Pages

Sunday, May 10, 2009

అమ్మ...



అమ్మా అనేది అందరికి దొరికిన వరం. తొమ్మిది నెలలు మోసి కనిపెంచిన తల్లికి మమతానురాగాలు ఉండడం సహజం. కాని జీవితంలో అదృష్టం ఉంటె అమ్మలు కాని అమ్మలు దొరుకుతారు. కనదాలు పెంచాదాలు లేకుండానే ఆ మాత్రు వాత్సల్యం మదిలో మొలకెత్తడం అంటే ఎంతో విచిత్రంగా ఉంటుంది. సొంత అమ్మ ఉన్నవారికి కూడా ఇలాంటి అమ్మ తారసపడతారు. నా జీవితంలో అలాంటి అమ్మే నాకు దొరికి నన్ను విస్మయ పరిచింది.

మన ఊరు కాదు , మన బాష కాదు. అప్పుడే పరిచయమై అప్పుడే అమ్మలా ఆదరించింది. కెనడా వెళ్ళినప్పుడు పిచ్చి చలిలో కూడా మేము సాయిబాబా బహాజనకు వెళ్ళే వాళ్లము. పిల్లలకి క్లాసులు జరిగేవి. మా కోడలు పిల్లలకు క్లాసులు నడిపేది.నేను ఇంట్లో ఒక్కదాన్ని ఎం చేస్తానని నేను కూడా వెళ్ళే దాన్ని. నాలాగే మాశిమా అని ఒకామె వచ్చేవారు .ఆమెకు మా అమ్మ వయసు ఉండేది. మొదటిరోజు మాశిమాని చూసినప్పుడు మా అమ్మ కట్టుకున్న చీర లాంటిది కట్టుకుంది. నా కళ్ళు మెరిసాయి.మా అమ్మ దిగి వచ్చి అక్కడ కూర్చుందేమో అనిపించింది. నా పక్కనే కూర్చునేది. ఆప్యాయత నిండిన కళ్ళతో సుతారంగా నవ్వుతూ హిందీలో ఎక్కడినుండి వచ్చావు? అంది. చెప్పాను. నీకు రంగోలి వాచా అంది. వచ్చు అన్నా. ఆరోజునుండి మేమిద్దరం చాలా దగ్గర అయిపోయాము. ప్రతి వారం కలిసేవాళ్ళం. ప్రతిసారి నాకోసం జేబురుమాల్లో చుట్టి ఏదో ఒక స్వీట్ తెచ్చేది. నీకోసమే తెచ్చాను అని అది ఎలా చేసిందో చేపి నాతొ తినిపించేది. హృదయ కమలం ముగ్గు వేసి ఇచ్చాను. ఒకే గీతతో ఆ ముగ్గు పూర్తీ చేయాలి. ఎంత ప్రయత్నించినా తనకు వచ్చేది కాదు. ఎక్కడో తప్పిపోఎది. నేను వేసి చూపిస్తే. నీకెలా వస్తుంది నాకు రాదే అనేది.ఒక్కోరోజు పుస్తకాలు తెచ్చి చదివి వినిపించేదాన్ని. సంశయం వస్తే అడుగుతూ , మంచి వాక్యం వస్తే మళ్ళీ చదవమనేది. నాకు కూడా అక్కడ తోచేది కాదు. బయట ఒకటే చలి. బయటకు వెళ్ళలేము. ఒకసారి పాత బట్ట మూడు చీలికలు చేసి జడలా అల్లి ఒక చేతిసంచీకి టాగ్ లా కత్తి తీసికెల్లాను. అరె ఇదెలా చేసావు అని ఆశ్చర్యపోయింది మాశిమా. ఇలాగే చేతిసంచులు, టేబిల్ క్లాతులు చేయగలను అని చెప్పాను. అలాగా అని ఆ మరునాడు ఒక చేతి సంచి నిండా కొత్త బట్ట ముక్కలు తీసుకొచ్చి వీటితో ఏమన్నా చేస్తావా అంది. ఇన్ని ముక్కలు ఎక్కడివి అంటే నేను బట్టలు కుడతాను చీర కొంగులు జిగ్ జాగ చేస్తాను అనిచెప్పింది.


మాశిమా తన దగ్గరున్న చీరలు చివరలు కత్తిరించి అట్టే పెట్టిందంట, ఇంకా బోలెడు జరీ ముక్కలు, సిల్క్ ముక్కలు . ఎంతో కాలంగా దాచిపెట్టడం వల్ల అవి గట్టిగా అతుక్కుపోయాయి. అవన్నీ కష్టపడి విడదీసేసరికి వారం రోజులు పట్టింది. అక్కడ ఇల్లంతా తివాచీలు. దారాలు తివాచీల మీద పడి బయటకు రానంటే రానని మొరాయించేవి. వాటినంతాశుభ్రం చేసేసరికి కనీసం గంట పట్టేది. తర్వాత అల్లడం మొదలు.. సిల్క్ బట్ట కనుక జడలా అల్లేసరికి సన్నగా వచ్చేది. తొందరగా తెమిలేది కాదు. ఎలాగైతేనేమి అది పూర్తి చెసి గుండ్రంగా చేసి దారంతో కుట్టాను. ఒక నెలరోజులు మంచికాలక్షేపం ఐంది.. కొత్త వ్యాపకం నేర్చుకున్నట్టు ఐందీ, పనికొచ్చే వస్తువూ తయారైంది. దీనికి మాషిమాకి ఎన్నికృతజ్ఞతలు చెప్పుకున్నానో..

మాషిమాకి ఎన్నో పనులు వచ్చు. మనసు విప్పి ఎటువంటి అహంభావం లేకుండా అందరికీ సహాయం చేయడం, సలహాలు ఇవ్వడం, సేవ చేయడం ఆమెలోని ప్రత్యేకత. అందులో మరీ ప్రత్యేకమైంది . పుల్కాలు చేయడం. ఆమెపుల్కాలు చేస్తే మస్లిన్ గుడ్డ మడత పెట్టినట్టుండేవి. అక్కడ పండగైనా , పబ్బమైనా నేను పుల్కాలు చేసుకొస్తా అనివందల కొద్దీ చేసుకొచ్చేది. ఎన్ని చేసినా అన్ని ఒకేలా ఉండేవి. రుచి కూడా ఒకేలా ఉండేది. ఒకసారి కృష్ణాష్టమికి ఒక స్వీట్చేసింది. మినప్పప్పు నానబెట్టకుండా రుబ్బి, పాకం పెట్టి చేసేది. అది ఉడికేటప్పుడు గరిటతో తిప్పి తిప్పి చెయ్యినొప్పిపుట్టేది.ఐనా అద్భుతమైన వాటి రుచి కోసం కష్టం ఏపాటిది అనిపించేది.

నేను కెనడా నుండి వచ్చేస్తుంటే "హృదయ కమలం" ఒక పేపర్ మీద గీసి ఇవ్వమంది. నన్ను ప్రొసన్నా అని పిలిచేది. అదేంటి తన పేరు ప్రసూన కదా అని ఎవరన్నా అంటే చిన్నగా నవ్వేసి .. నన్ను ఎప్పుడూ ప్రసన్నంగా ఉంచుతుంది కనుకప్రొసన్నా అనే పిలుస్తాను అనేది. పల్చటి నవ్వు ముఖం., సన్నటి శరీరం., నాజూకైన మాట..పలుకు పలుకులొ కలకండముక్కలు అందించేది. మేము కలవడానికి ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవాళ్లం. ఇద్దరం కలిసి బాబాసెంటర్ లో పండగలు ఉంటే క్లీనింగ్ కి వెళ్లేవాళ్లం. తను ఎప్పుడూ ముందుగా తయారయ్యి అందరినీ వెనక్కి నెట్టేది. తక్కువ తినడం, తక్కువ మాట్లాడడం, ఎక్కువ పని చేయడం, అందరి సుఖమూ కోరుకోవడం మాషిమా ఆదర్శాలు. గిన్నెలో పాలమీది మీగడ తరకలమీద వేలితో సుతారంగా ఇలా అంటే పాలు కదిలినట్టే...తన జీవితం బాధాపరితప్తహృదయంతో గడిపినా పైన మీగడ తరక మాత్రమే మనకు తినిపించి విందు చేసేది మాషిమా..

కెనడా వదిలి వచ్చేముందు నా పిల్లలను వదిలిరావడం కంటె మాషిమాను వదిలిరావడం కష్టమైంది నాకు. మాషిమాకిబెంగాలి తప్ప వేరే బాష రాదు. నాకేమో బెంగాలీ చదవడం రాదు. ఎలా మనం కబుర్లు రాసుకోవడం అనేది. అన్నిబాషలకు అతీతమైన ప్రేమైక హృదయం నీకుంది. నువ్వు మనసులో ఏదన్నా అనుకో...తప్పకుండా అది నాకందుతుందిఅన్నాను .. గాంభీర్యంగా అన్నాను కాని తనకు తెలుగు వస్తే ఎంత బాగుండు అని లోలోపల వాపోయాను. ఇప్పటికీ మాపిల్లలను మాషిమా కబుర్లు అడుగుతూనే ఉంటాను. కలవడం మాత్రం కుదరలేదు. కాస్త వడలిన జాజిపూవులా అమ్మకాని అమ్మ మాషిమా నా మదిలో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది.

2 comments:

సుభద్ర said...

super andi.
meeru mee ammakani amma ni kalavalani korukuntunnaa..

మాలా కుమార్ said...

ప్రసూన గారు ,
మాతృదినోత్సవ శుభాకాంక్షలు