Pages

Thursday, October 24, 2019

నేనెంత

నేనెంత 
       కంపోజ్ చేసిన మెటర్ని కాలం సైజులో కుదింఛి మూడుకాలంస్ ఒక పేజీగా ఒక మోల్డ్లో పెట్టి అలాటి పేజీలు ఎనిమిది తయారు చేసి,నాలుగు పేజీలు  ముందు వెనకా ప్రింట్ అయేలా చేసిమిషను చేత్తోనే తిప్పేవారు. పెద్ద రోలర్ లాటిది తిరుగుతుంటే  దానిని మిషన్ లో పెట్టేవారు. ,ఆఫారమ్స్ బయటికి వస్తుంటే ఎంత చిత్రం గా ఉండేదో  అనుభ వజ్ను లైన కంపోజిటర్స్  పర్య వీక్షణ చేస్తూ ఉండేవారు. ముందు  ప్రూఫులు పొడుగాటి  కాగితాలపై తయారు చేసి ఇచ్ఛేవారు. ఆ మే తారు వ్రాసిన వారయితే ప్రూఫులు దిద్దడం తేలిక. బయట వారు వ్రాసినవి,చాలా జాగ్రత్తగా దిద్దాలి. ప్రూఫ్ రీడింగు అదీ ఒక కళే !అదొక భాష. చాలా ఓర్పుఉండాలి . ప్రూఫులు దిద్దడానికి ఇంటికి పట్టుకొచ్చ్చేవారు.  కూర్చో పెట్టి నాన్నగారు దిద్ది ఇచ్ఛేవారు. అప్పుడు నీకూడా కొంచెం నేర్చుకున్నా. 
                              కృష్ణా పత్రిక  వరండాలోంచి  మెట్లు ఉండేవి. పైన ఒక  గది .గాలి వెల్తురు,కిటికీలోంచి చూస్తేకింద పూల చెట్లు శిల్పాలు. కృష్ణాపత్రిక ఆస్థాన చిత్ర కారుడు తోట వెంకటేశ్వర రావు గారు బొమ్మలు వస్తూవుండేవారు.మెట్ల పక్కనేఒక పూల తీగ ఉండేది. దానికి "బాతుపూలు పూసేవి. అంటే కొమ్మచివర పువ్వు పూసేది.దానీరెక్కల పై మచ్చ్చలుండేవి .రంగు డార్క్ వైలెట్ ,దానిపై పసుపు చుక్కలు ,ఎందుకో నాకా  పువ్వులు  విచిత్రంగా ఉండేవి.ఆఫీసులో కాగితపు సంచీతీసుకొని దాంట్లో పూలు కోసుకు తెచ్చుకొనేదాన్ని. 
                                అకౌంటెంట్ మల్లినాథ సూరి గారికి నత్తి ఉండేది. అంచేతనో ఏమోబిడియ   పడుతూ ఎవరితో కలిసేవారు కాదు. మానాన్న   గారు ఆయనికి ధైర్యం చెప్పి ,ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకెళ్లేవారు. హాస్య ప్రియుడు. బహు సంతానం,చాలీ చాలని జీతాలు. అయినా ఛలోక్తులు విసురుతూ  ఉండేవారు.  మా నాన్నగారు కృష్ణా పత్రికలో వారం వారం వ్రాసే హాస్య వ్యంగ రచన "వడగళ్ళకు ఆయనే హీరో!
ఆయనేదో ఒక చేనుకు విసిరితే ఆదిపుచ్చూకు నాన్నగారు సాగదీసి,చిలవలు  పలవలు తీసి వ్రాసేవారు. ఆవ్యాసాలు నాన్నగారికి,కృష్ణా పత్రికకు కూడా మంచి పేరు తెచ్చ్చిపెట్టాయి. కృష్ణా పత్రిక శుక్ర వారం సాయంత్రం విడుదల అయేది. కిల్లె కోట్లలో  ఆయా పేజీ విప్పి తాడుపై క్లిప్పులు పెట్టి వ్రేలాడదీసేవారు  . కొనుగోలు దారులు,వచ్ఛేపోయెజనం కొననక్కర లేకుండా నిలబడి చదువుకునేవారు.        

Wednesday, October 23, 2019

నేనెంత

నేనెంత 
     నాన్నగారు పరీక్షల్లో ఒక ప్రశ్నలో కథ వ్రాయమంటే పద్యాలలో వ్రాస్తే గొప్పగా ఉంటుందని మొత్తం పద్యాలు వ్రాశారట. బోలెడు మార్కులు వస్తాయని ఆశ తో ఎదురుచూస్తుంటే,'కద వ్రాయమంటే పద్యాలలో ఎందుకు వ్రాసావు అని ఎర్రసిరాతో సున్నాపెట్టాడట.  అది చూసి నాన్నగారు చాలా నిరాశ చెందారు.  బందరు లో ముట్నూరి కృష్ణా రావు గారి  సంపాదకత్వం తో కృష్ణాపత్రిక వారపత్రిక వచ్ఛేది. ఆపత్రికకు సాహిత్య పరం గానూ,దేశ భక్తి పరం గానూ,వేదాంత పరంగానూ ఒక విశిష్ట మైన స్థానం ఉండేది. సినిమా సమీక్షలు,కోర్టు ప్రకటనలు ,కూడా ఉండేవి. మా  నాన్నగారికి ఆ పత్రికలో పని చెయ్యాలని గొప్ప కాంక్ష ఉండేది. కిరసనాయిలు అమ్మే దుకాణం లోనూ,ఎలెక్ట్రిక్ దుకాణంలో బల్బులు అమ్ముతూనూ ,సాయంత్రం దాకా గడిపి ,రోజూ కృష్ణా పత్రిక ఆఫీసుకు వెళ్లేవారు. చిన్నగా సినిమా సమీక్షలు అవీ
వ్రాసేవారు,అవి పత్రికలో వేసే వారు. 
                 కృష్ణా పత్రిక  కళాకారులందరికి  ఒక ఆలయం లా ఉండేది. అక్కడి దేవత  సరస్వతి .స్థానికంగా ఉండేవారు,వేరే వూళ్లనించి వచ్చ్చేవారు  కృష్ణాపత్రికాలయానికి వఛ్చి దర్శించు కొని వెళ్లేవారు. మా నాన్నగారు నన్ను అప్పుడప్పుడూ ఆఫీసుకు తీసుకు వెళ్లేవారు. 
              ఆఫీసు ప్రవేశంలో చిన్నగట్టు,నడవా ఉండేవి. అలా వెడితే చిన్న వరండా. అక్కడ క్రోటను మొక్కలు ,అందమైన రాతి శిల్పాలు ఉం డేవి.అక్కడే రోజూ కళాకారులతో సాయంత్రం వేళా దర్బారు జరిగేది. అక్కడ జరిగిన సంభాషణ లన్నీ నాన్నగారు పన్నీటి జల్లు అనేశీర్షిక కింద వారం వారం వ్రాసేవారు. ఆవరండాకి ఎడమవైపు రెండు గదులుండేవి. అక్కడే మేనేజరు కాజ శివరామయ్యగారు, అకౌంటెంట్ గా మల్లినాథులు కూర్చునేవారు. పక్క గదిలో పెద్ద పెద్ద చెక్క రాక్ లు ఉండేవి. అక్కడ బ్లాకులన్నీ ఉండేవి. చక్కల మీద లేదు తో బొమ్మలు తిరగేసి ఉండేవి   ,ఒకచోట లోతుగా ఒకచోట ఎత్తుగా ఉండేవి.వాటివెనక నంబరు వ్రాసి ఉండేవి.ఆనెంబర్ల ప్రకారం బొమ్మలు ప్రింట్ చేసి పుస్తకాలు ఉండేవి. వాటిని ఆధారంగా కావలసిన బొమ్మలు తీసి మిషనులో పెట్టి ప్రింట్ చేసేవారు. ఆబ్లాకుల తయారీ మద్రాసులో జరిగేది. మనం బొమ్మ పంపిస్తే అయిదారు రో లాలో బ్లాకు తయారు చేసి పోస్ట్ లో పంపేవారు. ఒకోసారి సమయానికి అందవని ముందుగానేబ్లాకులు తయారు చేయించి పెట్టుకొనేవావారు.  
                        వరండాలో మరో గాడి ఉండేది. లోపలికి వెళ్ళగానే తలుపు పక్కన కృష్ణా రావుగారు. పడక కుర్చీలో కూర్చుని ఉండేవారు. గుమ్మానికి ఎదురుగా మానాన్నగారు కుర్చీ ,మేజాబల్ల, పక్క నే కమలాకర వెంకట్రావు గారు కూర్చునేవారు. అక్కడే పెరట్లోకి తలుపు ఉండేది. అక్కడ బోలెడు మొక్కలు,శిల్పాలు ,కనువిందుగా ఉండేవి. ఆతోటకానుకొని పొడుగాటి షెడ్లో ప్రెస్ ఉండేది. అక్కడ కంపోసింగ్, ప్రింటింగ్ జరిగేవి. ఒక్కొక్క అక్షరానికి  తలకట్టు ,కొమ్ములు,వత్తులు  ఉండేవి.కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని  కంపోజ్ చేసేవారు.  

                         
         

Monday, October 21, 2019

నేనెంత

నేనెంత 
                ముచ్చ్చిలిగుంట నాకు గుర్తు లేదు.కానీ ఎప్పుడో బామ్మతో ఉన్నట్లు లీలగా గుర్తు. వాకిట్లో పెద్ద టెక్కాలుండేవి. ఇల్లు ఎత్తుగా ఉండేది. నాకు మా నాన్నగారంటే ఎక్కువ అనుబంధం. అమ్మకి ప్రేమ ఉండేది,కానీ ముద్దులు కురిపించడం ,గారాం చెయ్యడం లాలనగా కబుర్లు చెప్పడం చేసేదికాదు. నాన్నగారు మాత్రం మమతా కురిపించేవారు. నాన్నగారు కనిపించక పొతే గిలగిలా లాడేదాని. అమ్మని నాన్నగారు ఎక్కడికి పంపేవారుకాదు. ఎప్పుడో ఒకేసారి పంపేవారు. అక్కడికి వెళ్ళగానే నాన్నగారు కనపడక బెంగతో పాలు తాగక ,నిద్ర పోక ,జ్వరం వచ్ఛేది . మా అమ్మమ్మవాళ్ళు కూతురు ఇంటికి వచ్చిందని ఆనంద పడిపోతుంటే నేను ఆ ఆనందాన్ని ఒక్కరోజు నిలపెట్టేదాన్ని కాదు. నాకు బాగాలేకపోతే మా అమ్మ ఖంగారు పడిపోయేది. రెండో రోజే ప్రయాణం కట్టేది. మా వూరు వఛ్చి మా వాకిట్లో బండి దిగగానే నాన్న కనిపించక గానే మొహం చాటంత అయి మామూలుగా అయిపోయేదాన్ని, మా అమ్మకి లోలోపల బాధ కలిగేదేమో!
                                  మా అమ్మ మౌన యోగి.  కొంచెం జ్ఞానం వచ్చ్చాకమేము ఖొజ్జిలి పేటలో ఉండేవాళ్ళం. నన్ను అక్కడ కోటవారితాళ్ళదగ్గర బడిలో చేర్చారు. ఆ బడిప్రధాన ఉపాధ్యాయురాలు  మ్ము ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. ఆమెపేరు రాజమ్మగారు. వాళ్ళది పెద్ద భాగం ,మాది చిన్నది. మా వంటింటికి మధ్య తడికే ఉండేది. నేనెప్పుడైనా మారాం చేస్తే టీచర్ గారు తడిక వెనక నుంచి "ఊ అనేవారు,అంటే నేను నోరెత్తేదాన్ని కాదు. ఇంటివాళ్ళు దొడ్డివేపు చిన్న భాగం లో ఉండేవారు.  రాజమ్మ టీచర్ గారి చెల్లెలు ,తమ్ముడి సంసారం అక్కడే ఉండేవారు.మేము వాళ్ళు రాజమ్మ టీచర్ గారి మాట నెత్తిన పెట్టుకొనేవాళ్ళం. అక్కడ మా ఇంటికి కుడివైపు చివర దుర్లా రమణమ్మగారు ఉండేవారు. జానకీరాణితో అప్పటి స్నేహబాంధవ్యం . మాకు ఎడమ వేపు వీధి వైపు ఆంధ్ర బ్యాంకు ఉండేది. అవుటపల్లి హనుమంత రావు గారు ఉండేవారు. లోపలగా కంచి వాసుదేవరావు, కె.ఆర్ కె మోహన్ ,జయలక్ష్మి వుండెవారు  . మాఇంటికి వాళ్ళ ఇంటికి మధ్య గోడ సగం విరిగి ఉండేది. వీధిలోంచి వెళ్లనక్కర లేకుందాం ఆగోడదగ్గర కూర్చుని పిల్లి పిల్లలతో ఆడుకొనేవాళ్ళం. రాజమ్మ టీచరుగారింట్లో మీనాక్షి  అనేఅమ్మాయి ఉండేది. నాకంటేచాలా పెద్దది. అయినా మేము తాటాకు బొమ్మలతో పెళ్లిళ్లు చేసిఆడుతుంటే తాను పెద్దగావుంది ఆడించేది.
                                   మా నాన్న గారు ఆఫీసుకు వెళ్ళేటప్పుడు రోజూ  నాతొ చెప్పి 'ఆడుకొ అమ్మా!అల్లరిచెయ్యకు, నేను తొందరగావచ్చ్చేస్తా." అని చెప్పి వెళ్లేవారు.ఒకరోజున నాతొ చెప్పకుండా వెళ్లిపోయారు. ఇల్లంతా వెతికా కనపడేలా. వీధిలోకి వఛ్చి చూస్తే గొడుగు వేసుకు వెళ్లి పోతున్నారు.దుఃఖం వచ్చ్చేసింది.కడుపు ఉబ్బిపోయింది. కన్నీళ్లు కారిపోతున్నాయి. ఆయన వెనక "నాన్నా"'నాన్నా" అంటూ ఏడుస్తూ పరుగెత్తతున్నా. ఆయనకేమితెలుసు?ఆయన వెనక్కి తిరిగి చూడలేదు.ఇంకా ఉక్రోషం ఎక్కువయిపోయింది. రోడ్డు చివర నాన్న గారు ఎడమ వే పుకి తిరిగారు,అప్పుడుచూశారు,గొడుగు ముడిచి చేతికి తగిలించుకొని వెనక్కి పరుగెత్తుకు వఛ్చి నన్నెత్తుకొని"ఏమైంది తల్లీ!ఏమైంది? అన్నారు. దుఃఖం ఆపుకొని చెప్పాను అయ్యో అందుకా !ఒక్కదానివీ ఇంత దూరం వచ్చ్చావా!అని ఉత్తరీయం తో మొహం తుడిచి ఇంటికి తీసుకు వఛ్చి మా అమ్మని కేకలేశారు. పిల్ల వస్తూంటే చూసుకోనక్కరలేదా?అని వెళ్లి పోయారు. పక్కనే ఎక్కడో  ఆడుకొంటున్నాననుకోంది  అమ్మ. అమ్మకి కోపం వచ్చింది. అప్పుడు అమ్మ చేతిలో ఉప్పు బుట్టవుంది.దానితో నన్నొక తోపు  తోసి చెప్పకుండా ఎందుకు వెళ్ళావు?నన్ను చివాట్లు పెట్టారు"అంది.కానీ కొట్టలా! మధుర మైన బాల్యం ,మళ్లీమళ్ళీరాని బాల్యం