
గురుపూర్ణిమ అనగానే ఒకటో క్లాసునుంచి చదువు చెప్పిన గురువులందరూ ఒకసారి కళ్ళముందు మెదులుతారు.అమాయక మైన పసి హృదయంలో గురువు రూపం ముద్ర పడిపోయి జన్మంతకాలం చెరగకుండా వుండిపోతుంది.తల్లి,తండ్రి తరువాత అంతటి గౌరవనీయమైన స్థానం ఒక్క గురువులకే ఇయ్యగలం.చేయిపట్టుకు అక్షరాలు దిద్దించి , జ్ఞాన జ్యొతిని హృదయంలో వెలిగించిన గురువుల ఋణం ఎన్నటికీ తీర్చుకోలేము. చదువు అనేది జీవనోపాధికి ఊతగా భావించి నప్పటికి వయసు పెరిగుతూంటే ఆ అక్షర సముదాయంలో దాగివున్న ఎన్నో నిధులు దర్శన మిస్తాయి. పరిశోధనలకి,వినోదాలకి,లలిత కళలకి ,రాజకీయాలకి ఎన్నిటికో పనికి వచ్చే చదువు పరిపక్వ స్థితిలో జన్మ సాఫల్యానికి దారి చూపుతుంది.దైవం ఉనికి తెలుసుకోమంటుంది. చతుర్విధ ఫల పురుషార్ధప్రదమైన జీవితం గడపమంటుంది.
కీకారణ్యం లాంటి సంసారంలో పడి కొట్టు మిట్టాడే జీవుడిని ఆధ్యాత్మికతను అవగతం చేసుకోమంటుంది.ఎలా ?ఎలా? అని తపన పడుతుంటే గురువు వెలుగు కిరణం లా ఎదురవుతాడు.మన జీవితం లోని క్షణాల్ని, ఘంటలని , రోజుల్ని, సంవత్సరాలని చేయిపట్టుకు నడిపిస్తాడు.అదే అసలైన జీవితం.ఆధ్యాత్మిక తత్వాన్ని బోధించి అండగా నిలిచే గురువు దొరకడం అదృష్టం .
ఎందరో కొత్తవాళ్ళు మనకి పరిచయం అవుతూ వుంటారు.ఏప్రయోజనం లేకుండా ఎవరూ మనకి పరిచయం కారు.ప్రతి వ్యక్తిలోను కామ,క్రోధాదులు,బలహీనతలు వుండనే వుంటాయి,వాటితోపాటు ఎదోమంచితనము ,అనుసరించ తగినది వుంతుంది. దాన్ని పట్టుకొనిమనం ఆచరించగలిగితే లాభమే!
శ్రీ దత్తాత్రేయ స్వామి గురుపీఠం లో ఉన్న "నాకు ప్రపంచములో ఎందరోగురువులున్నారని"జీవిత చరిత్రలో చెప్పారు.తెలుసుకోవాలనేఉత్సాహము,వినయము,వుంటే ఎన్నో తెలుసుకోగలుగుతాము.మానవుడు నిత్య విద్యార్ధి . ప్రకృతి అంతా అతనికి గురువే!
మహా భారతాన్ని,అష్టాదశ పురాణాల్ని మనకందించిన వ్యాసమహర్షిని తలుచుకొని కృతజ్ఞతలు అర్పిద్దాము. ప్రమిద,తైలము,వత్తి అన్ని వున్నా దాన్ని ప్రజ్వలింప జేసె అగ్ని లేకపోతే నిరర్ధకమే!అంధకారమే! గుడ్డితనమే! గౌరవంతో, భక్తితో, వినయంతోవ్యాసపూర్ణిమ సందర్భంగా గురుపరంపరకి నమస్కరిద్దాం.
2 comments:
jayagurudatta
గురుభ్యోన్నమః
Post a Comment