Pages

Saturday, February 6, 2010

చిరుజల్లు

మా అన్నయ్య శ్రీ నాగేశ్వర రావు, మా వదిన స్రీమతి జయలక్ష్మిగార్ల వైవాహిక బంధం బిగిసి యాభై వసంతాలు నిండిన సందర్భంలో చెల్లాయి చిలకరించే పన్నీటి జల్లులు.

చిన్న నుదురు,ఉంగరాలు తిరిగి వత్తుగా వున్న తలకట్టు,రాజమా గింజంత చుబుకం,చురుగ్గా తిరిగే చూపులు ,కచ్చిత మైన వాక్కు, ఎర్రటి నైలాన్ ఓణీవేసుకొని కూర్చుంది ఒక కన్నెపిల్లా. నూనూగు యవ్వనం,భవిష్యత్ పై కలలు. బంగారు,రంగారు ఆశలుమదిలొంచి ఉబికి వస్తుంటే ,అవకాశం కోసం అణిచిపెట్టుకొన్న సభ్యత. పది వూళ్ళుతిరిగి,పది కాపురాలు చూసి,పది రకాల దాంపత్యాల పందిళ్ళు పరిశీలించి ఇంతకంటే గొప్పగా,ఇంతకంటే వైనంగా,ఇంతకంటే ఆదర్శంగా,దేశకాల పరిస్తితుల కనుగుణంగా ఇంతకంటేపధ్ధతిలొ సంసారం పరుగెత్తించాలని ,కోయిల పాటలు వింటూ,నీలాకాశంలో బారులుతీరి సాగిపోయే కొంగల గుంపుల్ని తిలకిస్తూ,సాహిత్యంలో,భక్తిలో,మానవసేవలోఏవో ఆదర్శాల అంచుల పయనాలు సాగించాలని ఉవ్విళ్ళూరే యుక్త వయస్కు డైన ఒక కుర్రవాడు.చీకతి,వెలుగు పడుగు పేకల్లా అల్లుకొన్న పల్చని వెలుతుర్లో ఇరవై మంది బంధువుల మధ్య ఒకరినొకరు చూసుకొన్నారు.భావాలకి పరుగులు మాటకి నియంత్రణ.

ఆ కుర్రవాడే మా అన్నయ్య.ఆ కన్నెపిల్లే మా వదిన.మా వదిన అంతరంగాన్ని అంచనా వేసేందుకు మా అన్న నాకొక ప్రశ్న పత్రం ఇచ్చి జవాబులు తెచ్చే బాధ్య్త నాపై పెట్టాడు.మావదిన నెగ్గింది,మా అన్న మురిశాడు.దేవతలు తధాస్తు అన్నారు.వీరిరువురూ ఒక గూటిలోకి చేరారు.

మా అన్నయ్య జీవితంలో ఒక్కటే విషాదం.అన్న్య్యకు రెండేళ్ళ వయసులోనె మా పెద్దమ్మ కమల స్వర్గస్థురాలయింది. తల్లి ఇచ్చే తియ్యటి మమతానురాగాల్ని అన్నయ్య అనుభవించ లేకపోయాడు. అయినా మా తాత గారు,అమ్మమ్మ అన్నయ్యకు తలితండ్రులై వారికి పుట్టిన బిడ్డలతో సమానంగా పెంచారు.మా తాతగారు స్రీగిరిరజు రామ చంద్రయ్యగారు ఆంగ్లం బోధించేవారు.మాలో పాఠాలు చెప్పే యోగ్యత ఏదన్నా వుంటే అది మా తాతగారిచలవే! ఆయన శాంతము,కార్య దీక్ష,కఠిన పరిశ్రమ అన్నయ్యకి ఉగ్గుపాలతో అందించారు. చిన్నతనం లో మా అన్నయ్య మాకు హీరో! అందర్ని మొట్టికాయలు మొట్టి ఏడిపిస్తూ వుండేవాడు.అప్పుడు మాకేం తెలుసు?పెద్దయ్యాక వేలమంది విద్యార్ధుల మెతక బుధ్ధికి మొట్టీకాయలు కొట్టే మేష్టరవుతాడని ఎరుగున్నామా?ప్రిన్సిపాలు కుర్చీఅధిష్టిస్తాడని కలగన్నామా?
మా వదిన అయినింటి కుటుంబంలో పెరిగిన అసలైన ఆంధ్రుల ఆడపిల్ల.వాళ్ళ నాన్న గారు శ్రీ విన్నకోట మాధవరావుగారు తెల్లటి గుబురు మీసాల లోంచివెన్నెలవంటి నవ్వు నవ్వుతూ హాయిగా జీవితం గడిపిన స్వచ్చ మనస్కుడు.వారి పుట్టింటి సభ్యులు ఐకమత్యానికి ప్రతీకలు.చాకుల్లాటివారు,మెరికల్లాటివారు.అపార మైన లౌకిక జ్ఞానం కలవారు,మాటసంపన్నులు,చేత సమర్ధులు.మా వదిన అన్ని గుణాలు పుణికి పుచ్చుకొంది. మా అన్నయ్య అలుపెరుగని కృషీవలుడు."ఇంతింతై వటుడింతయై"అన్నట్లుగా పెరిగిన ప్రజ్ఞా వంతుడు.మా వదిన అన్నకు తోడై,నీడై సన్నగా సలహాలిస్తూ,సహనంతో సంసారం సాగించిన సాధ్వీమణి. .అనారోగ్యాలు ఆవరించినా,ప్రవాస జీవనం గడిపినా ఒకరికొకరై నిలిచారు.

జీవన మహాయానంలో పూల పందిళ్ళు పిల్లలు.రామకృఇష్ణ,రవి,కల్యాణిముగ్గురూ అటువంటి పూల పందిళ్ళే!తలితండ్రుల మనసు ఎరిగి నడుచుకొనే సంతానం ఐశ్వర్యాలలో ఒకటి.దాంపత్య జీవనంలో అన్నయ్య,వదిన కలసి యాభై మెట్లు ఎకారు.వారిరువురికి శక్తి,స్థిమితము,బలము,నిశ్చలమైన మనస్సు ఇవ్వాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. కృషి చేయడంలోనోఓ , ఘట్టీ నిర్ణయాలు తీసుకోవడం లోనూ,పట్టిన కార్యక్రమాన్ని ఆరు నూరైనా అనుకొన్న సమయానికి నెరవేర్చడంలోనూ"పనే విశ్రాంతి"అనే సూక్తిని అవలంబించడంలోనూ మా అన్నయ్యకి అన్నయ్యేసాటి.మాకందరికి మా అన్నయ్యే ఆదర్శం.వృత్తి రీత్యా కూడా ఎద ఎదలో విజ్ఞానపు విత్తనాలు జల్లే మా అన్నయ్యకి జోహారులు.


చెల్లాయి
టి..జ్ఞాన ప్రసూన

No comments: