Pages

Thursday, October 16, 2014

బందరు నెచ్చెలి వెళ్ళిపోయింది

             బందరు   నెచ్చెలి     వెళ్ళిపోయింది 
      
             ఒకొకసారి     మనస్సు   శరీరము  శిధి లమయిపోయినట్లు  అనిపిస్తుంది . కూచోలేము,తిరగలేము ,తినలేము ,పనిచేయలేము నిద్రపోలేము  ఏదో అలజడి,ఆవేదన. ఈరోజు    లేచినదగ్గరనుంచి  అలానేవుంది .   మా పెద్దకోడలు    అమెరికా  వెడుతోంది . దిగులా అంటే  అలా లేదు . అది వెళ్ళాక    అలా కూర్చుండి పొయాను.  ఇంతలో  ఫోన్  ట్రింగ్ ట్రింగ్  అని   రారా అని పిల్చింది అటు నుంచి చిత్ర  నెమ్మదిగా   "మీకు తెలిసిందా? అన్నది  . ఏమీ తెలియదే ! అన్నా  జానకీ రాణి వెళ్ళిపోయారు ,అన్ది. ఫోన్  జారిపోయింది  నా  బందరు నెచ్చెలి వెళ్లిపోయిందా? అని మనసు మూల్గింది . జీవితం లో   ట్రాజెడీ    ఏమిటంటే     చెయ్యాలనుకొన్న పనులు చెయ్యలేకపోవడం, నిరర్దకపు   పనులతో  పీకలదాకా   మునిగిపోవడం రోజులు   డొల్లి పోవడం . అదే జరుగుతున్ది.  

                       అమెరికా   నుంచి వచ్చినప్పటినుంజానకీ  రాణి    దగ్గరకి   ఇవాళ  వెళ్దాం రేపు వెళ్దాం  అనుకొంటూనే  జరగిపొయిన్ది. వెళ్లి తనని   చూడటానికి కాళ్ళా డ లేదు . చూడగానే   జలపాతం లా   గలగలా  మాట్లాడే మనిషి  అలా గడ్డకట్టుకుపోయి   పడివుంటే  ఎలా భరించడం? అలాని వెళ్ళకపోతే   మళ్ళీ   జన్మలో  ఆముఖం చూడలేముకదా ! వెళ్లాను చూసాను  మంచులో వదిలిన  తెల్లగులాబీలా వుంది . ఎన్ని జ్ఞాపకాలో! చిన్నప్పుడు బందరులో ఇద్దరం ఖోజ్జిల్లి పేటలో  ఒకే  వీధి లో  వుండేవాళ్ళం . అట్లా తద్ది   ఒకే   సంరంభం , రెక్కలోచ్చినట్లుండేది . వీధి చివర రోటి ఉయ్యాలా  వేసేవాళ్ళు  పెద్దవాళ్ళు ఎక్కి ఊగుతుంటే  ఆశ్చర్యంగా   చూస్తూ నుంచునే వాళ్ళం . కొత్తబట్టలు, గోరింటాకు ,  చద్దిభోజనము షికార్లు .దోలానికి వేసిన కంబారుతాడు ఉయ్యాలాలో   గోనెపట్ట మడిచి వేసేవారు  ఆ ఉయ్యాలా వూగేవాళ్ళం  . ఆతరవాత   ఆఇల్లు మారిపోయాం .  ఆరోజుల్లో   స్నేహాన్ని పెంచుకొంటూ కలుసుకొనేందుకు   ఆడపిల్లలకి   స్వాతంత్రం లేదు . అడపా దడపా  కబుర్లు తెలిసేవి  మేము మద్రాసు వెళ్లి మహాలక్ష్మి స్ట్రీట్లో   వున్నపుడు హటాత్తుగా   కలిసింది  ఏమిటే అంటే   ఈ కాంపౌండ్ లోనే మావాళ్ళున్నారు వచ్చా అన్నది .   ఆవేళ తెల్లటి పరికినా,ఓణీ వేసుకొని  కళ్ళకి  కాటుక జడ లొ మల్లెపూలుపెట్టుకొని   వచ్చింది .  అప్పటికి తను డాన్సు నేర్చుకొన్నది . మేమిద్దరం  దాబామీడకు వెక్కి   కూర్చుని ఎన్నో కబుర్లు   చెప్పుకొన్నాము.  మల్లీశ్వరి సినిమా రిలీజయిన్ది.  ఆ   పాటలంటే   వెర్రి .తను  మనసున మల్లెల  మాలలూగెనే   భానుమతి పాట  పాడింది . వింటుంటే   నా మనసులోనూ  మల్లెలు ఊగాయి. మళ్ళీ  గాప్ 
                                  కృష్ణా   ఎక్సప్రేస్స్ కృష్ణ మోహన్ గార్ని   పొట్టన పెట్టుకొన్నపుడు  జానకీరాణి  సత్యవతి టీ చెర్ గారి    రూముకి వచ్చి కుప్ప కూలిపోయి " నీనెమయిపొతానో!   నన్నెవరన్నా  చూసుకోండి  అని కన్నీరు మున్నీరుగా  ఏడ్చింది . హృదయ విదారకంగా . ఒకే పడక కుర్చీలో  పడుకొని ఉష శోభ  బిస్కట్స్  తింటూ కాళ్ళూ పుకొంటు  పాటలు పాడుతుంటే  వాళ్ళని  చూసి వాళ్ళకోసం   గుండె గాయాన్ని   అరచేత్తో కప్పుకొని   బతుకు సాగించింది జానకీరాణి . అందర్నీ ప్రోత్సహించి  వ్రాయించి ,పాడించి పైకి తెచ్చిన్ది. తను నితంతరం  వ్రాస్తూనే వుంది . సంగీతం,సాహిత్యం, నృత్యం ,  అందం ,తెగువ ,స్నేహార్ద్ర హృదయం , స్వచ్చమైన మనస్సు ,ఉత్సాహం అన్నీ కలబోస్తే  జానకీరాణి . స్నేహపు గొలుసులో  ఒక రింగు తెగిపోయింది  ఒక చల్లని అదృశ్య హస్తం   ఉష కి,శో భకి గొడుగై  నీడ నివ్వాలి .   
                    

1 comment:

Tejaswi said...

అంత చిరకాల మిత్రురాలు వీడిపోయారంటే ఎంతో బాధగానే ఉంటుంది. మీరు మనసు దిటవుపరుచుకోవాలని కోరుకుంటున్నాను.