ఎస్.వరలక్ష్మి
ఒకప్పుడు దగ్గరగా మెలిగిన వ్యక్తులు -నదిలో కలప లాగా ఎటో కొట్టుకు పోయి విడిపోతారు.మళ్ళి కలవరు.ఎందుకని కారణ మేమిటి?
అని ప్రశ్నిస్తే కారణం ఎమీ దొరకదు.ఎస్.వరలక్ష్మి గారు చనిపోయారనగానే నాకు అలానే అనిపించింది. కాని వారిని గురించిన జ్ఞాపకాలు ఒక్కసారి కళ్ళ ముందు తిరుగుతాయి.మా నాన్న గారు సినిమాలకి వ్రాసేటప్పుడు మాకు రెండు సంస్థలవారితో పరిచయం వుండేది.ఒకటి భరణి,రెండు రాజ రాజేస్వరిసంస్థ .కన్నాంబ గారు,కడారు నాగభూషణం గారు రాజ రాజేశ్వరి సంస్థ అధిపతులు.ఎస్.వరలక్ష్మిగారు
వారి సినిమాలలో నటించేవారు.నాన్నగారు వ్రాసిన "సతి సక్కుబాయి "సతీ సావిత్రి"సినిమాలలో వరలక్ష్మి గారు ప్రధాన పాత్రలు పోషించారు.
వీటికి సంభాషణలు నాన్న గారే వ్రాసారు.
మద్రాసుకు బంధువులు వచ్చినా,స్నేహితులు వచ్చినా సినిమా షూటింగులు చూడాలని సరదా పడేవారు. వారితో పాటు నేను వెళ్ళేదాన్ని.ఒకసారి అలా వెళ్ళినప్పుడు కన్నాంబ గారు, వరలక్ష్మిగారు, జిక్కి గారు అక్కడ వున్నారు. షూటింగ్ విరామంలో బయట కూర్చున్నారు,నేను కూర్చున్నాను.జిక్కి గారు అందరికి గొంతు దానమిస్తే,కన్నాంబగారు,వరలక్ష్మిగారు తమ పాటలు తామే పాడుకొనేవారు."మేము ఎన్నో సినిమాలలో పాడాము,మాకు సంగీతం అంతా కొట్టిన పిండి "అనుకోనేవారుకాదు.ఒకవేపు నటిస్తూ,పాడుతూ
నిత్యమూ గురువుల వద్ద సంగీత సాధన చేసేవారు.కన్నాంబగారయితే
నాటకాలలో ఎంతో పెరుతెచ్చుకొన్నారు.ముగ్గురు కూర్చుని రాగాలుసంగతులు వేసుకొంటూ పాడుకొంటున్నారు.కన్నాంబగారంటే అందరికి తల్లిలాటి గౌరవం.ఆమె అన్నారు"నేనొక సంగతి పాడతా విని మీరూ పాడాలి." అని.పాడారు.జిక్కిగారు,వరలక్ష్మిగారు ప్రయత్నించారు కాని ముందుకు వెళ్లలేకపోయారు,వారిద్దరూ కన్నాంబ గారికి దణ్ణం పెట్టి
"అమ్మా!ఇలాటి సంగతులుపాడి మమ్మల్ని పరీక్ష పెట్టకమ్మా!మీలా మావల్లకాడు.అన్నారు.నవ్వుకొంటూ ముగ్గురూ లేచి వెళ్లిపోయారు.ఆనాటి వారిలో రాదనీ చెప్పగాలిగేనిజాయితీ,ఇంకా నేర్చుకోవాలనే అభిలాషా ,స్వచ్చతా ముచ్చట వేసింది.వారు నిత్యోపాసకులు.
మా పెద్దబ్బాయి పుట్టినపుడు వరలక్ష్మిగారు పురుటిలోనే బాబును చూడటానికి వచ్చి వెండిదికోలకంచం ఇచ్చారు."అబ్బో!ఇంతదా!"అన్నాను నేను ఆమె నవ్వి"అన్నం తినే కంచం ఇప్పుడే ఇచ్చారేమిటి?అనుకొంటున్నావా?మీ అబ్బాయి నేనిచ్చిన కన్చంలోనే తినాలి.ఈలోపల తాతగారు చేయిస్తారేమోనని పట్టుకు వచ్చా "అన్నారు.అలాగే మా అబ్బాయి ౧౨ ఏళ్ళు వచ్చేదాకా ఆ కంచం లోనే భోజనం చేసాడు.
నవ్వుమొహంతో నిండుగా తెలుగు పడతిలా వుండి తన మధుర గానంతో ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకొన్నారు వరలక్ష్మిగారు.ఆమె ఆత్మకు శాంతి నియ్యలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.వరికుటుంబానికి నా సానుభూతి అందజేస్తున్నాను.
No comments:
Post a Comment