Pages

Thursday, March 5, 2009

తిరణాలు

మనదేశం లోనే వున్నా ఉద్యోగాలకోసం దూరం పోయాక పండగలకి సంబరాలకి దూరం అయిపోతాము.

చాలా ఏళ్ళక్రితం మా పెద్దబ్బాయి చిన్నబ్బాయిగా వుండేటప్పుడు మా తాతమ్మ తో కలిసి తిరణాలకు వెళ్ళాము.నులక మంచాల మీద బెల్లపు కొమ్ములు, బెల్లపు బూందీ ,జీడీలు అమ్మితే .కొనుక్కుని తిన్నాము. పిల్లలు ఆదుకొనే డమడమాలబండీ లుండేవి ,వాటికి ఒక డ్రమ్ము కట్టివుండేది. బండి లాక్కువెడుతూంటే దానిమీద రెండు పుల్లలు డమ డమ శబ్దం చేసేవి. పిల్లలకి ఆశబ్దం సరదాగా వుండి ఆబండి లాక్కుంటూ ఆడుకొనే వాళ్ళు.బండికి తాడు కట్టాలి.అక్కడ తాడు దొరక లేదు మా అబ్బాయి గొడవ చేసాడు .తరవాత బ్రహ్మాస్త్రం ఏడుపు మొదలేట్టాడు.తాతమ్మ తొమ్మిది గజాల తెల్ల వాయిల్ కట్టుకొనేది,చెట్టు చాటుకు వెళ్ళి చీర వదులుచేసి కొంగు పెద్దగా లాగి బండికి కట్టింది,ఆకొంగుతొ బండి కొంచెం దూరం నడిచింది. తాతమ్మ వుపాయంతో మావాడి మొఖం వికసించింది.గాజులు పూలు కొనుక్కొని ఎద్దుబండి మీద ఇంటికి చేరాము.

మొన్న శివ రాత్రికి నూజివీడులో వున్నా.అందరూఒకఘంట దూర ప్రయాణం లొ వున్న శివాలయం దర్సించడానికి,తిరణాలకి బయలు దేరారు.వారి ఆస్థాన ఆటో లోఎక్కి ఎనిమిదిమంది మంది వెళ్ళాము.అది సెవెన్ సీటరులెండి.ఇక్కడె ఇక్కడే అంటూ ఘంటన్నరకి చెర్చాడు.గుడికి రెండు మైళ్ళ దూరంలోదూరంలోఆటో ఆపేసారు.అసలు గుడికి వెళ్ళాలంటే ప్రొద్దున్నే వెడితే ప్రశాంతం గా వుంటుంది.మావాళ్ళన్నారు,ఇది చాలా పురాతనమైన శివుని గుడి,ఎక్కడెక్కడినుంచో భక్తులు అర్ధ రాత్రికే వచ్చి చేర్తారు,మధ్యాన్నానికి వాళ్ళంతా వెనక్కి బయలుదేరతారు, మనం మధ్యాన్నం బయలు దేరి వెడితే గుడి ఖాళీగా వుంటుంది,హాయిగా చూడొచ్చు అన్నారు, ఒంటిగంటన్నరకి బయలుదేరాము.ఎండ బాగావుండి.ఆటొ దిగాము.అక్కడినుంచి గుడిదాకా ఉచిత బస్సులు నడుస్తున్నాయి.అందులో ఎక్కాలంటే రెండేళ్ళన్నా కరాటే నేర్చుకోవాలి. నేర్చుకొని ఎక్కినా సీటులేదు.పాటక జనం ఎక్కువగా వున్నారు.నడుద్దామంటె వాహనాల మధ్య ధైర్యంచాలలేదు. మావాళ్ళలో,కాలు ఫ్రాక్చరు అయి తగ్గినవాళ్ళు,లో బీ.పి వున్నవాళ్ళు వున్నారు.""పెద్దవాళ్ళూ నడవలేనివాళ్ళు వున్నారు,ఆటొ గుడిదగ్గర దిగి వెంటనే వెనక్కి పంపేస్తాము అని వాలంటీర్లను బ్రతిమాలాము,వాళ్ళు ససేమిరా ఒప్పుకొనలేదు.భక్తులారా రండి,చక్కని సదుపాయములు,వుచిత బస్సు సర్వీసు అన్నివున్నాయి అని అడుగడుగునా పోస్టర్లు పెట్టారు.ఇక వెనక్కి వెళ్ళిపోవాల్సిందేనా?అనుకొన్నాము.



ఒక పోలీసాయన మా విషణ్ణ వదనాలను చూసివెనక దారినవెళ్ళి గుడికి అరకిలో మీటరు దూరంలో బడ్డికొట్టు దగ్గర మమ్మల్ని దింపి వెంటనె వెనక్కి ఆటో పంపండి అని అనుమతి ఇచ్చాడు.గుడిదగ్గర రష్ ఎలావుందండి అంటే బాగా వుందమ్మా!అక్కడ నుంచి లోపలికి వెళ్ళడం మీవంతే అన్నాడు.కనీసం గుడి గోపురమైనా దర్శించుకు వద్దాము అని వెళ్ళాము.సెల్ ఫొన్లు ఇలాటి సమయాల్లొ దేవతలే! మానెంబరు అతనికి చెప్పి,అతని నెంబరు మేము తీసుకొని అతన్ని వెనక్కి పంపాము.ఎక్కడికక్కడ కంబారుతాళ్ళతో కట్టీ క్యూలు ఏర్పాటు చేసారు, అన్ని నిండుగా వున్నాయి.బయట పెద్ద మైదానమే వుంది.ఒక దారి డొంకా ఏమిలేవు.దైవ దర్శనం చేసుకొని వచ్చినవాళ్ళు అక్కడ బైఠాయించి తినడం,తాగడం ఖాళి గ్లాసులు కాగితాలు పక్కనే పడేస్తున్నారు. అన్నాలుతిని కూచున్న చోటే పళ్ళాలుకడిగి తుక్కు నీళ్ళూ పారబోస్తున్నారు.క్యూ లో నిలబడి వెళ్ళడం న్యాయమే! కానీ అందులోనిలబడి వెళ్ళి వచ్చేసరికి సాయంత్రం అయి పొతుంది. సాయంత్రం కుర్రకారు అంతా వస్తారు, ట్రాఫిక్ పెరిగి పోతుంది,ఎట్టి పరిస్థితిలోనూ నాలుగయ్యెసరికి మీరు ఆటో ఎక్కాలి అని ఇంటి దగ్గర మామయ్య వార్నింగ్ ఇచ్చాడు. అక్కడవాళ్ళకి వుపాయము, ధైర్యము ఎక్కువే!


ఎలాగోలా క్యూలో దూరిపోతున్నారు. ఒకసారి అక్రమ మార్గంలో రెండు బాచిలు దూరిపోయాయి.అప్పుడు మేము కాస్త గొంతు పెంచి పోలీసాయనతో వాళ్ళు వెళ్ళారుగా,మమ్మల్ని వెళ్ళనీయండీన్నాము, ఏమనుకొన్నాడొ వదిలాడు.వెళ్ళీ దైవ దర్శనం చేసుకొన్నాము.శివరాత్రి వుపవాసం సఫలమైంది.బయటికి వచ్చాము, పదండి ఇంటికి పోదాము అంటే మాతో వచ్చిన కుర్ర పిల్లలు"ఒక్కరౌండ్ తిరిగి ఒక్కలుక్కు వేసివస్తాము,రాలేనివాళ్ళు ఆనీలం గట్టు దగ్గర కూర్చోండి అని గుంపులో అంతర్ధానమయారు.నాతో వున్న వాళ్ళు అక్కడ నేల పై చతికిల బడ్డారు,పక్కన సాంబారు నేలమీద పారుతోంది.ప్లాస్టిక్ గ్లాసులు కుప్పలు పడేసారు. తిండి తిన్న ఆకులు ఎగురుతున్నాయి.ఇంతలో పదిమంది చీపుళ్ళూ పట్టుకు వచ్చారు,వూడ్పు మొదలెట్టేసరికి దుమ్ము తుఫానులా లేచింది,కళ్ళుముక్కు ఏకమయాయి,ఊపిరి అందలేదు. ఒకరికి నీరసం వచ్చింది. మంచినీళ్ళ సీసాలు కుర్రకారు మోస్తున్నారు.ఐస్ క్రీం ఇప్పిద్దామని బండీవాణ్ణి పిలిస్తే బారెడు దూరం పోయి "రండమ్మా!" అన్నాడు. అయుదు రూపాయలకి ఉసిరికాయంత ఐస్ గడ్డ కప్పులొ పెట్టి ఇచ్చాడు. అదితెచ్చి ఆవిడ నోరుతడిపితే కళ్ళు తెరిచింది.పక్కస్టాలులొ ఒక కుర్చిచూసి కూర్చోపెట్టాము. గంట సేపటికి వాళ్ళంతా వూసురోమంటూవచ్చి కొనుక్కొడానికి ఏమీ లేవని ఒక పర్సు , ఒక కత్తి కొనుక్కొచ్చారు. ఆటో వానికి ఫోన్ చేసి ,ఆనీరసం వచ్చినావిణ్ణి చెరోరెక్కాపుచ్చుకొని బడ్డికొట్టు దాకతెచ్చెసరికి ఆటో వచ్చింది, అందులో స్థిరపడ్డాము.


వెళ్ళేవారికి వెళ్ళెతొందర, వచ్చేవారికి వచ్చేతొందర.మోటారు సైకిళ్ళపై రయ్యిమని పోతున్నారు,బస్సులు, ఆటోలయితే చెప్పక్కర్లా,వున్నవాళ్ళని దింపి మళ్ళివస్తామని అక్కడ జనాల్ని కూర్చోపెట్టారులావుంది, ఆఘమేఘాల మీద నడుపుతున్నారు. కొంత దూరం వచ్చాము,బళ్ళన్నీ ఆగిపోయాయి. దిగి చూస్తే ముస్సలి అమ్మాయి రోడ్డు నడిమధ్యలో నెత్తుటి మడుగులో వుంది,ఒకరు పట్టుకు కూర్చున్నారు,ఆటో ముళ్ళపొదలో పడిపొయివుంది.కళ్ళవెంట నీళ్ళూవచ్చాయి."శివరాత్రి నాడు పోయింది,ముక్తి పొందింది అంటున్నారు జనం. ఈవిషాదం మోసుకొని ఇంటికి బయలుదేరాము.తిరణాలు సంవత్సరానికి ఒక్కసారి చేస్తారట. ఆరోజే డబ్బు చేసుకోవాలని అందరికి ఆరాటం. ఉత్తిరోజులలో గుడి కి సందడె వుండదుట. ఈ ఆత్రం ప్రమాదాలకి దారి తీసింది.ఇటువంటి చోట బందోబస్తు జాగ్రత్తలు ఎక్కువతీసుకొంటె మంచిది.

No comments: