Pages

Friday, July 13, 2012

maa sree lakshmi pinni

                              మా శ్రీ లక్ష్మి పిన్ని
 "తల్లి తరువాత  తల్లి అంతటిది     పిన తల్లి '   అంటారు. కాదు ,పినతల్లి కూడా  తల్లే!పిన తల్లుల్లో ,మేన మామ  లలో వుండే      మాతృ     వాశ్చల్యపు       తీపి  ని    ఆస్వాదించిన వారికే    అది అర్ధం అవుతుంది.   మా  అమ్మ
గారికి   ఇద్దరు  తమ్ముళ్ళు, ఒక అక్క,    ముగ్గురు చెల్లెళ్ళు.  మా పెద్దమ్మ   నాకు తెలియదు.   ఆమెకు ఒక అబ్బాయి. వాడికి నాలుగేళ్ల వయస్సులో  మాపెద్దమ్మ    చనిపోయింది.    ఆమె పేరు కమల . మా అమ్మ  చనిపోయింది,మా మామయ్యలు ఇద్దరు చనిపోయారు.   మా పిన తల్లులు ముగ్గురు.ఒకామె సత్యబాల,ఒకామె,శ్రీలక్ష్మి,ఒకామె కుసుమ కుమారి.    నిన్ననే మా శ్రీలక్ష్మి పిన్ని   స్వర్గాస్తురాలయింది.  ఆమె కు
స్మృత్యంజలి  గా     ఈ నాలుగు ముక్కలు     వ్రాస్తున్నాను.    సుఖాన్ని,దుఖాన్ని      సురుచి తో పంచుకోవడం
అలవాటయిపోయింది.
                        మా అమ్మగారి చెల్లెళ్ళలో   శ్రీలక్ష్మి పిన్ని చాలా హుషారుగా ఉండేదట.  సాయంత్రం వేళ     బియ్యం కడిగి గిన్నె కుంపటిమీద పెట్టి   మా అమ్మమ్మ    వాకిట్లో     వరండాలో   చల్లగాలికి కూర్చునేదిట .కాసేపయాక   మా శ్రీలక్ష్మి పిన్నిని    "అన్నం వుడి కిందేమో    చూసిరావే!అని బతిమాలిందట.  అప్పుడు మా పిన్ని   ఒప్పులకుప్ప తిరుగుతోందిట.   "నేచూడను "అందిట.   అలాటి పిల్లకి పెళ్లి చేసారు.   పెద్ద సంసారం,పాడిపంట పాలేళ్ళు,కమత గాళ్ళు , మూడు మైళ్ళు వెళ్లి మడి తో    నూతి నుంచి       మంచినీళ్ళు తెచ్చి   వంటచెయ్యడం
చల్ల చెయ్యడం.పల్లెటూరి జీవితం   వెంట వెంటనే     పిల్లలు.  సమిష్టి కుటుంబం.ఒక్కనాడు పిన్ని విసుక్కోవడం
వినలేదు.పిన్నికి కవిత్వం,సంగీతం,హాస్యం అంటే చాలా ఇష్టం. అందరితో సరదాగా చెణుకులు విసురుతూ వుండేది.
ఆప్యాయతకి   ఎవరు సరికారు.
                         మా నాన్న గారు నన్ను ఎపుడూ   ఎవరింటికి పంపెవారుకాడు. ఒకసారిపోట్లాది పిన్ని నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళింది. నాతొ బాటు మా సత్యబాల పిన్నిగారి అమ్మాయి అన్నపూర్ణ కూడా వచ్చింది. అది నా కంటే అర్భ కురాలు.  పుల్ల మజ్జిగ, ఆవకాయ   తప్ప మరేమీ తినేదికాదు.  మా పిన్ని చల్ల చేస్తూ   ఆచల్లకోట్లోనే
మా యిద్దరికీ   చద్దన్నం పెట్టేది.  చేతినిండా  అన్నపు కరుడుపెట్టి,కంచంలో పెద్దనిమ్మకాయంత    గోంగూర పచ్చడి వేసి,అప్పుడే తీస్తున్న వెచ్చని వెన్న  ముద్డ్డ   అదీ నిమ్మకాయంత వేసేది.  మేము తినలేము మొర్రో అనే వాళ్ళం. చాల్లెండి.పనేముంది,నెమ్మదిగా తినండి,అని మంచినీల్లకి వెళ్ళిపోయేది. ఆవిడ నూతినుంచి మంచినీళ్ళు తెచ్చేసేది
కాని మ్భోజనం అఎదికాడు,ఇంకా తినాలా త్వరగా తెమలండి!అని వంటచేయడానికి వెళ్ళేది.మేము దొంగతనం
గా ఒకకంచంలో అన్నం దాచి రెందోకంచం మూత గా పెట్టి తీసుకెళ్ళి కుడితి తొట్టెలో పదేసేవాళ్ళం. ఆ కుడితి తొట్టె చేసిన సహాయానికి కృత జ్నతలు చెప్పుకొనే వాళ్ళం. మా బాబాయిగారు   వాళ్ళ నాన్నగారుకూడా  దాన కర్ణులు ఆతిధ్యమే వాళ్ళ ఆశయం. తాటి ముంజెలు,కొబ్బరి  బోళ్ళాలు ,మామిడి పళ్ళు,చెరుకు ముక్కలు ఏవేవో తెచ్చి అందరికి  పెట్టేవారు.
                పిన్నికి కదిపేడు బిడ్డలు.పల్లెటూరు,డాక్టర్లు లేరు.  మంత్రసాని సహాయం తోనే   పురుళ్ళు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే    నాలుగైదు మైళ్ళు   రెండెడ్ల   బండి మీద వెళ్ళాలి.   మధ్యలో   అయిదారు కాలవలు.  ఒకసారి పిన్ని కి
కానుపు చాలా   కష్ట మయిందిట.   డాక్టర్ దగ్గరికి   తీసు  కెల్లక   తప్ప లేదు.    పెద్ద పెద్ద నొప్పులు వస్తుంటే    రెండెడ్ల బండీలో      చెక్క కుర్చీమీద    కూర్చుని    ,కాలువలు దాటుకొంటూ   వెల్లిందిట   తరవాత అంటా బాగానే జరిగింది.  అదివిని ఆవిడ ఓర్పుకి    జోహార్లు అనుకొన్నాము.  మా అమ్మమ్మ  మాత్రం ఆఘటన   తలచుకు తలుచుకు    కాళ్ళ నీళ్ళు పెట్టుకొనేది.   ఇకనైనా    కానుపులు  ఆగిపోతే బాగుండును    అనుకొనేది.  తరవాత పిల్లలు  పుట్టారు.తొమ్మిది మంది     అబ్బాయిలు,నలుగురు    అమ్మాయిలు.
                          వాళ్ళింట్లో ఒక భోషాణం    వుండేది.     చాకింటి    బట్టలు      ఆభోషా నంలో  వేసేవారు.  పిల్లలు స్నానం చేసివస్తే   మాపిన్ని  ఎవరి సైజ్ కి సరిపడా చొక్కాలు,లాగూలు వాళ్లకి ఇచ్చేది. మొగపిల్లలందరికి తానులో  ఒకే రకమైన  బట్టతో దుస్తులు కుట్టించేవారు.   వాళ్ళ సైజు కరెక్ట్  గా  పిన్నికి ఎలా తెలుస్తుందా!అని   ఆశ్చర్యం వేసేది.  నేను పెద్దయ్యాక      మాపిన్ని  లేకుండా   వాళ్ళింట్లో      వినాయక చవితి    పూజ పిల్లల చేత చేయించాల్సి వచ్చింది. ఒక పళ్ళెం నిండా అక్షింతలు కలిపాను,  పిల్లలంతా అర్ధచంద్రాకారం లో కూర్చున్నారు.సగం పూజ కాకుండానే పళ్ళెం ఖాళీ అయింది.ఆవాళ   రెండు మూడు సార్లు అక్షింతలు కలిపాము.  బాబోయ్!  పిన్ని ఎలా చేయిన్చేదో!అనుకొన్నాను.
                           మా  పిన్నిగారింట్లో రోజు వడుగు పెళ్లి.  ఎవరేల్లినా సరే  రాచ మర్యాదలు.  భోజనాల దగ్గర కూచునేందుకు వెండిపూలు  తాపిన  పీటలు.  మా పిన్ని కోడళ్ళు నన్ను సొంత    ఆడబడుచులా  చూసేవారు.  వారు అలా మర్యాద లు చేస్తుంటే  సిగ్గువేసేది.    స్నానాల గదిలో వేన్నీళ్ళు .తుండు పెట్టించడం,   కూచున్న చోటికే కాఫీలు,టిఫిన్లు. భోజనం చేసేటప్పుడు    మాపిన్ని పక్కనే   కూర్చుని   ఏదో మాట్లాడుతుంటే   ఇంతంత  కూర ,ఇంతంత   అన్నం   పెట్టేసేది.   తినలేముతల్లి అంటే"ఎకులుపెడితే   బుట్ట చిరుగుతుందా?"ఫరవాలా తిను.అని మెత్తగా కసిరేది.
                       ఆవిడకి    గోరింటాకు,పూలు చాలా ఇష్టం.  పెద్ద బొట్టు   పెట్టుకొని     ,పసుపు   కాళ్ళకి     రాసుకొని
పేరుకి తగ్గట్టుగా    శ్రీ మహా లక్ష్మిలా    వుండేది.    మావారు పోయినప్పుడు     వచ్చింది.   సహాయం గా  ఉంటుందని ఒక పిల్లని    వెంట తీసుకు వచ్చింది.    ఆపిల్ల    చాలా సహాయం చేసింది.పిన్ని నాదగ్గరే వుంది   టమోటా ముక్కలుకోసి  పంచదార వేసి "తినమ్మా!కడుపు మండి       పోతూ వుంటుంది."అని బతిమాలి తినిపించేది. నేను శ్రీలక్ష్మి  కలిసి     "మాటల పందిరి "పుస్తకం వ్రాస్తే    అది చూసి నాపేరు పక్కన శ్రీలక్ష్మి పేరు చూపిస్తో    "ఈశ్రీలక్ష్మి నేనే!"అనేది.   ఆమెకే   వెసులుబాటు వుంటే    ఎన్ని రచనలు చేసేదో!
                         మా     అమ్మ పోయినప్పుడుకూడా      మా  సత్యబాల పిన్ని,తను వచ్చి నాదగ్గరుంది,నన్ను ఓదార్చారు.  వస్తూ మాపిన్ని  నాకొక వాల్ క్లాక్    కొని      ఇచ్చి     "కాలమే     అన్నిటిని    మరిపిస్తుంది"అన్నది.
తన దగ్గరికి వెళ్లి వస్తే      బాటరీ    రీ  చార్జి    చేసి నట్లు    కొత్త శక్తి     వచ్చేది.  ఇప్పుడా  అవకాశమే లేదు.   మూడు
సంవత్సరాలుగా    మంచం పట్టివుంది.   వార్ధక్యం తప్ప      జబ్బు అంటూ లేదు.   కాళ్ళు మంటలు     అని గొడవ చేసేది.   ఇక కన్నుమూసింది.నేను సముద్రాల ఇవతల     వున్నాను.  కడసారి  చూసి  నా  అన్న వాళ్ళతో కలిసి  కాసేపు  ఏడిస్తే      మనసుకి    శాంతి    కలుగుతుంది  .కాని    వెళ్ళలేను
                                 ఈ రోజుల్లో  సమిష్టి     కుటుంబాలు    మోస్తారుకి చూపిద్దమంటే     కనపడటం లేదు.  అలాటిది.మా పిన్ని కోడళ్ళు కొందరు ఒకే ఇంట్లోను ,తక్కిన వాళ్ళు పక్క వీధుల్లోనూ వుంటున్నారు.    ఎప్పుడు ఒకరి గురించిఒకరు      ఎఫిర్యాడు చెయ్యలేదు.   పిన్ని చాలా    అదృష్ట వంతురాలు.    కొడుకులు కోడళ్ళు,మనవాళ్ళు,మునిమనవలు    అందరు   ఆమెకు సేవ చేసారు.   వారి సహృదయతకు    ముచ్చట వేస్తుంది. పిల్లల పెంపకం ,సంసారాలు   అంటే  ఒక సారి  నూజివీడు   వెళ్లి  మా    పిన్ని  గారిల్లు చూసిరండి అని  
చెప్తుంటాను.  నామీద     ఆమె      కురిపించిన ప్రేమ       సాటి లేనిది.   ఎప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినా   పసుపు కుంకుమలు పెర్రి పంపించేది.  ఆమెది      గొప్ప మనసు.    మనసంతా ప్రేమే     .  







 . 

2 comments:

మాగంటి వంశీ మోహన్ said...

అయ్యో! చాలా విషాదకరమైన వార్త..... ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ....

ఆ కాలపు పినతల్లులు వేరమ్మా! ఈకాలపు పినతల్లులు వేరు....మీరు రాసిన సంగతులు చదివాక మా పెద్దమ్మక్కయ్య గుర్తుకొచ్చింది...అవటానికి ఆవిడ మా అమ్మకి పెద్దమ్మక్కయ్య కానీ మేమూ అలానే పిలిచేవాళ్ళం...ఆవిడ ఎవరికీ పిన్ని కాకపోయినా అచ్చంగా మీ శ్రీలక్ష్మి పిన్ని తంతే.....

Rajamouli Nidumolu said...

చాల హృద్యంగా రాశారు. అందరికి కనువిప్పు.

మీ చెల్లాయి కూడా ఎన్నో చెప్తోంది పిన్ని గరి గురించి. దిబ్బ రొట్టి వెన్నపొస థొ .. బాబాయి గారు గురు శుక్ర శని వారాల్లొ పూజలు చేసేవారని.
ఇంట్లో పెద్ద ఫొటోల గురించి కూడా చెప్పింది.

నిజము. ఆమె అచ్చము శ్రీమహాలక్శ్మి గారి లాగానె ఉండేవారు. చిక్కని పాలతొ కఫీ ఇచెవరు.
హాయిగా గలగలా మాట్లాదేవారు.

ఆవిడ చెయ్యే వేరు. అచ్చం అన్నపూర్ణమ్మవారి లాగ..