వ్యాసాలు తకిలీ
తకిలీ అంటే ఏమిటో నీకు తెలుసా? అన్నాను మా వాడిని. తకిలీఫ్ అంటే కష్టం అన్నాడు.
తకిలీఫ్ కాదు,తకిలీ అన్నాను. ఒక అక్షరం డిలీట్ చేసారేమో! అన్నాడు.ఈమాట విని కొన్ని ఏళ్లయింది.
మొన్న మా మేనల్లుడు వచ్చి "అత్తయ్యా! నేను గాంధీగారి వేషం వేస్తున్నాను, తకిలీ కావాలి
ఉందా? నీదగ్గర లేకపోతె ఇంకా ఎవరి దగ్గరా వుండదు. నేను బజారున పడాల్సిందే! అక్కడమాత్రం
దొరుకుతుందా? అని బేలగా మొఖం పెట్టాడు. వాడు తకిలీ అడగగానే నా మనస్సు పొంగిపోయింది."బీరువాలో ఓమూల దాచానురా! చూస్తావుండు,అని వెళ్లి చూస్తె పిచ్చిది పాపం అక్కడే వుంది. తీసుకొచ్చి వాడికిచ్చి " మళ్లి జాగ్రత్తగా పట్రా తెకపోయావో జాగ్రత్త ! అన్నా. తకిలీ చూడగానే వాడు ఊపిరి తీసుకొన్నాడు. రెండు అంగల్లో బయట పడ్డాడు. వాడు వెళ్ళాక తలుపు వేయడం కూడా మర్చి పోయి ఆలోచనలో పడ్డా!
తకిలీ అన్న మాట ఇన్నాళ్ళకి గుర్తు వచ్చింది? ఒకనాడు తకిలీ ఒక ఆయుధం.
ఈరోజుల్లో టి.వి లు ,సోఫాసెట్లు లేకపోతె ఎంత చిన్నతనంగా ,భావిస్తున్నారో! మా చిన్నతనం లో తకిలీ రాట్నము, చిలపలు ఇంట్లో లేకపోతే అంతచిన్నతనం గా భావించేవారు. ఖద్దరు కట్టడం, నూలు వడకటం, హిందీ నేర్చుకోవడం కనీస బాధ్యతలుగా ఉండేవి. మహిళలు చిన్నాపెద్దా అని లేకుండా రోజూ తీరికి చేసుకొని రాట్నం వడికే వారు. చిలపలు తయారు చేసి పట్టుకెళ్ళి ఖద్దరు బట్టలు తెచ్చుకోనేవారు.
మా ఇంట్లో చేతిరుమాలా కూడా ఖద్దరు దే వుండేది. మా అమ్మ గారు చాలా పీలగా ,సన్నంగా వుండే వారు ,అయినాసరే! ముతక ఖద్దరు చీరలే కట్టేవారు. అవి వుతుక్కోవాలంటే రెండు సేర్ల బియ్యం వండుకు తినాలి. మేము బందరు వదిలి మద్రాసు వెళ్ళాక మా ఇంట్లో ఆధునికత అడుగు పెట్టి నూలు బట్టల్లోకి దిగాము.
మద్రాసు లో వున్న దక్షిణ భారత హిందీ ప్రచార సభ పరీక్షలలో పాసయిన వారికి ఇచ్చే సర్టి ఫికేట్ల పై గాంధీ గారి సంతకం వుండేది. బెజవాడ లో హిందీ చదివే టప్పుడు శుక్ర వారం నాడు మాకు ఏకులతో{పత్తి తో జానెడు పొడుగున వత్తిలా వుండేది.} తకిలీతో దారం తీయడం, భగవద్గీత శ్లోకాలు చదవడం ,దేశ భక్తీ గీతాలు నేర్చుకొని పాడటం మొదలైన కార్యక్రమాలున్దేవి. ఆరోజు తప్పని సరిగా నీలం బద్దీ అంచులున్న ఖద్దరు చీరలు కట్టుకు రావాలని నియమం. నేను నా స్నేహితురాలు జయలక్ష్మి ఇద్దరం జోడీగా చదివాము. ఒకేపేటలో వుండే వారం ఇల్లు కూడా దగ్గరే! పొద్దున్నే రోడ్లు శు భ్ర పరిచే వాళ్ళ కంటే ముందుగా హిందీ విద్యాలయానికి వెళ్ళే వాళ్ళం. మా ఇంటినుంచి వాళ్ళింటికి వెళ్లి దాన్ని తీసుకు వెళ్ళే దాన్ని. నే వెళ్ళే సరికి అది దువ్వెన జుట్టు ముడిలో పెట్టుకొని వాళ్లమ్మాయి కి జడవేస్తూ టేబిల్ మీద హిందీ నోట్స్ తెరిచి పెట్టుకొని కళ్ళు దానిమీద పరుగెట్టిస్తూ వుండేది. దాన్నిచోచో జాజ అని బయలు దేరే వాళ్ళం. మమ్మల్ని చూసి చాలా మంది ఏదో ఆస్పత్రిలో పనిచేస్తున్నాం అనుకొనేవాళ్ళు. ఈ తకిలీ అప్పటిది. మా మేనల్లుడు వచ్చి తకిలీ అడగడం వల్ల ఇన్ని జ్ఞాపకాలు కళ్ళముందు కొచ్చాయి.వస్తువులు వాడకపోతే వాటి పేర్లు కూడా మర్చి పోతాము.
No comments:
Post a Comment