వన్నెవన్నెల గాజులు
చిన్నారి చేతులకు వన్నె వన్నెల గాజులోయ్
కన్నెపిల్ల కలలన్నీకలబోసిన గాజులోయ్
ముత్యాల గాజులోయ్ మురిపాల గాజులోయ్
రతనాల గాజులోయ్ రమణులకు మోజులోయ్
సుమంగళి గాజులోయ్ శుభమైన గాజులోయ్
సేసల ఆశీస్సులు కురిపించే మణిపూసలోయ్
ఎర్రగాజులేసుకొంటె ఎదురై మొగుడొస్తాడు
పచ్చగాజులేసుకొంటె బావమురిసిపోతాడు
నీలపు గాజులు వేస్తె నీకు నువ్వే సాటి
ఆకుపచ్చ గాజులైతె అడిగావా నీసోకు
రంగురంగులేసుకొంటె రసికులకు సవాలోయ్
తళుకుబెళుకు లేసుకొంటె తంటాలేవుండవోయ్
అద్దాలగాజులోయ్ అలరించేగాజులోయ్
ముద్దు ముద్దు గాజులోయ్ బిళ్ళారి గాజులోయ్
వంకీల గాజులోయ్ వయ్యారుల గాజులోయ్
వజ్రాల గాజులోయ్ వయసు మురిపించే గాజులోయ్
ఈగాజులు వేసుకొనే ఝాన్సీ పోరాడింది
ఈగాజులు వేసుకొనే మొల్ల కవిత వ్రాసింది
ఈగాజులు వేసుకొనే మన దుర్గ సేవ చేసింది
ఈగాజులు వేసుకొనే శ్రీరంగం పాడింది
దీర్ఘ సుమంగళీభవ
ఆరోగ్యమస్తు ఐశ్వర్య మస్తు
పుత్ర పౌత్ర ప్రాప్తిరస్తు
ధన ధాన్య కనక సమ్రుధ్ధిరస్తు.
రచన టీ.జ్ఞానప్రసూన
1 comment:
చిన్నప్పుడు మా అమ్మమ్మా వాళ్ళ ఊళ్ళో, ఇంటి ముందుకు గాజుల బండి వచ్చేది. మా మామయ్య వాళ్ళు చూడడానికి వచ్చి నా చేతికి డబ్బులిచ్చి వెళ్తే, ఆ డబ్బులతో మా అమ్మమ్మ నాకు గాజులు కొని వేయించేది. వేసుకున్నాక బండిలోని గాజులకు దణ్ణం పెట్టించేది. మీ పాట చదివితే మళ్ళీ ఒక సారి ఆ దృశ్యం కళ్ళ ముందు కదిలింది. ధన్య వాదాలు.
Post a Comment