Pages

Friday, April 10, 2009

పాటల సందడి - ఎందుకే నీకింత తొందర

 నాకు నచ్చిన పాట...



ఎందుకే నీ కింత తొందర!
ఇన్నాళ్ల చెరసాల ఈ రేయి తీరునే!
ఓ చిలుక! నా చిలుక! ఓ రామ చిలుక!
ఒయ్యారి చిలుక! నా గారాల మొలక!
ఎందుకే నీకింత తొందర...

బాధలన్నీ పాత గాధలై పోవునే!
వంతలన్నీ వెలుగుపుంతలో మాయునే!
ఏలాగో ఓ లాగు ఈ రేయి దాటెనా
ఈ పంజరపు బ్రతుకు ఇక నీకు తీరునే
ఎందుకే నీకింత తొందర...

ఆ తోట ఆ తోపు ఆకుపచ్చని గూడు
ఆ వంక గొరవంక అన్ని ఉన్నాయిలే!
చిరుగాలి తరగలా, చిన్నారి పడవలా,
పసరు రెక్కల పరచి పరువెత్తి పోదాము
ఎందుకే నీకింత తొందర...


 మల్లీశ్వరిలో   శ్రీమతి భానుమతిగారి ఈ పాట నాకెంతో ఇష్టం. సంగీతం, సాహిత్యం, నాయికా నాయకుల హావభావాలు వెరసి ఒక మధురానుభూతిని కలిగిస్తాయి. ఆపాత మధురాలు నిజంగా అద్భుతాలు ...

మల్లీశ్వరి ,నాగరాజు విడిపోతారు. మల్లీశ్వరి  రాజుగారి అంతః పురంలో చిక్కుకొంటుంది
నాగరాజు శిల్పాలు చెక్కడానికి రాజుగారి  దగ్గరకి వస్తాడు. అదృష్ట వశాత్తు ఇద్దరు కలుస్తారు,మరునాడు పారిపోవడానికి నిర్ణయించుకొంటారు. ఆరాత్రి మల్లిశ్వరికి నిద్రపట్టదు, కాని రామ చిలుక తొందర పడుతున్నట్లు దానిని సముదాయిస్తూ పాడుతుంది.


తనలోని తొందరను ఆ రామచిలుకకు ఆపాదించి పాడుకుంటుంది మల్లీశ్వరి. ఈ ఒక్క రాత్రి గడిస్తే ఈ పంజరం నుండి బయటపడి తమ ఊరిలోని తోటలో హాయిగా తిరగొచ్చు , విడిపోయి పడ్డ బాధలన్నీ పాత కథలైపోతాయి, తెల్లారగానే చిరుగాలి తరగలా చిన్నారి పడవలా పారిపోదాము అని తనకు తానే చెప్పుకుంటుంది మల్లీశ్వరి.


చిరుగాలి తరగలు , ఆ వంక గొరవంక, వంతలు పాలపుంతలు వంటిపదాలు కృష్ణ శాస్త్రి గారే  వ్రాయగలరు, చక్కని సాహిత్యం,సంగీతం,పాలపిట్టలాటి నాయిక, సుందర దృశ్యాలని మనసులో  హత్తుకొనేలా చిత్రించే దర్శక మహాశ్యులు, అందుకే మల్లీశ్వరి ఒక మహాకావ్యంగా   రూపొందింది. అంతః పుర బంధాలన్నీ ఎప్పుడు తెంచుకు బయట పడదామా అనే తపన,భయమ,ఆనందం పాటలో మూతకట్టింది భానుమతి.


ఆపాట  ప్రేక్షకులని  కంటతడి పెట్టించింది.. ఈనాటికి  ఆ  దృశ్యం  నా కళ్ళలోనే వుంది.

7 comments:

psm.lakshmi said...

చాలా బాగుంది ప్రసూన గారూ
psmlakshmi

మధురవాణి said...

చాలా చక్కటి పాటని పరిచయం చేసారు ప్రసూన గారూ..
ఈ సినిమా చూడాలని ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాను. ఎప్పుడు తీరనుందో ఆ కోరిక మరి.!

ఈగ హనుమాన్ (హనీ), said...

"పసరు రెక్కల పరచి పరువెత్తి పోదాము"
ఎంత గొప్ప కవిత్వీకరణ గదా!!
చక్కని పాటను పరిచయం చేసారు ప్రసూనాజీ, అభినందనీయులు.
చక్కని సాహిత్య ప్రేమికుడు
ఈగ హనుమాన్ visit: nanolu.blogspot.com

మాలా కుమార్ said...

ప్రసూన గారు,
చాలా మంచి పాట ఇది.బాగుంది.

Bhãskar Rãmarãju said...

కొన్ని కొన్ని పాటలు జీవితంలో భాగాలైపోతాయి. కొన్ని కొన్ని సినిమాలు కూడా. అలాంటి కోవకు చెందినది ఈ పాట, మరియూ మల్లేశ్వరి సినిమా.
ఆ తోట ఆ తోపు ఆకుపచ్చని గూడు
- అత్యంత రమణీయం
నాకు నచ్చిన పాటలు మల్లేశ్వరి నుండి..ఇక్కడ చూడండి
http://paatapaatalu.blogspot.com/search/label/%E0%B0%AD%E0%B0%BE%E0%B0%A8%E0%B1%81%E0%B0%AE%E0%B0%A4%E0%B0%BF

పరిమళం said...

ప్రసూన గారూ!చాలా చక్కటి పాట.పరిచయం బాగుంది.

రానారె said...

మంచి పాట వినిపించారు. ఈ పాట నేపథ్యం చదివి మరింత ఆనందించాను. కృతజ్ఞతలు.