Sunday, August 10, 2008
ఎంబ్రాయిడరీ ... ..
మేము బందరులో చెమ్మనగిరి పేట లో వుండెటప్పుడు మేడమీద వుండే వాళ్ళము.
కిందకి వెళ్ళాలంటే వెనక వేపునుంచి, ముందు వేపునించి మెట్లు వుండేవి. ముందు వేపు మెట్లు
మామూలుగా వుండేవి కాని వెనక వేపు మెట్లు మంగమ్మ శపధం సినిమాలో మంగమ్మ ని రాజు
బంధిస్తాడు , ఆ గదిలోంచి బయటికి వెళ్ళడానికి నేలమీద తలుపు పెట్టి సొరంగం
తయారు చేసి వెళుతుంది మంగమ్మ, అలాటి తలుపు వెనక మెట్లకి పెట్టారు, వారిని ఏమి
ఆవేశించిందో అలాటి తలుపు పెట్టారు. మా అమ్మకి చెప్పకుండా,మా అమ్మని వచ్చి తలుపు
పైకి ఎత్త మంటే ఆటకి ఆలస్య మయిపోతుందని నేనే ఆ తలుపు ఎత్తి వరండా పిట్ట గోడకి
ఆ తలుపు తాడు కట్టి వెళ్ళాల్సి వచ్చేది. తాడు కట్టకుండా తలుపుఎత్తి నేను రెండు మెట్లు
దిగాక గోవర్ధన పర్వతం లాటి ఆ తలుపుని రెండుచేతుల్తో నెమ్మదిగా మూసి వెళ్ళే
ప్రయత్నంలో చాలాసార్లు మాడు పగిలినంత పనయి దొంగకు తేలుకుట్టిన ఘటన తల్చుకు
కన్నీళ్ళు గుడ్లలో కుక్కుకొని ఆటకి వెళ్ళిన మహదవకాశాలు ఎన్నో!
మానాన్న గారు ఇంట్లో వున్నంత సేపు నేను పిలిస్తే "ఆ! వస్తున్నా! నాన్నగారూ!"
అంటే మానాన్నగారికి వినపడేటంత దూరంలోనే వుండాలి. ఆయన వెళ్ళాక అమ్మ ఏమన్నా
వినిపించుకొనేదిలేదు, నాన్న గారు వీధి వేపు మెట్లు దిగగానే దిగగానే
ఏమిటి దిగుతూండగానే మనం మంగమ్మ తలుపు ఎత్తి జారుకోవడమే!కింద ఇంటివారింటికి వెడితే అక్కడ వాళ్ళ పిల్లలు ఒకడు మూడేళ్ళవాడు, ఒకపసిపాప. ఎవరితో ఆట? వాళ్ళని ఎత్తుకొనేందుకు ఒకపిల్ల వుండేది, దానితో కబుర్లు చెప్పుకోవాలని, వీలయితే గచ్చకాయలు ఆడుకోవాలని. చిన్నతనం గడిచిపోయింది కాని ఆ అవకాశం దొరకలా! మేము ఎదో మొదలెట్టేసరికి వాళ్ళూ ఆ అమ్మాయికి ఏదో పని చెప్పేవారు, అది ఆపని చేస్తోంటే దాన్ని చూస్తూ జాలిపడుతూండేదాన్ని.
మన జీవితం లో జరిగే పరిచయాలు, సంఘటనలు ప్రతిదానికి ఎక్కడో లంకె
వుంటుంది.ఆ ఇంటావిడ భర్త,కోడలు ఇద్దరు పిల్లలు వుండేవారు. ఆ అత్తగారు చాలా పధ్ధతిగా
రోజు గడిపేది. ఉదయం లేవగానే స్నానాదికాలు పూర్తి చేసుకొని పూజ చేసుకు, వంటావిడకి ఏమి
వంట చేయాలో పురమాయించి రోజూ ఏదో ఒకటి కుడుతూ వుండేది. ఆ రోజుల్లొ వాయిలు, మస్లిన్ సున్నిత మైన
తెల్ల బట్ట దొరికేది,దానిపై ఎంబ్రాయిడరీ చేసేదావిడ. జాకెట్ళపై కూడా ఎంబ్రాయిడరీ చేసేది.
పని పిల్ల పని ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ నేను ఆవిడ దగ్గర కూర్చుని చిన్నగా కుట్టడం
నేర్చుకొన్నాను. అలా కుడుతుండగా నాకు కుట్ల మీద శ్రధ్ధ కలిగింది.తెల్లటి జాకెట్ బట్టపై నల్లటి
దారం తో అడ్డంగా వంకులు వంకులుగా లైన్లు కుట్టాము ,ఆవిడ ఒక వైపు కుడుతుంటే నేను మరొకవైపు
కుట్టేదాన్ని.బట్ట మనది కాదు, దారం మనదికాదు, పైగా ఆవిడంటే భయం,అందుకనే బాగా కుట్టేదాన్ని.
సూదిలో దారం ఎక్కించడం ఆవిడ వద్దనే నేర్చుకొన్నాను. ఆవిడ గురువు అని నేననుకోలేదు, నేను శిష్యురాలని
ఆవిడా అనుకోలేదు,కాని ఇప్పుడు సూదిలో దారం ఎక్కించి ఏది కుట్టినా ఆవిడ గుర్తుకు వస్తుంది. గొలుసు కుట్టు, కాడ కుట్టు షాడొ ఎంబ్రాయిడరీ, ముద్ద కుట్టు, ఇంటుకుట్టు,బుట్టన్ హోల్ కుట్టు ఇలా ఎంబ్రాయిడరీకి మూలాధారాలైన కుట్లన్ని ఆవిడ దగ్గర నేర్చుకొన్నాను.అప్పుడే కొత్తగా జాకెట్లు బుట్ట చేతులు లేకుండా వేసుకోవడం ప్రారంభించారు, నామొదటి జాకెట్ నేనే కుట్టుకొన్నాను.చాలా మంది రెవికలు చేతితోనే కుట్టుకొనేవారు, మాబామ్మ రెవికలు తను కుట్టుకొని ముక్కొణాకారం లో మడిచి దాచుకొనేది. ఆవిడని ఆదర్శంగా చేసుకొని నేను కుట్టు కొన్నాను.మానాన్నగారు నేను కుట్లు కుట్టడం చూసి ఆరోజుల్లొ ఆంకర్ దారాలు వచ్చేవి, వాటిని విచ్చెలు అనేవారు. మెరుస్తూవుండేవి.కొనితెచ్చారు.కామెల్ ఇంక్ అని సిరా బుడ్డిలు ఘట్టి అత్త డబ్బాలలో వచ్చేది. ఆ డబ్బాలో నేను నా దారాలు దాచుకొన్నాను. అది నామొదటి ఎంబ్రాయిడరీ సాధన. తరవాత ఈ కుట్టు నాకు ఎంత మనశ్శాంతిని,తృప్తిని ఇచ్చిందో చెప్పలేను, బట్ట సాదాది దొరికితేచాలు దానిపై ఏదో కుట్టాల్సిందే చీరలు ఎంబ్రాయిడరీ చేయడం మనవి కాకపోతే ఎవరివైన సరే తీసుకొని స్నేహితులకి కుట్టి ఇయ్యడం.సూది దారం నాకు మంచి స్నేహితురాళ్ళు. ఇంటావిడకి ఇందుకు కృతజ్ఞతలు మనసులో చెప్పుకొంటూ వుంటా.ఎన్నొదృశ్యాలని బట్టతెరపై ఎక్కించాను. చిన్న చిరుగు
పడితే దాన్ని అవతల పారేసేవాళ్ళని, సూదిలో దారం ఎక్కించడం రాదండీ అనేవాళ్ళంటే ఆశ్చర్య పోతూ వుంటాను.నాజీవితం లో ఎన్నో ఖాళీ రోజుల్ని ఈ ఎంబ్రాయిడరీ రంగులతో నింపింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment