Pages

Friday, September 17, 2010

మా బందరు


మా బందరు
మా బందరు అంటే నా కెంతో గర్వం గా వుంటుంది. ఎందఱో మహానుభావుల కి ఉనికి పట్టు మా బందరు. బందరు వుడిచి ఎన్నో సంవత్సరాలయినా "బందరు వాళ్ళన్నా ,బందరు కబుర్లు విన్నా "మనసు పుల్కాలా పొంగిపోతుంది. అలాటి సంఘటనే ఈమధ్య ఒకటి జరిగింది.
బెంగళూరు లో మా అబ్బాయి ఇంటి ఎదురుగా ఒక పార్క్ వుంది.పక్కనే కొత్తగా వెలిసిన చిన్న వినాయకుడి గుడి.రోజూ ప్రొద్దున్నే గణపతిని పలకరించి వాకింగ్ కి పార్క్ కి వెళ్ళడం నా దినచర్య అయిపొయింది.ఒకరోజు అలాగే వాకింగ్ చేస్తున్నాను,వెనకనుంచి సన్నగా మాటలాడుకొంటూ ఒక మగ గొంతు, ఒక ఆడ గొంతు వినిపిస్తున్నాయి.బతుకులో ఎందుకూ పనికిరాని బిడియం మనకి కొంచెం ఎక్కువ.వాళ్ళని చూడాలేదు,పలకరించాలేదు.కాని వాళ్ళూ నేను ఒకేసారి బయటికి వచ్చాము. వాళ్ళు రెండు అడుగులు ముందున్నారు . ఆయన ఎర్రగా బక్కపలచగా వున్నారు,ఆవిడ జరీ అంచు నేతచీర లో,చిక్కటి తలకట్టుతో ముద్దమందారంలా వున్నారు.ఇంతలో ఆవిడ ఒక అడుగు వెనక్కి వేసి నిలబడి"మీరు తెలుగువారా?"అన్నారు.అవునండీ!అన్నాను."మీ కట్టు బొట్టు చూసి తెలుగువారనే అనుకొన్నాను.పలకరిస్తే కదా పరిచయం అయేది.పలకరిస్తే తప్పేముంది?అని "అన్నారు.వెనకనించి ఆయన "మాది బందరు"అన్నారు.ఇంకేముంది?ప్రాణం లేచి వచ్చింది."బండరా?మీపేరు అన్నాను."పువ్వాడ తిక్కన సోమయాజి "అన్నారు.ఇంతచక్కటి పలకరింపు, ఇంత హుందా అయిన పేర్లు బందరు వారికి కాక మరేవరికుంటాయి అనుకోని ఆయన ముఖం వంక తేరిపార చూసాను."నీ తలపాగా కుచ్చు "అని శ్రీముట్నూరి కృష్ణారావుగారిమీద పద్యం వ్రాసిన శ్రీ పువ్వాడ శేషగిరి రావుగారు గుర్తుకు వచ్చారు.శేషగిరి రావుగారు మీకు బందువలా?అన్నాను."నేను వారి అబ్బాయిని "అన్నారాయన .అవునా! ఇప్పుడు పోలికలు తెలుస్తున్నాయి అన్నాను.ఆయన ,ఆవిడ ముసిముసిగా నవ్వారు.మాదీ బందరే !రావూరు అంటుంటే ,సత్యనారాయణగారు అన్నారాయన.మానాన్నగారు అన్నాను.వారిద్దరూ రోడ్డుమీదే నాకాళ్ళకి వంగి నమస్కరించబోతుంటే ఖంగారు పది నేను కాళ్ళు వెనక్కి తీసుకొన్నాను.మహానుభావుడు ఆయన ,మీకీ పద్యం ఎంత బాగా గుర్తున్నదండీ!అని వారిద్దరూ సంతోష పడిపోయారు.అలా బందరు సాహితీ ప్రియులు పరిచయం అయారు.పువ్వాడ శేషగిరి రావుగారు ,మా నాన్నగారు తరుచు కలుసు కొంటూ వుండేవారు.తిక్కన గారి భార్య పేరు ఇందిరా గారు.బందరు వదిలి బెజవాడ వచ్చేసాము.మామ గారి ఇల్లు ఇంకా బందరులో వుంది.ఇక్కడ మా అబ్బాయిలిద్దరూ వున్నారు.వేసవికాలంలో ఇక్కడకు వచ్చి ఉంటాము.అనుకోకుండా బందరు వారు మీరు కలిసారు"అన్నారు ఇందిర.అప్పుడనిపించింది అయ్యో రోడ్డుమీదే నిలబడి మాట్లాడుకొంతున్నాము,మా అబ్బాయి ఇల్లు ఇక్కడే రండి అని ఇంక్తికి తీసుకు వెళ్లి మావాళ్ళకి,మా వియ్యపురాలికి పరిచయం చేసాను.ఇంతలో ఆయన సెల్ మోగింది.ఆయన మాట్లాడి"మా మనవడు ఒక్క క్షణం వదలదు,ఆలస్యమయిందని ఫోన్ !అన్నారు .ఇందిరగారు నవ్వుతూ ఎన్నోకబుర్లుచేప్పో మధ్యాన్నం నాలుగుకాలా వస్తాను,మావాడి ఇల్లు దగ్గరే!మిమ్మల్ని పరిచయం చేస్తానని చెప్పి వెళ్లి సరిగా నాలుగులల్లా వచ్చి నన్ను,మా వియ్యపురాలిని తీసుకెళ్ళారు,మనవల్ని,ఇంటిని చూపించి,కొడుకు ,కోడల్ని పరిచయం చేసారు.వాళ్ళబ్బాయి మాకు ఫోటోలు తీసారు.అప్పటినుంచి రోజు పార్కులో కలిసేవాళ్ళం .వాకింగ్ అయాక నుంచుని కాసేపు కబుర్లు,ఇంకా అవకపోతే బెంచీమీదకూర్చుని కబుర్లు .వాళ్ళ పెద్దబ్బాయి కుటుంబం కూడా చూపించాలని ఇందిరాగారికి తహతహ.అది మాకు చాలా దూరం. ఇక కుదరదులే అనుకొన్నాం. ఇంతలో మా అన్నయ్య బెంగళూరు వచ్చి వాళ్ళబ్బాయి ఇంట్లో దిగాడు.వాని చూడటానికి వెడితే ఇందిరగారి పెద్దబ్బాయి ఇల్లు అటువేపే అని వదినగారు గుర్తు చేసారు.అక్కడినుంచి ఫోన్ చేస్తే "పదినిముశాలుపడుతుంది,రండి రండి అని ఇందిర చెప్పారు.నేను వదినగారు వెళ్ళాము.వాళ్ళ పెద్దబ్బాయి ఎంతో వినయంగా ,వాళ్ళ కోడలు ఎంతో సరదాగా పలకరించారు.పది నిముషాలు కూర్చుని వచ్చేసాము.ఇందిరాగారికి మారాక తృప్తి నిచ్చింది.పెద్దతనం లో మన పిల్లల్ని పరిచయం చేయడం, వారి అభి వృద్ధిని గురించి గర్వంగా చెప్పుకోవడం ఒక కాల క్షేపం. అందులో ఒక ఆప్యాయతా ఆనందము వున్నాయి.సరే ఇంతకీ పువ్వాడ వారిని గురించి చెప్పనేలేదు. "వంద చందా మామలు" అనే పుస్తకం లో మా నాన్నగారు పువ్వాడ వారిని గురించి వ్రాసిన వ్యాసం చూడండి.
పువ్వాడ వారు విజయ వాడ లో ఉండగానే కృష్ణా పత్రిక,ఆంద్ర పత్రిక సంపాదకులకు ఘన సన్మానం జరిగింది.ఆ సమయంలో యువకుడైన పువ్వాడ వేదిక మీద నిలిచి చదివిన పద్యాలు మరపురానివి.ఆనాడు ముట్నూరి వారి మీద చదివిన పద్యాలలో ఒకటి ఎంతో ప్రచారం లోకి వచ్చింది.అవును,అది కృష్ణా రావుగారి మూర్తి వంతాన్ని ముక్త సరిగా వర్ణించింది."నీతలపాగ కుచ్చు తవనిన్చేడుతీవియే ఠీవి ఏ మహీ,నేతకుచేత కాదుగద నీ నడకన్ గల సోయగమ్ము కృ,ష్ణా తరనామ్బు సంభవ నినాదము పొండుడు గాదె తద్వ చ ,స్రీతతరంగ నాద వివ శీకృత సర్వ జానాను మోదమున్.పువ్వాడ వారికి కవిత్వం పేరు చెపుతే పులకరిస్తుంది శరీరం .ఆయన వ్రాసిన "గోవస్తం"కావ్యం కరుణకు నిదర్సనం .ఇది చాలా సున్నిత మైన ఒక చిన్న సంఘటన.ఒక లేగా దూడ మీద కలిగిన సానుభూతి కావ్యం గా మారింది.కరుణ ప్రసరించక ఏమి చేస్తుంది?పువ్వాడ వారు పిమ్మట వ్రాసిన గ్రంధం"దారా"ముస్లిం ఇతి వృత్తం మీదకు పోయింది వారి కలం.అక్కడ శృంగారం ,సౌర్యం రెండూ అందినాయి వారికి."దారా"లో కట్టి దూసినట్లుగా వ్రాసారు కవిత్వం.ఇక ఆయన చదువుతూంటే వినాలి.ఎంతో సౌర్యం,క్రోధం వారిలో గోచరించేవి.పాత్ర తానె అయినట్లుగా భావించి చదివేవారు.ఆయన గారు అంత ఉద్రేకం తో వ్రాసిన కావ్యం కావడం వల్ల మరొకరికి వినిపించేతప్పుడు,ఆఉద్రేకం ద్విగుణీకృత మయ్యేది.అందువల్ల వారి గ్రంధం వారి చేతనే చదివించుకొని వినేవారు,చాలామంది.శేషగిరి రావుగారు బందరు హిందూ కాలేజిలో ,నేషనల్ కాలేజిలో పండితులుగా పని చేసారు.అంతకుమున్డుకొంతకాలం విజయనగరం కాలేజిలో కూడా వుంది వచ్చారు.ఎక్కడ పని చేసినా అన్నీ ఇతర శాఖలతో పాటు తెలుగు శాఖకు గౌరవ ప్రతిష్టలు కలిగించ గలిగారు."ఆయన పద్యం వినాలి,ఆయన పాఠం వినాలి.లేకపోతె ఏదో సంపద పోగొట్టు కొన్న ట్లు వుంటుంది ."అని విద్యార్ధులు అనుకొంటూ వుండటం నేను విన్నాను.పూర్వ కవుల మీద పువ్వాడ వారికి ఎనలేని గౌరవం.ఎన్నో లోతులు వెతికి ముత్యాలు వెలికి తెచ్చేవారు.ఇంకా ఏదో అందలేదనే భావం ఆయనలో గోచరించేది.అలాటి తితీక్షా,సమీక్షా వుండటం వల్లనే వారి బోధనలు విద్యార్ధులను అరి కట్టేవి.ఆయనగారు కొన్నాళ్ళు ముని మాణిక్యం వారి ఇంట్లో తిక్కన భారతం చదివి అర్ధం చెప్పారు. నేను తప్పకుండా హాజరయ్యే వాణ్ని.చెప్పడం లో ఆయన ప్రదర్శించే నేర్పు,తీర్పు ఎంతో గొప్పగా ఉండేవి.అసలు పద్యం కనపడితేనే పరవశించే స్వభావం ఆయనది.ఛందస్సు పేరు చెపుతే ఎప్పుడూ ముందడుగే! అందులో కవిత్వం అంటే మరీ గౌరవం.తిక్కన అంటే మరింత మక్కువ .అందువల్లనే కాబోలు వారి కుమారునకు "తిక్కన సోమయాజి" అని పేరు పెట్టుకొన్నారు.ఎరచన చేసినా కవిగా పెరిగివీరునిగా కాలాన్ని నడపటం ఆయన కలవాటు .అసక్తత,నిస్సారంసాదారణ భావం వారిలో మృగ్యం.ఏదో సందేశంఅందించడం కోసమే కవిత్వం అనే భావం వీరిలో వుండేది.నడకలో, నవ్వులోఎంతో ఉత్సాహపు ఊపు కనబడేది.మెల్లగా నడవడం,మెల్లగా మాట్లాడటం నే నెప్పుడూ చూడ లేడు.ఏదైనా కొత్త విషయం విన్నపుడు వీపుమీద కొత్తిఎమితిది?అని కేక పెట్టినట్లుగా ప్రశ్నించడం జరుగుతూ వుండేది.

4 comments:

మాగంటి వంశీ మోహన్ said...

అమ్మా

బందరు అని కూడలిలో హెడ్డింగు చూడగానే ప్రాణం లేచొచ్చింది! ఎప్పట్లానే మాంచి కబుర్లు చెప్పారు! ధన్యవాదాలు

బందరు "ఇది" దేనికొస్తుంది చెప్పండి! ఎంతైనా మన బందరు మన బందరే! :)

వంశీ

Siva Maganti said...

బందరు గురించి మీరు రాసిన పొస్ట్ చాలా బాగుంది. నాకు బందరు లొ ఒక సంవత్సరం ఉన్న అనుభవం ఉంది. మా అమ్మ గారి ఊరు బందరే! ఆ వూళ్లొ ఉన్నప్పుడు ఎంత తిట్టుకున్నా, వూరు వదిలి వచ్చాక మాత్రం ఏదొ మిస్ అయినట్టు వుంటుంది. హిందు కాలేజి లొ చదువు, రామనాయుడుపేట లొ ఇల్లు, సెంటర్లొ పొద్దున్నే పాలు తెచ్చుకు రావటం అన్నీ ఒక సారి గుర్తుకు వచ్చాయి

భావన said...

అరే ఈ పోస్ట్ ఎలా నో మిస్ అయ్యానండి. మాది బందరే. మేము ఈడేపల్లి లో వుండేవాళ్ళం. అవును ఇక్కడ అమెరికా లో కూడా మన బందరు వాళ్ళందరం చాలా బాగా కలిసి వుంటాము. కిట్టనోళ్ళు ఏడిపిస్తారు కూడా. అసలు జ్యంధ్యాల గారు చెప్పినట్లు బందరు ఆడపిల్లలు కేవలం బందరు లోనే పుడతారు :-)
మన వూరి మీద నా పోస్ట్ చూడండి.
http://bhavantarangam.blogspot.com/2009/08/blog-post_11.html

Unknown said...

Meelaanti goppavaallantha bandhar vidichi vellipooyarani baadhagaa untundhi... Chaala baaga raasaaru... maa laanti theliyani vaariki ardhamayyelaa...