గురుభ్యోనమః:
గురువు అనే పదం వినగానే ఎంత వాళ్ళయినా కొంత
కుంచించుకు పోతారు. గౌరవం తో ,భయంతో మనసు మూగది అయిపోతుంది.పుట్టి కళ్లు తెరిచాక అమ్మ ఇచ్చిన అమృత తుల్య మైన
చను బాలు రెండు చుక్కలు గొంతులో దిగినప్పటినుంచి పసి హృదయానికి సర్వ జగత్తు విచిత్రంగా వుంటుంది.గురువులా భాసిస్తుంది.
ఇక క్షణ క్షణము నేర్చుకోడమే జీవిత ధ్యేయ మయిపోతుంది.అమ్మ,నాన్న కుటుంబ సభ్యులు వీరే గురువులుకాని గురువులై ఎన్నో మాటలు,చేష్టలు మేధలో ముద్రిస్తారు.
నిజంగా బడికి వెళ్ళాకా మొదటి గురువు కి మనసు సింహాసనం వేస్తుంది.జీవితాంతము ఆ గురువును తలచుకోగానే మనః ఫలకం పై
లీలగా వారి రూపం కనిపించి బరువైన మొగ్గ తలవాల్చినట్లుఒరిగిపోతుంది.
నా చిన్నతనంలో మేము బందరులో వుండే వాళ్ళం ఖోజ్జిలి పేటలో ,కొంచెం దూరంలో కోటవారి తుళ్లు అని కూడలి వుండేది.మా ఇంటి నుంచి సరాసరి వెళ్లి ఎడం చేతి వేపుకు తిరిగితే ఆక్కడ తాడేపల్లి హయగ్రీవ రావు గారి మేడ వుండేది .ఆ ప్రాంతాలలో మా బడి.అంటే ఒక్కటే హాలు,వెనక చిన్న పెరడు.అక్కడజామ చెట్టు వుండేది ఆ చెట్టు కొమ్మ కిందగా వుండేది.దానిమీద కూర్చుని స్నేహితురాలితో "మామిడి కొమ్మలు చిగురించేన్ ,ఒక మారిటు చూడవే కోకిలా" అని పాడుకొన్న దృశ్యం కళ్ళల్లో వుండి. మా టీచరుగారి పేరు కృష్ణ వేణి .జుట్టు తెల్లబడిపోయి ,నేత చీర కట్టుకొని ,చేతిలో బెత్తం పట్టుకొని ,స్థూలకాయంతో నిర్లిప్తంగా మాకు అక్షరాలు,పాటలు,ఆటలు నేర్పేవారు.
ఆవిడతో మాట్లాడటం కాదు ఆవిడ వంక చూడాలంటే భయం.నా మొదటి గురువు ఆవిడే!ఆమె ఆత్మకో నమస్కారం.
బడిలో నుంచి బయట పది హమ్మయ్య అనుకొందామంటే వేరే
స్కూలులో హెడ్మాస్టర్ చేస్తున్న రాజమ్మగారు మా పక్క వాటాలో వుండే వారు.మా వంటింటికి వాళ్ల వంటింటికి మధ్య తడికె అడ్డం.వెదురు పెళ్లతో
అల్లి కాంతలు కంతలుగా వుంటుంది.మాటలు ఒకరివి ఒకరికి స్పష్టముగా వినిపించేవి.ఎప్పుడన్నా అన్నం వద్దంటే ,పెరుగు వద్దంటే ఆవిడ వాళ్ల వంటింట్లో నుచి హూ అని ఘట్టిగా అనేవారు,అంటే పిల్లిలా అమ్మ పెట్టినది తిని బయట పడేదాన్ని.ఆమెకి ఇద్దరు చెల్లెళ్ళు వుండేవారు,వారు నన్ను
భయపెడుతూవుండేవారు.రాజమ్మ టీచరుగారంటే నెత్తిమీద దేవత ,మాట వేద వాక్కు.ఆవిడ ఎర్రగా ,పొట్టిగా ,వత్తరిగా వుండేవారు.చేతికి వాచీ ,ఖద్దరు చీర ,గంభీర మైన వాక్కు.మారాలు చెయ్యకూడదు,టైం కి అన్ని పనులు చెయ్యాలి అని ఆమె నేర్పారు.వారింట్లో హిందీ క్లాసులు జరిగేవి.అందరూ,ఆఖరికి మా అమ్మ కూడా,హిందీ టీచరు కూడా ఆవిడ
మాట వింటుంటే నాకు ఆవిడంటే అభిమానం ఇంకా పెరిగి పోయింది.నాకు
టీచరు కాక పోయినా పరోక్షంగా బుద్ధులు నేర్పించిన గురువుఆమే.ఆమె
ఆత్మకు నమససులు.
గురుజాడ రాఘవ శర్మగారు వుండేవారు.మానాన్న గారు
ఆయనా తరుచు కలుసుకొనే వారు.మేము చేమ్మనగిరి పేటలోవుండగా
మా ఇంటి వెనక "చల్ల బజారు "వుండేది.చుట్టూ పక్కల పల్లెటూర్ల నుంచి
పెరుగు పిడతలలో తోడు పెట్టి తెచ్చి అమ్మేవారు.మనకి ఎంత ఖరీదుకి ఎంత చిన్న పిదతతో కావాలన్నా పెరుగు దొరికేది.చాలా మంది పెరుగు
కోసం చల్ల బజారుకి వచ్చి మా ఇంటి మీదుగానే వెళ్ళేవారు .రాఘవ శ్ర్మగారుకూడా రోజు వచ్చేవారు.నాన్నగారి దగ్గరికి వచ్చి "అక్కడ పెరుగు కొనుక్కోడం,ఇక్కడ మీగడ తరకలు ఆస్వాదించడం .అనేవారు.ఆయన పద్యం ఎలా చదవాలో చెప్పేవారు.ముందే భాగవతం లోని సరస్వతీ ప్రార్ధన "శారద నీరదేందు "చెప్పారు.ఆపద్యం అంతా ఒకేసారి చదవాలిఆపకుండా,మదిగానగ నేన్నెడు గొల్తు భారతీ !నాలుగోపాదంలో మది దగ్గర కాస్త ఆపవచ్చు .ముందు అలా చదవడం నేర్చుకో అన్నారు.
ఎంత కష్ట మయ్యేదో!ఒకోసారి రోడ్డు మీదనుంచి కేకవేసి "ఏమి అమ్మాయీ !వచ్చిందా!అనేవారు.నేను పైనుంచి వెర్రి మొఖం వేసి నిలబడే దాన్ని. రేపు చెప్పు అని వెళ్ళేవారు.పద్యం విరవకుండా చదవడం నేర్చుకొన్నా.వారి ఆత్మకి నమస్సులు.
ముట్నూరి కృష్ణారావుగారి భార్య పేరు "రుక్మిణమ్మ గారు .ఆమె చాలా విశాల హృదయురాలు.మనిషిని చూస్తె నమస్కరించా లనిపించేది.వారిద్దరి పేర్లు ఎంత బాగా కలిసాయో! ఆమె సంక్రాంతి పండగకి ఇంట్లో కుంకుమ తయారు చేసి ,గుర్రపు బండి మీద కొందరి ఇళ్ళకు వెళ్లి వారిని పిలచి బండీలోంచే బొట్టు పెట్టి కుంకుమ అందించేవారు.వారు ఆమె పాదాలకు నమస్కరించేవారు.ఈద్రుశ్యం నా కళ్ళలో వుంది. అందరికి ఒక వట వృక్షం లా వుండేవారామే.ఒకసారి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు శతకాలు బాగా చదివి కంఠస్థం చేయాలని చెప్పి పద్యం చదివే టప్పుడు భావం చెడకుండా ఎక్కడ ఎలా ఆపి ఆపి చదవాలో చెప్పారు.అది మర్చిపోలేను.తరవాత నేను నేర్చుకొన్న పద్యాలు చదివించుకొని విని ఆశీర్వదించేవారు.ఆమెనాకొక గురువే!ఆమె ఆత్మకు నమస్సులు.
మానాన్న గారి బాల్య మిత్రుడు దాలిపర్తి నారాయణరావు అని వుండేవారు.మానాన్నగారి స్నేహితులందరినీ నేను "బాబాయి "అని పిల్చేదాన్ని.ఆయన దగ్గర టీచింగ్ కెపాసిటీ ఎక్కువ వుండేది.తరవాత ఆయన నిజంగా టీచెరు అయి ఫాక్టరీలో లాగా విద్యార్ధులను డిగ్రీ కళాసాలలనుడి బయటికి విడుదల చేసారు.ఆయన పద్యం చదివి" వీణలు మ్రోగగా "అని వున్దెదనుకొన్ది.ఆయన రెండు చేతులతో వీణ వాయిస్తూ టుం టుం అని వీణ శబ్దం చేసింది అని చెప్పేవారు. శబ్దానికి ధ్వని తో అర్ధం అయేలా చెప్పాలని ప్రయత్నించేవారు.ఏదైనా చెప్పమంటే అరటి పండు వలిచి చేతులో పెట్టినట్లుగా చెప్పే సామర్ధ్యం ఆయనకీ చాలా వుంది.పద్యాలు హ్రుద్యమంగాచదివేవారు.ఎన్నిసార్లు మళ్ళి మళ్ళి అడిగినా విసుగు లేకుండా పద్యాలు చదివి వినిపించేవారు.ఆయన నాకొక గురువే!ఆయన ఆత్మకి నమస్సులు.వీరందరి చలవతో నా మనస్సనే హంస సారస్వత మనే తటాకంలో షికార్లు చేసింది.తియ్య తియ్యని లడ్డూలు అందించే బందరులోని ఆ బాల్యపు మధుర స్మ్రుతులివి . అందుకే కబీరు అంటాడు, గురువే దేవుడని.
2 comments:
చాలా బాగా రాశారు.
మ౦చి అనుభవాలు రాశారు,
చేసిన మేలు మరవకు౦డా ఉ౦డట౦ నిజమైనా ధ్యా౦క్స్ అని నా అభిప్రాయ౦.
మీకు,మీ గురువులకి నా టీచర్స్ డే శుభాకా౦క్షలు.
అమ్మా!
చాలా బాగా వ్రాసారు.
టైటిల్ లో గురుభ్యోన్నమః అని నాక్రింద నా వ్రాయనవసరం లేదు. వ్రాయ కూడదు కూడా! ఎందుచేతనంటారేమో
శ్రీ గురుభ్యః + నమం = శ్రీ గురుభ్యో నమః. అని మాత్రమే ఔతుంది. గమనించి మార్చగలరు.
Post a Comment