Pages

Wednesday, June 22, 2011

నివురు గప్పిన కళ



                                         నివురు గప్పిన కళ

మినీ వాళ్ళింట్లో లలిత చదువుతున్నాము. వస్తారా బామ్మగారు తీసుకు వెళతా అని రేఖ ఫోన్ చేసింది.  తప్పకుండా అని వెళ్లాను.  మినీ ఇల్లంతా చక్కగా సర్ది లలితా సహస్రనామం పారాయనకి అన్నీ సిద్ధం చేసింది. ఇంకా ఒకరిద్దరు రావాలని ఎదురు చూస్తున్నారు. మినీకి, రేఖకి సమాన వయస్కులైన (నాలుగు ఏళ్ళ)అబ్బాయిలు వున్నారు. వారిద్దరికి చెరో సైకిలు వుంది. వాళ్ళు ఎక్కడికెళ్ళినా సైకిల్తో సహా వెళ్తారు. వాళ్ళిద్దరూ హాల్లో సైకిల్ రేస్ మొదలుపెట్టారు.

నేను గోడమీద వున్నచిత్రాలు చూస్తున్నాను. అక్కడ సీతారామలక్ష్మణహనుమలున్న రేఖా చిత్రం ఒకటున్నది. పెన్సిల్ స్కెచ్ అది.  ముఖాలు కళ కళలాడుతున్నాయి. రూపురేఖలు స్పష్టంగా వున్నాయి.  సన్నంటిరేఖలతో చిత్రం సుకుమారంగా వుంది.  కింద మినీ అని సంతకం వుంది.
"ఇది నువ్వు వేసావా?" అన్నాను. అవునండీ అన్నది మినీ.
ఇంకా ఏమి వేసావు అన్నాను.  వినాయకుడు అని చూపించింది. నాట్య గణపతి, అల్లానే సన్నని కోమలమైన రేఖలతో సుకుమారంగా చిత్రించి వుంది.  మినీ దేవుని మండపం వెనుక గోడని అలంకరించింది.  మూడు దేవతల బొమ్మలు పెట్టింది.   వాటిచుట్టూ జిలుగు పేపర్ ముక్కలు అంటించింది.  ఇవన్నీఎలా చేసావు అన్నాను??

జిలుగు పేపర్లని సన్నగా కత్తిరించి మూడు అంగుళాల వెడల్పు సెలో టేప్ మీద జిగిరు వున్నవేపు జల్ల్లితే అవి అతుక్కుపోయాయి! అని చెప్పింది.ఆ టేపులు గులాబి,నీలం,జలతారు రంగులతో ఫోటోలకు అంచులుగా అమరిచింది.  మరోచోట వెంకన్నబాబు ఫోటోకి ఇరువైపులా రంగుల పెరుపుకాగితాలతో రింగులు రింగులుగా చేసి, గొలుసులుగా వేలాడతీసింది.  ఆకుపచ్చని గ్లేజ్ పేపర్ కత్తిరించి మామిడాకుల తోరణంలా కట్టింది.

చిత్రలేఖనం కోర్స్ చేసావా అని అడిగాను. లేదండీ, సరదాగా వేస్తుంటాను.  ఒక పండగకి ఒక బొమ్మ వేయాలని అనుకుని వేస్తున్నానండీ అంది.  మినీ "క్లే" తో కూడా బొమ్మలు చేసింది.  చదువు విషయానికొస్తే MCA చదివింది. వంటవిషయానికొస్తే, బేకింగ్ ల నుంచి జిలేబీల లాంటి మన పిండివంటలు కూడా సునాయాసంగా, ఇనుమడించిన ఉత్సాహంతో చేస్తుంది.  సరే పూజలు, వ్రతాల సంగతి ముందే చెప్పానుకదా!

మామూలుగా కాకుండా తన ఇంటిని ప్రత్యేకంగా వుంచుకోవాలనే తపన మినీ ఇంటిని చూస్తే కనిపించింది.  ఇలాగే సృజనాత్మక శక్తి వున్నా ఎంతోమంది బయటకి మామూలు గృహిణిగా కనిపిస్తారు. కానీ నలుగురిలో వున్నా వారిలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది.  ఏదో చేయాలనే తపనే మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది.  వయస్సులో వున్న పిల్లలు ఇలా కళా సృజన చేస్తుంటే వాళ్ళని మెచ్చుకోవడం నాకు చాలా ఇష్టం.  వత్తిని పైకి తీస్తే, వెలుగునిస్తుంది.  మొగ్గని నీటిలో వేస్తే వికసిస్తుంది. చిన్న పొగడ్త మనసును ఉత్తేజ పరుస్తుంది. నివురును తొలగిస్తే నిప్పు వేడినిస్తుంది. ఒక చిరునవ్వు, ఒక ప్రశంసా మనిషినీ మనసునూ ఎంత మారుస్తాయో!! 

No comments: