్చినా వదలదు.

చాగంటివారు ప్రవచనాలు చెపుతూ "మీరు ఈ విషయం బాగా పట్టుకోవాలి'అంటారు.

కాలిపట్టా.

కాళ్ళు తుడుచుకొనే పట్టా.

వాహనం పట్టుతప్పి గోతిలో పడిపోయింది.

బంగారు పట్టెడ.

జనాభా పట్టిక.

సామానుల పట్టి.

సున్నపు పట్టిలు

పట్టేవర్ధనం{నామాలు]

ముత్యాల పట్టెడ

పట్టే మంచం

ఉక్రోషం పట్టలేకపోయాడు.

ఏదైనా సాధించాలంటే గట్టి పట్టుదల వుండాలి.

Friday, July 30, 2010

సహచరి




సహచరి అంటే భర్త అనిగాని, భార్య అనిగాని అర్ధం . స్నేహితుడిని కూడా సహచరుడు అని చెప్పుకుంటాం .జీవితంలొ మన పక్క నడుస్తూ మనతో వుండేవారిని అలా అంటాము. కొందరు దైవదత్తంగా మనకు సహచరులవుతారు.అనుకోకుండా ఎక్కడినుచో వచ్చిమన జీవిత చిత్ర పటం లో అతుక్కుపోతారు. మన కోసమే పుట్టినట్లుగా కలిసిపోతారు. పెద్దలు చెపుతూ వుంటారు , భగవంతుడు తన భక్తులకి సహాయం చెయ్యాలనుకుంటే తనే శంఖు చక్రాలతో వచ్చి సహాయం చెయ్యడు, చెయ్యలేదు . ,ఎందుకంటే ఆయన సహాయం కోరే వాళ్ళూ కోకొల్లలు, ఎంతమంది దగ్గరికి వెళ్ళగలడు? అందుకేఎవరో ఒకరి రూపంలో వచ్చి ఆదుకొంటాడట . కొందరిని చూస్తే అదే నిజమనిపిస్తుంది. దగ్గర వాళ్ళనికూడా చూద్దాం,చూద్దాం అనుకొంటూనే నెలలు ఏళ్ళు గడిచిపోతుంటాయి..


మా అత్తని చూసి చాలా కాలమయింది.ఈమధ్య తనకి బాగాలేదని తెలిసినా వెంటనె వెళ్ళ లేకపోయాను.ఇవాళ ఏమైనా సరే అత్త దగ్గరికి వెళ్లాలని నిశ్చయించుకొని ఇంటికి ఫొన్ చేసా. అటునుంచి పలికిన కంఠం నాకు కొత్తగా ఉంది. మీరెవరండీ?అన్నాను. నాపేరు సంపెంగ అంది. సివంగి,లవంగి కాకుండా సంపెంగ పెట్టుకొంది అనుకొన్నాను. వస్తున్నానని చెప్పా. లోపలికి వెళ్ళి మా అత్త నడిగి వచ్చి రమ్మన్నారండీ!అన్నది.


మా అత్త మేము కొన్నిఏళ్ళ క్రిత పక్క పక్క వాటాల్లో వుండేవారము. ఎంతో ఆప్యాయంగా రోజులు గడిచాయి.. బతుకు బాటలు వేరయ్యాయి, ఇద్దరి జీవితాల్లో ఎన్నో మార్పులు జరిగాయి. .తను ఒంటరి జీవితం గడుపుతూంది.సంపెంగ తియ్యని కంఠంతో ఇంటి చిరునామా చెప్పింది. మీరెవరమ్మా? అన్నాను.నేను వీరి ఇంటో ఉంటాను !అన్నది. సంతోషం తల్లి!అన్నాను. వెళ్లి చూసేసరికి అత్త పక్కమీద పడుకొనివుంది. పక్క పరిసర ప్రాంతము శుభ్రంగా వున్నాయి. పక్కనే కుర్చీలో కూర్చున్నాను.అత్త నాచేయి తన చేతిలోకి తీసుకుని చెమర్చిన కళ్ళతో ఎన్నిరోజులకి కలిసామో?అన్నది. నేనూ మాట్లాడలేకపోయాను, అవును అన్నాను. సంపెంగ మంచి నీళ్ళూ తెచ్చి ఇచ్చింది.అత్తకి కనపడుతుంది, వినపడుతుంది, కానీ కూచోలేదు ఎవరన్నా పట్టుకు నడిపిస్తే తప్ప అడుగు వెయ్యలేదు. అనారోగ్యం వచ్చినా,వయస్సు పెరిగినా కనపడక పోవడం, వినపడకపోవడం, జ్ఞాపకశక్తి, ఖంగుమనే గొంతు పోతాయి.అత్తకి అన్ని బాగున్నాయి. ఎన్నో కబుర్లు తవ్విపోసుకొన్నాము, ఎన్నో జోకులు పేల్చాము.ఇద్దరి మనస్సు తేలిక పడింది..తన పిల్లల ఫొటోలు చూపించమనిసంపెంగ ని పిల్చింది.సంపెంగ ఆల్బంలు తెచ్చి నా ఎదుట పెట్టింది.ఇంతలో వేడిగా ఉప్మా చేసి తీసుకు వచ్చింది సంపెంగ.


ఈఅమ్మాయి ఎవరత్తా?అన్నాను. "ఏడేళ్ళ పిల్లప్పుడు ఇది హ్య్దెరాబాదు చూస్తానని వచ్చింది.మా పిల్లలతో పాటు ఆడుతూ పాడుతూ వుంది ఇకనీతోనె వుంటా అని ఇక్కడే వుండిపోయింది.ఇప్పుడు ఇడే నాకు ప్రాణాధారం. పిల్లలకి పెళ్ళిళ్ళు అయి అత్తవారింటికి వెళ్ళిపోయారు, మా వారు నా చేయి వదిలి పైలోకాలకు వెళ్ళిపోయారు, నాకు రోగం సంప్రాప్త మయింది ఇక ఇదే నా సహచరి అన్నది. ఇల్లు చూసిరా అన్నది అత్త. దేముడి గదిలోఫొటోలకితాజా పూలు పెట్టి వున్నాయి. వంటింట్లో హాలులో ఎక్కడ వస్తువులు అక్కడ చక్కగా వున్నాయి. "ఇలాటి అమ్మాయి నీకు దొరకడం అదృష్టం అత్తా" అన్నాను. పిల్లల పెళ్ళిళ్ళలో మా అత్త సంపెంగని తోడ పెళ్ళికూతుర్ని చేసిందట.ఆ అమ్మాయినికూడా ఒక కూతురులానే చూస్తోంది. కొస మెరుపు ఏమిటంటే మా అత్త తన ఆస్థిలో సంపెంగకి కూడా ఒక వాటా వ్రాసిందిట. నీకు హాట్స్ ఆఫ్ అత్త అన్నాను. ఆమెకు ఈమె సహచరి, ఈమెకు ఆమె సహచరి.

Saturday, July 24, 2010

గురుపూర్ణిమ



గురుపూర్ణిమ అనగానే ఒకటో క్లాసునుంచి చదువు చెప్పిన గురువులందరూ ఒకసారి కళ్ళముందు మెదులుతారు.అమాయక మైన పసి హృదయంలో గురువు రూపం ముద్ర పడిపోయి జన్మంతకాలం చెరగకుండా వుండిపోతుంది.తల్లి,తండ్రి తరువాత అంతటి గౌరవనీయమైన స్థానం ఒక్క గురువులకే ఇయ్యగలం.చేయిపట్టుకు అక్షరాలు దిద్దించి , జ్ఞాన జ్యొతిని హృదయంలో వెలిగించిన గురువుల ఋణం ఎన్నటికీ తీర్చుకోలేము. చదువు అనేది జీవనోపాధికి ఊతగా భావించి నప్పటికి వయసు పెరిగుతూంటే ఆ అక్షర సముదాయంలో దాగివున్న ఎన్నో నిధులు దర్శన మిస్తాయి. పరిశోధనలకి,వినోదాలకి,లలిత కళలకి ,రాజకీయాలకి ఎన్నిటికో పనికి వచ్చే చదువు పరిపక్వ స్థితిలో జన్మ సాఫల్యానికి దారి చూపుతుంది.దైవం ఉనికి తెలుసుకోమంటుంది. చతుర్విధ ఫల పురుషార్ధప్రదమైన జీవితం గడపమంటుంది.


కీకారణ్యం లాంటి సంసారంలో పడి కొట్టు మిట్టాడే జీవుడిని ఆధ్యాత్మికతను అవగతం చేసుకోమంటుంది.ఎలా ?ఎలా? అని తపన పడుతుంటే గురువు వెలుగు కిరణం లా ఎదురవుతాడు.మన జీవితం లోని క్షణాల్ని, ఘంటలని , రోజుల్ని, సంవత్సరాలని చేయిపట్టుకు నడిపిస్తాడు.అదే అసలైన జీవితం.ఆధ్యాత్మిక తత్వాన్ని బోధించి అండగా నిలిచే గురువు దొరకడం అదృష్టం .


ఎందరో కొత్తవాళ్ళు మనకి పరిచయం అవుతూ వుంటారు.ఏప్రయోజనం లేకుండా ఎవరూ మనకి పరిచయం కారు.ప్రతి వ్యక్తిలోను కామ,క్రోధాదులు,బలహీనతలు వుండనే వుంటాయి,వాటితోపాటు ఎదోమంచితనము ,అనుసరించ తగినది వుంతుంది. దాన్ని పట్టుకొనిమనం ఆచరించగలిగితే లాభమే!



శ్రీ దత్తాత్రేయ స్వామి గురుపీఠం లో ఉన్న "నాకు ప్రపంచములో ఎందరోగురువులున్నారని"జీవిత చరిత్రలో చెప్పారు.తెలుసుకోవాలనేఉత్సాహము,వినయము,వుంటే ఎన్నో తెలుసుకోగలుగుతాము.మానవుడు నిత్య విద్యార్ధి . ప్రకృతి అంతా అతనికి గురువే!


మహా భారతాన్ని,అష్టాదశ పురాణాల్ని మనకందించిన వ్యాసమహర్షిని తలుచుకొని కృతజ్ఞతలు అర్పిద్దాము. ప్రమిద,తైలము,వత్తి అన్ని వున్నా దాన్ని ప్రజ్వలింప జేసె అగ్ని లేకపోతే నిరర్ధకమే!అంధకారమే! గుడ్డితనమే! గౌరవంతో, భక్తితో, వినయంతోవ్యాసపూర్ణిమ సందర్భంగా గురుపరంపరకి నమస్కరిద్దాం.