అది ధనుర్మాసం. వేణుగోపాలస్వామిని మేల్కొల్పి అభిషేకం చేసేందుకు బిందెలతో తీర్ధం తీసుకువెడుతూ పూజారులు చదివే పవిత్ర మంత్రోచ్చారణల సుస్వరాలు. కింద నారాయణమ్మగారు చదివే ముకుంద మాల స్తోత్రాలు . చల్లని పిల్లగాలి వీటి నన్నిటిని మోసుకొని వచ్చి తట్టి లేపింది సుభద్రని. బద్ధకంగా పక్క మీద కదిలింది. నాన్న రాత్రి తెచ్చిన మల్లె పూల దండ మంచం కొడుకు తగిలించింది. అది అక్కడ వుందో లేదో చూసుకొంది. దండ వుంది. పూలు తెల్లగానే వున్నాయి, వడిలి నల్లగా అయిపోలేదు. సుభద్ర పక్కమీంచి లేచి చేతి వేళ్ళ తో జుట్టు అటూ ఇటూ సవరించుకొని మల్లె పూల దండ జడలో తురుముకొంది . నలిగిన పరికిణీని రెండు చేతులతో గట్టిగా పట్టుకొని విదిలించి మెట్ల మీంచి కిందికి దిగింది. నారాయణమ్మ సుభద్ర వాళ్ళ ఇంటావిడ. ధనుర్మా సం లో ఆవిడ తెల్ల వారు ఝామున లేచి పూజ చేస్తుంది. పిల్లలనందరిని పిలిచి ప్రసాదాలు పెడుతుంది. ఆలస్యం అయితే నారాయణమ్మ పూజ అయిపోయి ప్రసాదం అందరికి పంచి పెట్టె స్తుందేమో? అని వాళ్ళింట్లోకి పరుగెత్తింది. మండువా లోగిలి లోంచి , భోజనాల గది లోంచి , వంటింట్లోకి వెళ్లి నుంచుంది . అప్పటికే రాణి, వాసుగాడు , నారాయణమ్మ మనుమలు వరుసగా నిలబడ్డారు. వంటి ఇంట్లో అడ్డు గోడ వెనక నారాయణమ్మ కోడలు శ్రీ కృష్ణ భగవానునికి నివేదన కోసం చేసిన పిండి వంట ఘుమ ఘుమ లాడుతుంది. వాళ్ళు ధనుర్మాసం నెల రోజులు రోజుకొక రకం పిండి వంటలు చేసి నివేదన చేస్తారు. కట్టె పొంగలి, చక్ర పొంగలి, చేగోడీలు, పులిహోర చేసేవారు.
నారాయణమ్మ కోడలు సరోజినీ అత్తగారి కంటే ముందులేచి దేముని గూడు, తలుపులు, కింద రెండు మెట్లు, చిన్న అరుగు అన్నీ తుడిచి ముగ్గులు వేస్తుంది. తీర్ధం కోసం చిన్ని వెండి గంగాళం , దానికి నాలుగు పక్కలా చిన్నిచిన్ని వెండి గిన్నెలు, వెండి ఉద్దరిణి, ఒక వెండి పళ్ళెంలో శుభ్రంగా కడిగిన తులసి దళాలు , మరో వెండి పళ్ళెంలో ఎర్ర గన్నేరు పూలు, గులాబీలు , జాజి పూలదండలు , ఇంకొక దాంట్లో రకరకాల పళ్ళు సిద్ధం చేసి వుంచుతుంది . పెరుమాళ్ళ విగ్రహాలన్నిటికీ పట్టు బట్టలు, బంగారు నగలు అలంకరించబడి ఉన్నాయి . కృష్ణయ్యకి మాత్రం వెండి ఉయ్యాల. శిఖి ఫించం తో, మెడలో ఎర్ర రాయి గొలుసు ఊగుతూ వుంది. నారాయణమ్మ "మాలై మణి వన్నా మార్గళి నీరాడు ఓం " అంటూ పాశురాలు చదువుతూ వెండి గంగాళం లో నీళ్ళు ఉద్దరిణి తో చిన్న గిన్నెలలో పోస్తూ తులసి దళాల వేస్తూ ఏక చిత్తంతో తీర్ధ ము చేసి పూజచేసింది నారాయణమ్మ . సుభద్ర ఈ పూజంతా శ్రద్ధగా చూస్తూ కూర్చుంది. అన్నిటి కంటే అక్కడ సుభద్రని పళ్ళముక్కలు ఎక్కువగా ఆకర్షించేవి , ముగ్గిన జామ పండు ముక్కలు , గుండ్రని అరటి పండు ముక్కలు, ఆపిల్ పండు ముక్కలు, నేరేడు రంగు ద్రాక్ష పళ్ళు, తొనలు వలిచిన కమలాఫలం ముత్యాలు, దానిమ్మ గింజలు. అవన్నీ కలిపి నివేదన చేసి పంచుతారు. అందరి చేతుల్లో ఒక్కొక్క బాదమాకు పెట్టింది కోడలు. అవి పుచ్చుకొని పిల్లలు బుద్ధిగా, వరుసగా నిలబడ్డారు. .
ఉద్దరిణి తీర్ధం పుచ్చుకొని ఇయ్యబోతూ "అందరు దేవుడికి నమస్కారం పెట్టండి' అన్నారు నారాయణమ్మ.నమస్కరించక పొతే ప్రసాదం పెట్ట రేమో ! అని నమస్కరించారు పిల్లలంతా. అప్పుడు తీర్ధం ఇచ్చింది. పళ్ళ ముక్కలు చేతిలో పెడుతూ నారాయణమ్మ "సుభద్రా! ముఖం కడుక్కున్నావా? " అని ప్రశ్నించింది. కడుక్కున్నా నని కళ్ళతోనే జవాబిచ్చింది సుభద్ర. పక్కనున్న సరోజినీ "అదేమిటి అత్తయ్యా! తలలో పూలు కూడా పెట్టు కొందిగా” అని సుభద్ర వంక ప్రేమగా చూసింది. . సుభద్ర పళ్ళముక్కలు . ప్రసాదం తీసుకోగానే ఒక అడుగు ముందుకు వేసింది. నారాయణమ్మ చూసి "సుభద్రా! వెళ్ళిపోకు పొంగలి ఇస్తానుండు.” అని బాదమాకులో వేడి పొంగలి పెట్టి ఇచ్చింది. వేడికి ఆకు కమిలి కాఫీ రంగుకి మారిపోయింది. సుభద్ర ఆకుని ఆచేతి లోంచి ఈచేతి లోకి మార్చుకొని పళ్ళ ముక్కల ఆకుమీద పొంగలి పెట్టుకొని మెట్లెక్కుతూ గబా గబా తింది . అప్పటికి జీవితం ధన్యమైనట్లు తృప్తి చెందింది సుభద్ర.. ధనుర్మాసం నెల రోజులు ఇలా ఆత్రంగానే గడిచేది సుభద్రకి.
నారాయణమ్మగారిలా పూజ చేయాలని సుభద్రకు ఎంతో ఆశగా వుంది . కాని పూజ చెయ్యాలంటే చక్రాంకితాలు వేయించుకోవాలని గుర్తుకు వస్తే భయం వేసింది. నారాయణమ్మ తన మనుమరాలికి పసిపిల్లకే వేయించారు , ఆ పిల్ల “అమ్మ!అమ్మా!” అని ఏడిస్తే నారాయణమ్మ గారు " అమ్మా!ఆమ్మా! అనకే కృష్ణా ,కృష్ణా” అను అన్నది. పోనీ ఇంట్లోనే పూజ చేసుకుందామనుకొంటే అత్త పూజలే చెయ్యదు. ఎంచక్కగా మన ఇంట్లో కూడా చిన్ని పీట వేసి కృష్ణుడిని ఉయ్యాలలో పెట్టి, వెండి గంగాళం తో తీర్ధం చేస్తే బాగుంటుంది కదు అత్తయ్యా! అంది సుభద్ర. అత్తయ్య శారద వీధి గదిలొ వున్న భర్త వంక చూస్తూ "మీ మామయ్య ధూమ పానం తోనే ఇల్లు నిండి పొయింది. ఇక అగరు వత్తుల వాసన ఏమి పడుతుంది? ఆరాధన లేమి చేస్తాం? “అంది. ఆ మర్నాడు సుభద్ర ఇల్లంతా వెతికి నాలుగు సీసా మూతలు తెచ్చింది. గదిలొ ఒక మూల శుభ్రం చేసి, పీట మీద కృష్ణుని బొమ్మ వున్న పుస్తకం నిల బెట్టింది. నేతి గిన్నె శుభ్రంగా కడిగి నాలుగు పక్కలా సీసా మూతలు పెట్టింది. పూజ అంటే మంత్రాలు చదవాలిగా? ఒక్క మంత్రం రాదు తనకి. "నీపాద కమల సేవయు, నీ పాదార్చకుల తోడి నెయ్యమును, నితాంతాపార భూత దయయును, తాపస మందార నాకు దయ సేయగదే!" అనే పద్యం భాగవతంలోది చదివింది. ఏదైనా ఇంకా చదవాలిగా! మంత్రాలు సంస్కృతం లొ వుంటాయిగా! భగవద్గీత తెచ్చింది. "యతో యతో నిశ్చరతి" అనే శ్లోకం చదివింది. నేతి గిన్నెలో నీళ్ళు పోసి ,తులసి ఆకులు వేసి, నేతి గరిటతొ ఆ నీళ్ళూ నాలుగు వేపులా వున్న మూతలలొ పొసింది. మధ్య మధ్య నేతి గరిట చేతితొ పట్టుకొని ఓం, ఓం, ఓం, కృష్ణ , కృష్ణ , యశోద, యశోదా , రాధా, రాధా అంటూ తీర్ధం ఇందులొంచి అందులొకి మార్చి మార్చి ఆనంద పడుతొంది సుభద్ర.
ఇంతలో పెద్ద పెద్ద కేకలు వినిపించాయి." ఇంత మొద్దావతార మేమిటే! పిల్లాడికి తల తుడిచాక తుండు తెసికెళ్ళి బైట దణ్ణెం మీద ఆరెయ్య వద్దూ? ఎన్ని సార్లు చెప్పాలే! పాడుపిల్లా నీకు?" అని అరుస్తున్న నారాయణమ్మ గొంతు విని సుభద్ర. బిక్క చచ్చి పొయింది. నారాయణమ్మ గారికి ఇంత కోపమేమిటో? వెంటనే ఆవిడ ఎవర్ని గురించి కేక లే స్తుందో ఆ పని పిల్ల రూపం కళ్ళ ఎదుట దీనంగా కనిపించింది. అవన్నీ వదిలేసి గబగబా కిందికి దిగింది సుభద్ర. . ....
3 comments:
చాలా బాగా ప్రారంబించారండి ఙ్ఞానప్రసూన గారు. కథని ముందుకి తీసుకెళ్ళడానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదట. మీ ఆశీర్వాదంతో్ నేను ప్రయత్నించనా? వారం టైం వుంటుంది కాబట్టి రాయగలనేమో అనిపిస్తుంది. నేను రాస్తే కనక మీరు ముందు చూసి బావుందంటే పోస్ట్ చేస్తాను.
ధైర్యే సాహసే లక్ష్మీ అని మొదలు పెట్టేయనా....
namaskaram mamma garu,
na peru bhargavi.eeroje vasundhara lo mee gurinchi chadivanu.meeru ee vyasu lo intha opika ga blog maintain cheyatam nizam ga great
kadhamba malika....1 part chala bhagundhi 2nd part kosam chusthunna
meeku samayam unte naku telugu lo ela vrayalo cheppagalara meeku veelu untene mamma garu .
ఎలాఉన్నారు ప్రసూనగారూ ! చాలాకాలంతర్వాత మీ బ్లాగ్ చూశాను, బాగానే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మీరెక్కడ ఉన్నారు?
ఆదూరి.హైమవతి.
Post a Comment