Pages

Saturday, May 17, 2008

అనుకొంటూనేవున్నా పేజీ 1

అనుకొంటూనేవున్నా
కొన్ని మాటలు నిత్య జీవితంలో చాలా సార్లు వాడుతూ వుంటాము.ఇది
నిర్ధారణమైనదికాదు ఒకవిషయాన్ని పట్టుకొని ఇలా అవుతుందేమో, అలా అవుతుందేమో
అని మనస్సు ఊహించే ఒక ఊహ. ఇది ఒకొకసారి తప్పించుకోడానికి, పని దాట
వేయడానికి ప్రయోగిస్తూ వుంటారు. పనిచెయ్య వలసివున్నపుడు, అది చేయకుండా అనుకొంటూ
నేవున్నా అని పదిసార్లు చెప్పడంపాపం. మిత్రులో బంధువులో ఉత్తరం {పొరపాటు
చెంపలేసుకొంటున్నాను, ఈరోజుల్లో ఉత్త్రాలు వ్రాసే వాజమ్మ లెవరున్నారులెండి,యువతరాన్ని,
నిలబెట్టి, నిగ్గతీసి,జన్మెత్తాక ఎన్ని ఉత్తరాలు వ్రాసావు అని అడిగితే,ఎవరికైనా నోట
మాట పెగిలితే నాతో చెప్పండి.] అదే ఈ మైల్ చేస్తే మనం ఎంతకీ మైల్ పంపకపోతే
అదివాళ్ళు గమనిచి,మనతో సంబంధం ఇంకా నిలబెట్టుకోవాలనుకొనేవారూ' మైల్ ''అంటే
''అవు నవును అనుకొంటూనేవున్నా!ఏదీఈమధ్య అసలు తీరికే వుండడంలేదు.పని,పని
ఇంటికి వెళ్ళేసరికి చిన్నాడు నన్ను వదలడు,వాడిని నిద్రపుచ్చి అర్జెంట్ మైల్ లు
పంపేసరికి ఆవలింతలు నిద్ర. ''అంటూచెపుతారు.
ఇంట్లోకి ఆరుగురు అతిథులు అడుగెట్టగానే ఇంటి ఇల్లాలు
ముసిముసి నవ్వులు నవ్వుతూ అనుకొంటూనే వున్నా,గాస్ అయిపోతుందని అలాగే అయిపోయింది.
లేకపోతే కాలీఫ్లవర్ బజ్జీలు,కూటు చేద్దామని కూరలన్నీ తరిగిపెట్టుకొన్నా!అంటుంది.
గాస్ అయిపోతుందేమో అని అనుకొన్నపుడు అనుకొంటున్నపుడు వాళ్ళని పిలవడం ఎందుకు?పోనీ
పిలిచింది,ఏపక్కింటి పిన్నిగారితోనో డీల్ కుదుర్చుకొనీ'మీరివాళ గాస్ ఇస్తె నేను మీకు
చార్మినార్ వెళ్ళేందుకు కారు పూల్ చేస్తానని ఒప్పందం కుదుర్చుకోవచ్చుగా?
అనుకోకుడా భ ర్త పెందరాళే ఇంటికి వచ్చాడు. ఇల్లు తాళం పెట్టివుంది.
ఒక అరగంట రోడ్లు కొలిచి వచ్చాక తలుపు తీసివుంది.గుమ్మంలో కాలు పెట్టి
''ఇందాకటినుంచి రోడ్లు పట్టుకు తిరుగుతున్నా అనుకొంటూనే వున్నా నువ్వెక్కడికయినా దయ
చేసావేమోననీ'అన్నాడు.అప్పుడా విదుషీమణీ' అయినా ఇంత తొందరగా ఎలా వచ్చారండీ?అంది
తనెక్కడికెళ్ళిందో చెప్పకుండా.''ఏమి రాకూడదా''రాకూడదనలా!రారేమో అనుకొన్నాను.'
అనుకొంటావే నీకేం ఎన్నైనా అనుకొంటావు,రారెమో ఆఫీసులో నే ఒక జంపకానా పరుచుకు
నిద్రపోతానేమో అనుకొన్నావు,కానీవచ్చేసాను.ఇంకానయం రెండో సినిమాకూడాచూడటానికి
వెళ్ళలా.''
మీరిలా అంటారని నేను అనుకొంటూనేవున్నా.
ఎందుకండీ మీరు నన్నుగురించి అలా అనుకొంటారు? నేనెప్పుడైనా అలా చేసానా?
నిన్నుగురించి చెడ్డగా అనుకోకూడదని నేను అనుకొంటూనే వుంటా!అయినా నువ్వు
అనుకోకుండావుండనిస్తావా? ఇలా అనుకొంటారిద్దరూ.
ఒక ముసలాయన ఇక ఈబతుకు చాలనుకొన్నాడు, పైకి వెళ్ళిపోయాడు
పరామర్శకు వచ్చిన ఇద్దరు ఇలా అనుకొంటున్నారు.''నేనకోనేలేదండీ!ఈయన ఇలా పోతాడని.
చూసి మూడునెలలు కూడా కాలేదండీ!ఒకచేత్తో కూరల సంచి ఒక చేత్తో పేపరు
పుచ్చుకు నడిచివస్తూ కనిపించాడు. ఎప్పటినుంచో ఈయన్ని చూద్దామని అనుకొంటూనేవున్నా
ఈయనే కనిపించాడే అనుకొంటున్నా ఇంతలో ఈయన్ పై సందులోకి మళ్ళాడు,నేను ఎటో వెళ్ళాను.
మళ్ళీ చూద్దామని అను కొంటూనేవున్నా ఇంతలో కబురు.''''నువ్వు అనుకొన్నావేమో కానీ
నేనలా అనుకోనే లేదు, ఎందుకంటే పిల్లలు విదేశాలలో వున్నారు,వరండా స్థంభాల లాగా
మొగుడు,పెళ్ళాం ఇద్దరు,వయస్సా అరవై దాటింది,ఎంత డబ్బున్నా రూపాయలతో కంచం నిడా అన్నం
రావాలా? నేననుకోంటూనేవున్నా ఎప్పుడో ఈకబురు వింటానని.అని వెళ్ళిపోయాడు.
కుమార రత్నం రిజల్ట్స్ తీసుకు వచ్చాడు.తల్లి చేటంత మొఖం చేసుకొని
''క్లాస్వచ్చిందిరా బుజ్జీ?''అంది.''అందరూ అలానే అనుకొన్నారమ్మా! నేనూ అలానే అనుకొంటూవున్నా.
కనీరాలేదమ్మా!

4 comments:

మాగంటి వంశీ మోహన్ said...

హహ...చాలా బావుందండీ..:)

SD said...

నేను అనుకుంటూనే ఉన్నా మీరు ఇలాంటిదేదో రాస్తారని. ;-)

రాఘవ said...

అందరూ ఏదో ఒకటి అనుకుంటారు అని పిల్లలదగ్గర్నుంచి ముసలివాళ్లదాకా అందర్నీ చుట్టబెట్టేసారుగా.

pruthviraj said...

ఇంట్లో కామెడీ బావుందండి.నేనూ మా ఇంట్లోవాళ్ళు నవ్వుకున్నాము.ఇంకా రాయండి.