కృష్ణవేణి
కడలి పట్టపురాణి కల్యాణి మాకృష్ణ
ఎంత చక్కని తల్లివే మాయమ్మ ఎంత చల్లని తల్లివే
శాత వాహన రాజ్య సంపదకు మురిసి, ఈ
క్ష్వాకు నృప వైభవము చల్లగా నరసి,నీ
సరస వెలిసిన బౌధ్ధ జైనములు పాలించి
కనుతుదల ఆ స్మృతులు కదలాడ నడయాడు
మౄదు వీచికల రొదల మురళీ స్వనము లొదవ
పదగతుల మదవతుల పాదాంగదము లులియ
సదయాంతరంగమున సరసతలు పెల్లుబుక
పరవళ్ళతో కదలుమెయి సుళ్ళతోపొదలు
పసుపు కుంకుమ ముద్ద బంతి సేవంతికలు
కుసుమ మాలలు తెచ్చి పసదనము లందించి
విసవిసని నీ దారి వెంట బారులు తీర్చి
మిలమిలని కనుల ప్రజ నిలచి నిను పిలిచేరు
కడలి పట్టపు రాణి,కల్యాణి మా క్రుష్ణ
ఎంత చక్కని తల్లి వే,మాయమ్మ ఎంత చల్లని తల్లి వే
కీర్తి శేషులు కాటూరి వెంకటేశ్వర రావు గారు రచించిన "నాగార్జున కొండ"శ్రవ్య నాటిక నుంచి తీసుకొన బడినది. కృతజ్ఞతలు
No comments:
Post a Comment