Wednesday, December 16, 2009
అంతులేని చింతలు
ఈ రోజుల్లో అందరికి చింతలు ఎక్కువయిపోయాయి. ఈ చింతలవల్ల వంతలు .ఈ చింతలకి చిన్నా పెద్దా లేదు. ఎవరికీ తగ్గ చింతలు వారికి. కదలిస్తే చాలు చింతలు చిక్కులు వర్ణిస్తారు. చింతలు సరే చింతకీ మరో చింత లింకుగా పుడుతూ వుంటుంది. పని జరుగుతుందో? లేదో? అని చింతిస్తూ వుంటే ఆపని జరగకుండానే దానికి లింకుగా మరో చింత పుడుతుంది.
ఒకింట్లో పనిమనిషి "రెండు రోజులు సెలవియ్యండమ్మా “ అని బ్రతిమాలిందిట. ఆవిడ వాయిదా వేస్తూండేది. చివరికి ఆ పనిమనిషి పండగ నాడు సెలవు పెట్టేసింది. ఆవేళ ఎవరు ఇంటికి వచ్చినా ఆ ఇల్లాలు చీపురుకట్టతోనో , అంట్ల గిన్నెతోముతోనో దర్శన మియ్యాల్సి వచ్చింది. వచ్చిన వాళ్ళు "అయ్యో! మీరు పనిచేసుకొంటున్నారా! " అని పైకి సానుభూతిగా పలకరించినా లోపల బాగా అయింది అనుకొన్నారట .ఈవిడ వారం రోజులదాకా చింతిస్తూనే వుంది. పనిమనిషి రానందుకు కాదు, పండగపూట రానందుకు చింతించింది. ఈసంగతి ప్రతివాళ్ళకి తెలియడం ఈవిడకి లింకు చింత అయింది. మానేస్తే మానేసిందనుకో, పండగపూట మానేసిందని లింకు చింత.
ఒక ఆఫీసరు గారి అబ్బాయి, ఒక మామూలు ఉద్యోగస్తుడి కొడుకు స్నేహితులు. ఇతనిపేరు రాము,అతని పేరు విజయ్. విజయ్ నాన్నగారి పరపతితో రాముకి రెండు సినిమా పాసులు ఇప్పించాడు. రాము, చెల్లెలు వెళ్లి సినిమా హాలులో సీట్లో కూర్చున్నారు. సినిమా మొదలయింది. రాము చెల్లెలు మాటి మాటికి లేచి నుంచుని వెనకకి చూడటం మొదలెట్టింది. రాము కేమీ అర్ధం కాలేదు."ఏమిటే!సినిమా స్క్రీన్ ముందుంటే నువ్వు మాటికి వెనక్కి చూస్తావు? అన్నాట్ట. చెల్లి ఏడుపుగొంతుతో "ఏమి ఫ్రెండురా నీఫ్రెండ్? బాల్కనీలో చూడు-సోఫాలు,ఫాన్లు ఎంచక్కా వున్నాయో?" అంది. పాస్ లిప్పించింది చాలక బాల్కనీలో ఇప్పించలేదనే చింతతో ఆ అమ్మాయి సగం సినిమా చూడనేలేదు.
సుగుణమ్మగారి డ్రైవరు ఒక రోజులో వస్తానన్న వాడు పది రోజులైనా రాలేదు. డ్రైవరు ఎక్కడున్నా,ఏదైనా కబురు చెప్పాలన్నా సౌకర్యం గా ఉంటుందని సెల్ ఫోన్ కూడా కొనిచ్చారుట. చేతిలో ఫోను ఉంది కదా! అర్జెంటుగా పని వస్తే రాలేకపోయాను, ఫలానా అప్పుడు వస్తాను అని చెప్పలేదనే చింతతో కుంగిపోయిందావిడ. ఎవరో వచ్చి "మీ డ్రైవరు వచ్చేసరికి పదిరోజులవుతుంది అన్నాడండీ! అని చెప్పారు. జీతం బత్తెం ఇచ్చేదాన్ని నాతొ చెప్పకుండా వాళ్లెవారితోనో చెప్పడమేమిటి? అని మరోచింత ఆవిడకి. డ్రైవరు ఇల్లు దూరమని స్కూటరు కొని ఇస్తే త్వరగా వస్తాడని స్కూటరు కుడా కొన్నారట. సుగుణకి గభాలున ఆ స్కూటరు గుర్తుకొచ్చింది. అది ఇంట్లో పెట్టి వెళ్ళాడో!లేదో!అని పెరట్లోకి వెళ్లి చూసింది. లేదు. స్కూటరు డ్రైవరు తీసుకెళ్లాడా? ఎదొంగైనా పట్టుకుపోయాడా? అని చింతించింది. డ్రైవర్ సెల్ కి ఫోన్ చేసింది. అవతల్నించి డ్రైవరు ధీమాగా" వూరు వచ్చేటప్పుడు బస్సు స్టాండులో పెట్టానండీ ! వచ్చేటప్పుడు తీసుకువస్తా " అన్నాడు. హారి వీడి ధైర్యం దొంగలుదోలా! మేనమామ ఇంట్లోనో మేనత్త ఇంట్లోనో పెట్టినంత ధైర్యంగా చెపుతున్నాడు! అనిఅనుకోంది. డ్రైవరు స్కూటరు తెచ్చి ఇంట్లో పెట్టేదాకా చింత ఆవిడని జలగాలాగా పట్టుకు పీడిస్తూనెవుంది.
విదేశాలలో వున్నవాళ్ళు ఇండియాలో వున్నా వాళ్లకి ఫోన్ చేసి మాకు తెలిసిన వాళ్ళు ఫలానా తేదీలో వస్తున్నారు,ఫలానా వస్తువు మాకు కావాలి కొని వారితో పంపండి అని కోరుతూవుంటారు. అలాగే తప్పకుండా అంటాం మనం. ఆ ఫలానా వాళ్ళు మనదేశానికి రాగానే ఒక ఫోనుకోడతారు, ఏమండీ! మేము ఫలానా.ఫిబ్రవరి నెలాఖరుకి వెడతాము అని. అప్పుడు మొదలౌతుంది చింత. ఇలాగే నాటకాభిమాని సిం సినాటీ నుంచి మావారికి ఫోన్ చేసి"ఒక పౌరాణిక నాటకం వేస్తున్నాము, రాజుగారి పాత్రకి దుస్తులు కావాలి, చమక్ చమక్ మనాలి పంపండి” అంతే మావారు ఓకే అన్నారు.నాతో వచ్చి చెప్పారు. డ్రామా డ్రెస్సులు నాకేమి తెలుస్తాయండీ అంటే "ఆ!తెల్లారి లేస్తే పదహారు సార్లు షాపింగులకి తిరుగుతావుగా చూడవోయ్ !అన్నారు" షాపింగుకి వెడితే చీరలు, చుట్టపిన్నులు కొంటాగానీ నాటకాల డ్రెస్సులు కొననుకదా !అన్నాను. కానీ మావారి వాగ్దానం నిల బెట్టడానికి ఆరోజునుంచి దుస్తుల కోనుగోలు విషయంలో పదిచోట్ల తిరిగి, పదిమందినడిగి ఇరవై ఫోన్లు చేసి మొత్తానికి డ్రెస్ ఆర్దరిచ్చా, ఎడ్వాన్సు కూడా ఇచ్చా.
వారం అవగానే తెస్తాడో లేదో అని చింత. 15 దాకా ఆయన అతాపతా లేడు. టీవీ లో చూపించే చిట్ ఫండ్ చెట్టులాగా నా చింత పెరిగిపోయింది. రెండురోజుల ముందయినా వారికి డ్రెస్ అందివ్వకపోతే ఎలాపాక్ చేసుకొంటారు? మళ్ళి ఫోన్లు, ప్రదక్షిణాలు , హెచ్చరికలు చేయగా చేయగా 16 కి తెచ్చాడు. ఆ ఫలానా అయన దగ్గరికి తీసుకు వెడితే తీరా పెట్టెలో చోటు వుందంటాడో! లేదంటాడో! అని చింత. ఆ డ్రెస్ చిన్న రజాయి మడిచినంత వుంది. ఎ సన్యాసులో తప్ప ఇండియా వచ్చిన వాళ్ళు స్వదేశీ సరుకుల్ని {నాలుకగీసుకొనే బద్దలు దగ్గరనుంచి} కొని పెట్టె పొట్ట పగిలిపోయేలా కుక్కి తీసుకు వెళతారు. ఆయన ఎన్ని కొనుక్కోన్నాడో! ఈ డ్రెస్ కి చోటు లేదంటే! బోలెడు ఖర్చు చేసి కొన్నాము. కుట్టినవాడు తిరిగి పుచ్చుకొంటాడా! అని లింకు చింత. పోనీ మనమే వుంచుకొందాం అనుకొంటే అదేమీ పట్టుచీరా? పిండిరుబ్బే మిషనా? ఇది ఎలాగో పంపించి తీరాలి. నేనూ మా ఆయనా ఒక ఉపాయం ఆలోచించాము ఆయన వెళ్ళఏటప్పుడు ఈ డ్రెస్ వేసుకు వెళ్ళిపోతే దిగాక మార్చుకోవచ్చు అని చెపుదాము అని. అదృష్టం బాగుండి డ్రెస్ తీసుకు వెళ్ళాడు. ఈయన వెళ్ళగానే వాళ్లకి ఫోన్ చేసి చెపుతాడో లేదో? అప్పుడప్పుడు ఇతరుల చింతలు నాకేల ఇంతలా అయిపోతుందేమోనని చింత. ఇలా చిత్తం లో మెదిలే ఈ చింతలు గుండెల్లో బండరాళ్ళు పెరుస్తాయి.
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
చింత లేని జీవితం ఉండదు కదండీ. ఎప్పటికీ తనివి తీరనిదే జీవితం. అదే తమాషా!
అమ్మా,
చింతల గురించి బలే చింతిస్తూ(ఆలోచిస్తూ) రాసారండీ.
ఈ చింతలు వద్దన్నకొద్దీ పుడుతూనే ఉంటాయి. చింతించకుండా ఉండలేము.
ప్రస్తుతం మీరు ఈ విషయం ఇంత బాగా ఎలా రాసారా అని చింతిస్తున్నాను.
Post a Comment