పూలబాసలు
చాలా కాలం కిందట మా సరోజిని అక్క అమెరికా వెడుతూకొన్ని
మొక్కలు నాకిచ్చింది.కనకాంబరాలూ అవి వున్నాయి,అందులో ఒక
పారిజాతం మొక్క కూడావుంది. వెనకవేపు స్థలం లేదు అంతా గచ్చు
చేసి వుండేది.అందుకని వాకిట్లో ఒక మూరెడు వెడల్పున పొడుగ్గా
స్థలం వదిలారు.పెద్ద గేటు దగ్గర పారిజాతాన్ని నాటాను,తక్కినవి
కుండీలలో పెట్టాను.ఒక్క సంవత్సరం అయేసరికి మొక్క పెరిగి పది పూలు
పూసింది.పారిజాతం పువ్వు ఎంత సుకుమారమయిన దంటే చెట్టుమీంచి
కింద రాలేటఫ్ఫుడె వడిలి పోతుంది.తెల్లటి రెక్కలు,నారింజరంగు కాడ.
విపరీత మైన పరిమళం.కొన్నిపూలకి మనుష్యులని తట్టి నిద్రలేపే
టంత శక్తిగల సువాసన వుంటుంది. ఆ పూలు ఎక్కువగా పూస్తే ఆవాసనకి
నిద్ర మెళుకువ వచ్చేస్తుంది.పారిజాతాలు రాత్రివేళ విచ్చుతాయి
ఎక్కువగా పూస్తాయి.నారింజరంగు కాడ తెల్లని రేకలకి చెప్పలేని
అందాన్నిస్తుంది.దీన్ని దేవపారిజాతమని అంటారు.సత్యభామ ,రుక్మిణీదేవిల
మధ్య చిచ్చు పెట్టింది ఈచిన్నపువ్వే!రెండోసంవత్సరానికి మా పారిజాతం
పూలు ఏరి పెట్టడానికి రెండుమూడు పళ్ళాలు కావాల్సి వచ్చేవి.మాకు
దేవీ నవరాత్రులు చేయడం అలవాటు.నవరాత్రులలో ఎన్ని పూలున్నాచాలేవికావు.
ఈపారిజాతం వచ్చాక పూలకి కరువు లేకుండాపోయింది.రాత్రి వేళ వాకిలి వూడ్చి
పెట్టేవాళ్ళము.లేచి దంత ధావనం చేసి ముందు పూలుకోయడమే!తరవాత చాయ్ గీయ్.
ఎంత దూరాలోచనతో,ఎంత మంచి మనసుతో మాసరోజినక్క ఆమొక్క ఇచ్చిందోగానీ
మాచేత ఎన్ని పూజలు చేయించాయో ఆపూలు.మా అక్కని తలుచుకోని రోజు వుండేదికాదు.
మా అమ్మగారు ఓపికగా కూర్చుని దేమునిపటాలకి పెద్ద పటాలకి పెద్ద దండ ,చిన్న
పటాలకి చిన్న దండ గుచ్చిపూజ సమయానికి అందించేది.మా అమ్మ చిన్న విగ్రహాలకి
ముద్దుగా ఉంగరాలంత దండగుచ్చి ఇచ్చేది.ఆ పారిజాతాన్ని పూజలో విసర బుధ్ధి
అయేదికాదు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు వరసగా దేవుని పీట పై పరిచేదాన్ని.
సహస్రనామాలు చేసినా నెమ్మదిగా పూలు పరిచేదాన్ని. పూజంతా అయాక మందిరం
ఒక పూల మడిలా వుండేది.డిల్లీలో బంతిపూలు తప్ప మరేపువ్వు కనిపించేదికాదు.
బారసాలనుంచి,పెళ్ళిదాకా ఆపూల తోనే కానించాలి.వసంత విహార్లో సుబ్రహ్మణ్య
స్వామి గుడి కొండ మీద వుండేది,అక్కడికి వెడితే ఎకాగడామల్లెలో మూర ఎనిమిది,రూపాయలకి
దొరికేవి.మా వాకిట్లోనకుండీలలో చంద్రకాంతలు పెట్టాను,అవి సాయంత్రం వేళ ఎరుపు,పసుపు
చంద్రకాంత రంగులో 3ఘంటలకల్లా పూసేవి.సాయంత్రం ఆపూలు పూజకి.దసరాలకి
వాతావరణంచల్లగావుంది పారిజాతాలు,ఒరిగేవికానీ వడిలేవికావు.వాటిని సాయంత్రంపూట
తొలగించేవాళ్ళముకాము. ఆతెల్లపూల మీద ఈ చంద్ర కాంతలు పెడితే ముత్యాలు,కెంపులులా
వుండేవి.రోజూ పూలు ఏరేందుకు ఘంటసేపు పట్టేది.పారిజాతాలతోనిండిన పళ్ళాలు, బెసిన్లూ
తల్చుకొంటేఇప్పటికి కళ్ళలొ కూర్చుంటాయి. డిల్లీ నివదిలిరావడానికి ఎంతో బాధ పడ్డాము
ఈ పారిజాతాన్ని నెలరోజులు కన్నీళ్ళతో అభిషేకంచేసి వదిలి వచ్చాము.ఆ మొక్క
అన్నిపూలు పూస్తుందనుకోలేదు,వాటీతో అన్ని దసరాలు పూజిస్తాననుకోలేదు,వదలి వస్తామని
అసలేఅనుకోలేదు. మధుర మైన,స్వచ్చ మైన,పరీమళాన్ని ఊహల పేటీకలో దాచుకు,అప్పుడప్పుడూ
తెరచి ఆఘ్రాణిస్తూ మా అక్కపై కృతజ్ఞతతో మైమరచి పోతూంటాను.
ఈమధ్య మా సఖులందరం మాట్లాడుకొంటూంటె ధోరణి మొక్కలవేపుపోయింది.
ఆతరవాత పూల దగ్గరకొచ్చి కాలాన్ని మర్చిపోయాము.మొన్న మా మనుమరాలికి పుస్తకాలు కొండానికి
మాల్ కివెళ్ళామునేనూ వేదు.మెట్లదగ్గర ఒక పెద్దమనిషి నిలబడి ఏదో ఆడిగాడు,వేదు అతని చేతిలో
ఒక నోటు పెట్టాడు,అతను వీడికి ఒక పాకెట్ ఇచ్చాడు.వేదు నాచేతికిచ్చాడు.తీరా చూస్తేఅది పూల
విత్తనాల పాకెట్.ఎంత మంచి ఆలోచన? ఒకరు మనవద్ద దానానికి చేయిజాస్తే మనలో దానగుణానికి
విత్తు నాటారన్న మాట.అలాగే ఇతను పూల గింజలు ఇచ్చాడు.పైగా ఆ పాకెట్ మీద ఏమి వ్రాసి వుందంటే
మీరిచ్చే ఈ దానం బ్రష్ట్ కాన్సర్ వచ్చినవాళ్ళ సహాయంకోసం అని. చేయిజాస్తే దానం చెయ్యకపోతే తిట్టేవాళ్ళూ
పూజ అయాక ప్రసాదం చేతులో పెట్టిన ఆయనకి కానుక ఇవ్వకపోతే"తూరుపు తిరిగి దణ్ణం పెట్టూని
"సలహా ఇచ్చేవారూ గుర్తుకు వచ్చారు.
గ్లాసుల్లో మొలకలు మెంతికూర తీసేసాను,పప్పులో వేసి వండేసాను,తినేసాము ఆనందముగా,రుచిగావుంది. ఇంటికి రాగానే ఆ విత్తనాలు బోసిపోతున్న గ్లాసులలో జల్లాను.మొలకలు
వచ్చాయి.వీటిని కొద్ది రోజులయాక విడి విడిగా పెట్టాలి.ముల్లంగి పువ్వులు వడిలిపోయాయి.ఆగ్లాసు ఖాళీనే!
ధనియాలు వేయాలి.
సిరికి ఇద్దరు పిల్లలు.దాని పుట్టిన రోజువచ్చింది.వాళ్ళాయన "ఏమోయ్ !పుట్టినరోజు
బహుమతి ఏమికావాలి? నాపర్సు బరువు గుర్తు పెట్టుకు అడుగు,అన్నాడట.విసుక్కొకుండా కొంటారా?అందిట.
ఏమిచేస్తాను కట్టుకొన్నాక తప్పుతుందాచాటుగా విసుక్కొవాలిమరి.అన్నాడట.నేనొక నిర్ణయం తీసుకొన్నానండీ!
ఇకనుంచీ నాపుట్టీన రోజుకి పూల మొక్కలు బహుమానంగా ఇవ్వండి.అందిట.మంచి ఖరీదైన గులాబీ మొక్క
కొనితెచ్చాడట.అలా గులాబులు గుబాళిస్తున్నాయట వాళ్ళింట్లో.అన్నట్లు సోంపు మొక్కలు వచ్చాయి.కాడలు ఎంత సన్నంగావున్నాయో?
వాటికి వచ్చిన రెమ్మలు దారం నిలబడిందా?అన్నంత సన్నముగా వున్నాయి. వీటిని వదలి చికాగొ
వెళ్ళాలి.వీళ్ళెలా పెంచుతారో? అను అయిదేళ్ళ బట్టీ శ్రీ తులసిని పెంచుతూంది.బహుశహ్ దాని పవిత్ర
భక్తికి అది మారాకు వేస్తోందేమో? ఒక పెద్ద క్రోటను దానిమానాన అది పెరుగుతూంది.వీళ్ళకి వీళ్ళగొంతులు
తడుపుకోటానికే టైం లేదు,వీటిని తడపడం మర్చిపోతారేమో? ఒక మొక్క బొమ్మ వేసి"నీళ్ళుపొయ్యండమ్మా
అనివ్రాసి తాళాల గుత్తి బొమ్మ దగ్గిర పెట్టిపోతా.
2 comments:
జ్ఞాన ప్రసూన గారూ!ఎంత బాగా అంటే----ఎలా చెప్పాలి-----ఆ!మీ పూలవాసనలు చదువు తుంటే పారిజాత పువ్వులను
దోసిట్లోకి తీసుకొని వాటి సుగంధాన్ని ఆఘ్రాణిస్తున్నట్లే వుంది.అతిశయోక్తి కాదు.నిజంగా నిజం. ధన్యవాదాలు.
మామ్మ గారు
మీరు రాసింది చూసి సంతోషించాను. చిన్నప్పుడు మేము మా ఊళ్ళో మిరపకాయ మొక్కలు, కొత్తిమీర, బీరపాదు పెంచాము. మిరపకాయలు చిన్నవి గా ఉండగానే కోసేసి పప్పులో తినేసే వాళ్ళం. ఆ బీర పాదు ఇంట్లోని నారింజ చెట్టు మీదకి ఎక్కించాము. గజం బీర అనేవాడు అన్నయ్య దాన్న్ని. ఎవరో స్నేహితుడు ఇచ్చేడుట విత్తనాలు. నిజంగా ఒక్కో కాయ గజం పొడుగు ఉండేది. అది ఎన్ని కాయలు కాసిందో లెక్కే లేదు.
మీరు షికాగో ఎప్పుదు వస్తున్నారు? మేము ఉండేది అక్కడకి దగ్గిరే (తొంభై మైళ్ళు). మా ఇంటికి రండి. మీ చేతుల్తో రెండు మొక్కలు పాతి వెళ్దురు గాని. నాకు మొక్కలు పెంచడం అంటే చాలా సరదా. ఇక్కడ ఒక ఇంటి దగ్గిర బొండు మల్లె పొదలు ఉన్నాయి. ఎన్ని పూలు పూస్తుందో! ఎవ్వరూ ముట్టుకోరు. రోజూ కోసి దేముడి దగ్గిర పెట్టుకోరే అనిపిస్తూ ఉంటుంది నాకు. దాంట్లోంచి ఒక చిన్న ముక్క తెచ్చి ఇంటిదగ్గిర ఖాళీ స్థలంలో వేసాను. ఇంకా బతికే ఉంది. ఈ ఏడు పువ్వులు పూయకపోయినా వచ్చే ఏటికి పూస్తూందని ఆశ.
మీకు ఈ-మెయిల్ పంపించాను చూడండి.
Post a Comment