స్వెట్టర్ ,మఫ్లర్ , రగ్గూ అన్నీ ఇచ్చినా ఇంకా గజగజలాడుతూ "చలి,చలి"అని గోల చేసే ఒక కుమారున్ని చూసి తండ్రి
"చలి అని మళ్లీ అన్నావంటే ఆ స్వెట్టర్, మఫ్లర్ , రగ్గూ లాక్కుని రాత్రి బస్సులో హైదరాబాదు పంపిస్తా నిన్ను. ఎస్కిమోలకు వేసినన్ని దుస్తులు వేస్తే ఇంకా చలిట !ఇది బెజవాడ అనుకొన్నావా?డార్జిలింగ్ అనుకొన్నావా” అని !
నిజానికి ఈ సంవత్సరం విజయవాడలో కూడా చలి దేవత ఒళ్ళు విరుచుకొంది. స్వైర విహారం ప్రారంభించింది.ఎండలకే ప్రసిద్ది చెందిన ఈ పట్టణం చలిలో కూడా అగ్ర తాంబూలం అందుకోవాలని ప్రయత్నిస్తోందేమోననిపిస్తోంది.వెనకటికి ఎవరో ఒక పెద్ద మనిషి హిమాలయ పర్వతాలను గురించి ప్రసంగిస్తూ "హిమాలయాలు గొప్పవి కావచ్చు, మనం చూసామా! ఏమన్నానా! వ్యాసాల్లో చదివితే వాటి సంగతి ఏమి తెలుస్తుంది?అందుకని మా వూళ్ళో కొండలనే మేము హిమాలయాలనుకొంటాము.తప్పేముంది? అని.ఆయన అనడం మాట అలావుంచి ఈ కొండలు ఎందుకనో శీతాకాలంలో ఇదివరకటి కంటే ఎక్కువగా చల్ల బడుతున్నాయి.ప్రజల్ని వణికిస్తున్నాయి. ఈ ఆధునిక యుగంలో మన సంస్కృతీ సభ్యతలు మారినట్లే కొండల స్వభావాలు కూడా మారిపోతున్నాయి.మంచిదే!
పోనీ ఉత్తరాది సోదరులతోపాటు మనము కూడా చలికి వణుకుదాం! ఎన్నింటికి వణకడంలేదు?.ప్రకృతికి వణికితే వచ్చే ప్రమాద మేమిటి?ఆంద్ర ప్రాంతంలో కూడా చలికొంచెం అధిక మైనదని అనుకొంటున్నా -హైదరాబాద్ చలికి దూరంగా వున్నందుకు సంతోషిస్తున్నారు. అక్కడ ఇటీవల ఎనిమిది డిగ్రీల వరకు పడిపోయిందట ధర్మామీటర్ .వెనుక ఒకసారి ఏడు డిగ్రీల వరకు పడిపోయినప్పుడు నేను అక్కడ వున్నాను.రగ్గులు కప్పితే చలి ఆగుతుందని భ్రమ పడతాము. అసలు రగ్గుల్లో ఉన్నంత చలి బయట వుండదు. రగ్గుల్లో వాళ్ళు రగ్గుల్లో మాట్లాడలేక పడిపోవడంకూడా కద్దు. ఉదయం పది గంటల దాకా ఈ చలి అలాగే వుంటుంది. ఈలోపల ఎవరినన్నా పలకరిద్దామంటే మాటరాదు.ఒకవేళ ఖర్మం చాలక పలకరిస్తే అవతల వాళ్ళు జవాబు చెప్పలేరు.పళ్ళు మాత్రం టకటక కొట్టుకోవడం వినిపిస్తుంది. ఇంటిల్లిపాదీ అలా పళ్లు కొట్టుకొంటూ కూర్చుంటే ఏమి తోస్తుంది?
ఒక గృహస్తు భార్యని కాఫీ కాచావా? అని సౌజ్ఞ చేసాడు. ఆమె ప్రతి సౌజ్ఞ చేస్తే బాగుండదని ఏదో చెప్పబోయింది.పాత టైపు మిషను చప్పుడు మాత్రం వస్తూంది. భర్త ఆ మోత భరించలేక "గడ్డం కింద అరిచేత్తో నొక్కుకో .....మాట్లాడక పొతే మానెయ్యి "అని ఆవిణ్ణి దబాయించాడు .చలికి వణుకుతూ ఒక ఇల్లాలు తలొక దిండుమీద వంకరగా పెట్టుకొని నిద్రపోయింది. తెల్లవారి లేచి చూస్తే ఆతల ఆ వైపే బిగుసుకుపోయింది. ఎంతప్రయత్నించినా రాలేదు.మీరు హైదరాబాదు విడిచి వెళ్ళడం మంచిదని అక్కడి వాళ్ళు సలహా చెప్పారు.
మర్నాడు బస్సులో ఆవిడ బయలుదేరింది ఆ వంకర మెడ తోనే! సూర్యాపేట వచ్చేసరికి కొంచెం సరిగా వచ్చిందట. పాపమావిడ జగ్గయ్య పేటలో చూసుకొంటే మెడ సరిగ్గానే ఉందిట.అది హైదరాబాద్ చలి మహాత్మ్య మని ఆవిడ ఇప్పటికి చెప్పుకొంటూనే వుంటుంది.ఎవరన్నా ఆవూరు వెళ్ళ వలసి వచ్చినా"మార్చి దాటేదాకా ఆమాట ఎత్తకండిబాబూ ! ఫిబ్రవరిలో నా మెడకా ఇబ్బంది వచ్చింది" అని అంటూ వుంటుంది. ఇటీవల ఒకాయన పాల మనిషితో అన్నాడట -చలితో బిగుసుకు చచ్చిపోతున్నాము.పాలుకొంచెం పెందరాలేతీసుకు వస్తే ఇన్ని వెచ్చటి కాఫీ నీళ్ళన్నా గొంతుకలో పోసుకొంటాం. కాస్త అయిదు అయిడున్నరకల్లా వస్తూ వుండు నీకు పుణ్యం ఉంటుంది"అని .దానికతడు వెంటనే ఇలా జవాబు చెప్పాడట."ఇళ్ళల్లో దుప్పటీలు కప్పుకొని, కిటికీలు మూసుకొని పడుకొనే మనుష్యులే బిగుసుకు పోతుంటే -పాకల్లో పడివుండే బర్రెలు బిగుసుకుపోవూ! చలిలో ఎంత బాదినా అవి లేవడం లేదు. లేచినా ఫెళ్ళున తంతున్నాయి. సూర్యున్ని చూడందే చుక్కపాలు ఇవ్వడం లేదు.
అవును మరి చలి అనేది అన్నీ జీవులకు ఒక్కటేగా! మానవుడు తన బాధ తను చెప్పుకొంటాడు కానీ ఇతరుల బాధ తలుచుకోడు. సౌకర్యాలున్నకొద్దీ సణుగుతూనే ఉంటాడు.చలికాలానికి సంబంధించిన సరసాలూ, తమాషాలూ కొన్ని వుంటాయి. మొన్న ఒక గృహస్తు అంటున్నాడు,"ఎంత చలి వేసినా రాత్రిపూట కొంచెం షికారు వెళ్లి రావాలనిపిస్తున్నదండీ!అని. "రాత్రిపూట షికారేమిటి? పులిలాగా చలి మీద పది కొరుకుతూంటే! అంటే- కోరికే మాట నిజమే ననుకొండీ. ఒక మంచికోసం బాధ పడటం అవుసరం అవుతూ ఉంటుంది."అన్నాడాయన. అయితే ఆ మంచేమిటి? చెప్పండి. చెపితే నేనూ రోజూ కాస్త తిరిగి వస్తాను."అన్నాను. "చెప్పమంటారా! కొంచెం సేపు తిరిగి ఇంటికి వెడతామనుకొండీ. ఆడవాళ్ళు కొంచెం నిద్ర పోతూ వుంటారు.మనం వెళ్లి తలుపులు కొట్టగానే గజగాజలాడుతూ తలుపు తీస్తారు.అది చాలదు టండీ!' అని ఆయన ముసిముసి నవ్వులు నవ్వారు.
"వణికేది చలికే గానీ మీకు కాదుగా!'అంటే "అలా వివరించి చెప్పకండి!భర్త తలుపుకోట్టడం, భార్య గజగజలాడుతూ తలుపు తియ్యడం జరుగుతుందా లేదా?మన మీరోజుల్లో చూసేది "ఫేసు వాల్యూ" "మైండ్ వాల్యూకాదు. డూ యూ అండర్ స్టాండ్ ? అని ఆయన ఇంగ్లీషులో ఉద్ఘాటించారు.
చలిలో సరసం తో పాటు కొంత వైరాగ్యము కూడా వస్తుంది.దుప్పటిలోనో, రగ్గులోనో తనకు తానే మూట కట్టుకొని పడుకొన్న వ్యక్తీ ఒక్కసారి తల బైట పెట్టడానికి కూడా ఇష్ట పడడు. అందులో తల దాచుకొని పరుండగా ఎంత వేదాంతం వస్తుందో చెప్పలేము. ఆత్మకి అతనికి ఎంతో సంవాదం జరుగుతుంది.
ఆత్మ -ఎక్కడో చప్పుడవుతోంది,దొంగలేమో ఒక్కసారి లేచి చూడు.
తను -చూచి మాత్రమేమిలాభం? మనమేమన్నా వాళ్ళని కొట్టగలమా? ఏమన్నానా? ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది.పడుకోవడమే మంచిది.
ఆత్మ - తీరా నష్ట పోయేది నువ్వేగా?
తను - నష్టమయితే అయిందిగానీ! కష్టపడలేను. ఈ దుప్పటి తీసి ఈ సుఖం పోగొట్టుకోలేను.
తెల్లవారిన తర్వాత లేవనివారికీ ఆత్మకూ సంవాదం ఇలా ఉంటుంది-
ఆత్మ - ఏమిటా బద్ధకం?.............లే....ఎంత పోద్దెక్కిందో చూడు.
తను - నే చూడలేను.నన్ను వేధించకు.
ఆత్మ - ఆఫీసుకు వెళ్లక్కరలేదా?.....ఒళ్ళు అమ్ముకున్నానని జ్ఞాపకం ఉందా?
తను - అమ్మకం మాటేమోగానీ ఈ రగ్గుకు తాకట్టు పేట్టేశా ! ఇది వదిలించుకో లేకుండా వున్నా.
ఆత్మ - జాగ్రత్తగా ఆలోచించుకో ......జీవిత మంటే ఆషామాషీ కాదు.అనేక బాధ్యతలున్నాయి.నిద్ర లేచిన తరువాత నిజరూపం బయట పడుతుంది.
తను - పడితే పడిందిలే! నన్ను పలకరించకు.
ఆత్మ - నే చెప్పేది నగ్న సత్యం.
తను - నగ్న సత్యాలు నాకక్కర్లా!...స్వప్నాలే కావాలి. వాటిలో సుఖమే కావాలి. కాసేపు పలక రించకు.
ఇలాటి కొత్తరకం వేదాంతం చాలా బయలుదేరుతుంది చలిలోంచి.ఈ వేదాంతాలలో వ్యక్తికి ప్రాధాన్యం ఎక్కువ లభిస్తుంది.
మన వ్యక్తిత్వాలను నిలబెట్టడం కోసమే కాబోలు దేశంలో లేని చోట్ల చలి గాలులు ఎక్కువకావడం. [తెలుగువాణి సౌజన్యంతో]
1 comment:
బాగుందండి మీ చలి కధ...
Post a Comment