Pages

Monday, March 8, 2010

మరుజన్మ అంటూ ఉంటే ...




మరుజన్మ అంటూ వుంటే
అనవసరపు విప్లవాలను అణచి వేసే
శాంతి సం దేశాన్నవుతాను


పాలు పొంగే పయ్యెద పై
పమిట వెయ్యని చిత్రానికి
రంగుల ఓణీ నవుతాను


చీకటిలో గుండె గుప్పిట పట్టుకొని
ఒంటరిగా నడిచి పోయే
కన్నెపిల్ల నడుముపై పడిన
చేతికి చురకత్తి నవుతాను


మమకారాన్ని,ప్రేమని డబ్బుతో తూచే
సమాజపు త్రాసుకు ముల్లునై
డబ్బు సిబ్బిని పై పై కి లేపుతాను


దేశ భక్తి రంగుపూసుకొని
పదవిని మారణా యుధం గా మార్చి
భవిష్యత్ పై విషం చల్లె దుర్మార్గులకు
మరణ శిక్ష నౌతాను


మంచి,మానవత్వాన్ని
రక్తం ధార పోసి పెంచే
మహనీయుల పాదాలపై
పువ్వునై నవ్వుతాను


అమాయికపు ప్రాణుల్ని
చివురుల్లా గిల్లి పారవేసే
కసాయి చేతులకు
సంకెళ్ళ నవుతాను


ఎడారిలోని పాంధులకు
నీరు నింపిన మృణ్మయ పాత్రలో
దాహం తీర్చే ధార నౌతాను



రచన
టి.జ్ఞాన ప్రసూన

12 comments:

Anonymous said...

జ్ఞాన ప్రసూన గారూ, అద్భుతం అంతే......!

మరువం ఉష said...

బాగుందండి.. అనుభవం లోంచి వచ్చిన మాటలు ప్రస్ఫుటమౌతున్నాయి.

సుభద్ర said...

నేను కామె౦ట్ గా ఏ పద౦ వాడిన తక్కువే..........అదిరి౦ది, మాటలు లేవు ఎదోతెలియని అద్భుతబావ౦ తప్ప.హ్యట్స్ ఆఫ్ .

పరిమళం said...

జ్ఞాన ప్రసూన గారూ, అద్భుతం అంతే......!నాదీ ఇదే మాట !

psm.lakshmi said...

గుండెలోతులనుంచి వచ్చిన చక్కని కవిత.
psmlakshmi

Friend said...

చాలా బాగుంది. "పయ్యెద అంటేనే (పైట/పవిట/ఓణి) అని ఎపుడో చిన్నప్పుడు చదివినట్లు గుర్తు. పొరపాటు పడుతున్నానా?!

Abhi

Friend said...
This comment has been removed by the author.
జయ said...

స్త్రీకి వ్యక్తిత్వం ఉంది. జీవితాన్ని నిర్మించుకునే స్వాతంత్ర్యం కూడా ఉంది. మీ కవిత చాలా బాగుంది. మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

శ్రీలలిత said...

మానవాళిని ఆదర్శవంతమైన మార్గం లో నడిపించేటట్టు ఎంతో బాగుంది కవిత. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

మధురవాణి said...

చాలా స్ఫూర్తివంతంగా ఉంది ప్రసూన గారూ..!
నిజంగా అద్భుతంగా చెప్పారు.!

మాలా కుమార్ said...

అద్భుతం .

Srujana Ramanujan said...

kavitha chaalaa baagundandee