Pages

Friday, January 29, 2010

కంప్యూటర్ భాష





ఈమధ్య నేను,అచ్యుతం ఎవరింటికో వెళ్ళాము ఆ ఇంటావిడ అచ్యుతం బంధువు. అచ్యుతం చాలా కాలానికి కనపడటంతో ఆమె తన ఈతి బాధలు చెప్పుకొని విచార పడింది.మా అచ్యుతం చాలా ఈజీగా -"పోదూ!ఎవరెలా పోతే మనకెందుకు? ఇలాటి వాళ్ళ మాటలన్నీ మనసులో పెట్టుకు కుళ్ళిపోకు, అన్ని "డిలీట్" చేసిపారెయ్యి, మనస్సు క్లియర్ గా వుంటుంది అంది.

ధరలన్నీ పెరిగిపోయాయి. సంసారాల్లో అవసరాలకి సంచులతో డబ్బు గుమ్మరించినా ఇంటి గుర్రాలు కుంటుతూనే వున్నాయి. కూరల ధరలు చూస్తే కను గుడ్లు బయటికి వస్తున్నాయి. చెప్పా పెట్టకుండా బంధువులు వచ్చేస్తూ వుంటే మొన్న ఒకాయన అంటున్నాడు, "డెస్క్ టాప్ మీద యాడ్స్ లాగా వద్దంటే వచ్చేస్తున్నారండీ! పిల్లల నోళ్ళూ కట్టి వీరికి పెట్టాల్సి వస్తూంది.అని.

సాయంత్రం పార్కులో బెంచీ మీద వుసూరు మంటూ కూర్చున్నాడు జగన్నాధం.'ఏమిటి కధ?" అన్నాను."ఒక్కళ్ళకి కోఆపరేట్ చేద్దామని లేదండీ! పోనీ ఆఫీసులో వాళ్ళ పని వాళ్ళన్నా చేసుకుపోతారాంటే అదీలేదు. మేనేజరు పొస్టంత దిక్కుమాలిందీంకోటి లేదనుకోండి .గడ్డం పుచ్చుకు బతిమాలి ఇలా చెయ్యండయ్యా అని చెప్పినా రెండు రోజుల్లో అంతా మామూలే! వీళ్ళందర్నీకొత్త "ఫోల్డర్ లో" పెట్టి ఏ రేణిగుంటకో తోసిపారేస్తే బాగుండును"అని వాపోయాడు.

కాఫీ - అంటే చాలు వికీపీడియాలాగా పొడి అని అర్ధం చేసుకొని మా ఆయన సైకిలెక్కి క్షణం లో కాఫీ పొడి తెచ్చి ఇంట్లో పడేస్తారు, ఎంతహాయో! అంది ఒకావిడ.మావాడికి హటాత్తుగా రేపే వడుగు చెయ్యాల్సి వచ్చిందిరా ! అని ఒకమాట అన్నానో లేదో మా తమ్ముడు గూగుల్ లాగా చిక్కడపల్లి నుంచి ఉధ్ధరిణె అరివాణం , కోటి నుంచి దీక్షావస్త్రాలు, మొజాంజాహి మార్కెట్ నుంచి నవధాన్యాలు, జంఝాలు, అరిటాకులు పూలు తెచ్చి పడేసాడు అంది ఒక సోదరి. ".నాలుగు నెలలుగా బాంక్ పాస్ బుక్ కంపించడంలేదు, పాస్ వర్డ్ మర్చిపోయిన బ్లాగ్ లాగా ఎక్కడుందో వెతకలేక చస్తున్నాను " అన్నారొకరు.

మొన్న ఒకరికి ఈమైల్ పంపితే మూడుసార్లు వెనక్కి వచ్చింది.అప్పుడు వినాయకునికి దణ్ణం పెట్టుకొని సదరు మనిషికి ఫొన్ చేసాను. "అయ్యా! మీకు పంపిన మైల్ మూడుసార్లు వెనక్కి వచ్చింది, దీని భావమేమి తిరుమలేశా! అంటే అరే! మీకు చెప్పడం మర్చిపొయాను, నా ఐడిలో వెంకట్ అని వుందికదా! అన్ని చిన్న అక్షరాలే కానీ "కె" కాపిటల్ లెటర్ కొట్టాలండీ! అన్నాడు.

"ఫలానా పని చేసుకురారా! అని మావాణ్ణి పంపి అయిదుగంటలయింది . డబ్బుకూడా ఇచ్చి అది "సెంట్"లో వుంటుంది కానీ మెయిలర్ డెమన్ వచ్చేదాక మనం సరిగా పంపలేదని తెలియదు. బారసాలకి బట్టలుతేరా! అని పంపిస్తే అక్షరాభ్యాసానికి పలకలు తెస్తారు కొందరు. మీరు ఏ పనికి పంపారో, అదిఎంత విలువైనదో, ఎంత అర్జెంట్ గా కావాలో, అది పుచ్చుకు మీరు ఎంతదూరం వెళ్ళి ఆ పని పూర్తి చేసుకోవాలో, దాని గడువు ఈ రోజుతో అయిపోతుంది నాయనా! అని వివరించక పోవడం మీ తప్పు.అన్నాడతని స్నేహితుడు. ప్రతి కొత్త ఉపకరణానికి ఒక భాష తయారయి అది జీవితాల్లో అల్లుకు పోతుంది చిత్రంగా.