Saturday, August 23, 2008
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభ ఆశీస్సులు
వెన్నదొంగ
మర్యాదా పురుషొత్తముడైన శ్రీరామచంద్రముర్తి,లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరూ సంపూర్ణ అవతారాలుగా చెపుతారు. నిత్య జీవితంలో వెన్నదొంగ శ్రీకృష్ణుడు ఎలా మిళితమయి పాటలలో వినిపిస్తూ వుంటాడో
చూద్దాము. చదువు రాకపోయినా భారత నారీమణులు పాటలను ముఖాముఖీ నేర్చుకొని పాడుకొంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా తమ తమ విధులు నిర్వర్తించు కొనేవారు. దీనివలన ప్రతి స్త్రీకి సంగీతము,సాహిత్యము పరిచయ మయ్యేవి.
ఇంటిలోని ఆబాల గోపాలానికి ఆపాటలు వినడం వల్ల వారిమనసుల్లో పాటలు గూడుకట్టుకొని జీవితాంతము గుర్తు వుండేవి. చిన్నతనంలోనే సంగీత, సాహిత్యాలతో పరిచయం ఏర్పడేది. పెద్దవాళ్ళు పిల్లలకి తెల్లవారుఝామున ఉగ్గు పెట్టేవాళ్ళు, అప్పుడు మేలుకొలుపులు పాడేవారు. అవి రాముదినో,కృష్ణూదినో సంబోధిస్తూ వుండేవి. తెల్లవారుఝామున తూరుపు గాలులు వీస్తూంటే ఈగీతాలు వింటు ఇంట్లో అందరూ మైమరచిపోయేవారు.
"తెల్లవారెను, కోడికూసెను
తోయజమ్ములు కనులువిప్పెను,
ఎల్లలోకములేలు చల్లని తండ్రి లేవయ్యా!
కృష్ణా, తెల్లవారేను" అని పాడెవారు.
అష్టపదులు,తరంగాలు,అధ్యాత్మ రామాయణ కీర్తనలు, పాడేవారు. గోవిందనామాలు,గంగా-గౌరీ సంవాదము,లఖ్మణముర్చ,నలుగుపాటలు,ఇలా ఎన్నో స్త్రీలపాటలు శ్రావ్యంగా పాడేవారు. పురాణాలలోని కొన్ని సంఘటనలు ఈపాటలతో సులువుగా పిల్లలకి అర్ధమయేవి.
నాలుగేళ్ళురాగానే చిన్న చిన్న పాటలు, నృత్యంచేస్తు అభినయించేలా నేర్పేవారు. "ఏలవచ్చెనమ్మ కృష్ణుడేలవచ్చెనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమచేసెనే. ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లా దించెనే నేకొట్టబోతే దొరకడమ్మ చిన్నికృష్ణుడు." అని ఉట్టిమీద పాల కుండ దించుతున్నట్లు, గోపిక కొట్టబోతే కృష్ణుడు పారిపోతున్నాట్లు అభినయించేవాళ్ళు పిల్లలు. తల్లులు చల్ల చేసేటప్పుడు "గుమ్మడేడేగోపిదేవి,గుమ్మడేడే,కన్నతల్లి, గుమ్మడిని చూపింపగదే గోపెమ్మ, మాయమ్మా! గుమ్మడేడే!" అని పాడేవారు. తల్లి దగ్గర పడుకున్నంత సేపు పిల్లలు వెచ్చగా పడుకొంటారు. తల్లి లేచి పనులు చేసుకోడానికి వెళ్ళగానే వాళ్ళులేచి రాగాలు తీస్తు తల్లిని వెతుక్కొంటూవచ్చి తల్లిని చుట్టుకొంటారు.
చల్లచిలుకుతూ తల్లిపాటపాడుతుంది,గొపికలు,శ్రీకృష్ణుని అల్లరి భరించలేక యశోదమ్మ దగ్గరికి వచ్చి ఇలాచేసాడు,అలాచేసాడు అని చాడీలు చెపుతారు. అప్పుడు యశోద అదే పునరుక్తి చేసి నిజమేనా! అని అడుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు 'నాకుతెలియదమ్మా! నేనేమీచేయలేదూ అని అమాయికంగా "వీళ్ళకి నేనంటెగిట్టక ఇలా చాడీలు చెప్తున్నారంటాడు."
"వినవమ్మ యశోదా! నేఏవరతనయుడు చేసెటి చిలిపి పనులు విచారించబోతే భారత, భాగవతమాయేను,ఎట్లనో ఇక నేట్లనో యశోదమ్మా ఎట్లనో ఇక నెట్లనో.
దొరబిడ్డ డనుచుమేము వెరచి చెప్పలేముకానీ,చిరుత పనులను ఇట్లుశాయ ఎరగమెన్నడు ఇరుగుపొరుగుల చెప్పవే నీవేచెప్పవే! యశోదమ్మా! చెప్పవే నేఏవేఏచెప్పవే!
అయుదుఏండ్ల బాలుదూ వాడింతపని ఏమిసేయు,
మరుగుబెట్టి దాచకా ఏ మర్మమూలేకాను
విప్పిచెప్పరే మీరే చెప్పరే! గోపికలారా
చెప్పరే మీరేచెప్పరే!
ఘడియ ఘడియకు వచ్చినాడు
తీరుగా కూర్చుండమంటే
చెడెలమీద కన్నువేసి చేడేనీ నొక్కొచ్చినాడు
ఎట్లనొ ఇక నెట్లనో యశోదమ్మా! ఎట్లనో ఇక నెట్లనో!
ఘడియ ఘడియకు పోయినావట
నీటుగా కూర్చుండమంటే
చెడెలమీద కన్ను వేసి
చేడెనీ నొక్కొచ్చినావట
ఏమిరా?కృష్ణా ఏమిరా?
చక్కని శ్రీకృష్ణ రమ్మని
చెక్కిలి మరి ముద్దులిమ్మని
రక్కసీ వలె నన్ను కరచితె
ఒక్కపన్ను తాకెనేమో
ఎరుగనే అమ్మా! ఎరుగనే!
ఎరుగనేఅమ్మా!ఎరుగనే!"
ఈపాట లొ చాలా చరణాలువుంటాయి. అవి స్మృతిపధంలోంచి జారిపోయాయి. ఎవరికైనా తెలుస్తే చెప్పమని కోరుకొంటున్నా.
"గోపాల కృష్ణా, నీ గొప్పతనములెంచ
గోపిక లున్నారులే! గోపికలానెల్ల కొనిపోయి
అడవిలో కోలాట మాడావులే!"
ఈపాటకూడా పిల్లలందరము పాడేవాళ్ళము. ఉట్టిమీదపాలుపెరుగు పాట స్కూలులో రెండో క్లాసులో ఏదో పండగకి మాచేత డాన్స్ చేయించారు. అందరినీ పరికిణాలు కట్టుకురమ్మన్నారు. అంత చిన్న పరికిణాలేదు. మా అమ్మ తన పట్టుచీరని కంబారుతాడు లాటిదానిమీద అడ్డంగా మడిచి పరికిణాలా కట్టింది. బస్తాలా అయిపోయానుట,కని గోవుపక్కన నుంచున్న కృష్ణుడిబొమ్మ ఇచ్చారు. అది చాలా రోజులుంది.
"కృష్ణా ముకుందా మురారి
గోపాలా కృష్ణా ముకుందా మురారి
గోపీ జనమన మొహన వ్యాపక
కృష్ణా ముకుందా మురారి
కాళియ మర్దన కంసవిదూరణ
కనకాంబరధారీ గోపాలా
కృష్ణా ముకుందా మురారి"
అని మా ఎదురింటి అమ్మాయి హార్మణీమీద వాయిస్తోంటే విని నెను పాడేదాన్ని.
మరోపాట:
కుచ్చు కుచ్చుల జడలు వేయవే
ఓయమ్మ నన్ను కృష్ణావతారుడనవే!
కుచ్చు కుచ్చుల జడలు వేసెదా!
గొపాలకృష్ణ నిన్ను కృష్ణావతారుడనెదా!
కాళ్ళాకు గజ్జెలు కట్టవే ఓయమ్మ నన్ను
కాళింది మర్దనుడానవే!
కాళ్ళాకు గజ్జెలు కట్టేదా గోపాల కృష్ణ
కాళీంది మర్దనుడానెదా!
పట్టు పచ్చని పంచె కట్టవే ఓయమ్మ నన్ను
పీతాంబర ధారుడానవే
పట్టు పచ్చని పంచ కట్టెదా గోపాలకృష్ణ
పీతాంబర ధారుడానెదా!
కంటీకీ కాటుక పేట్టవే ఓయమ్మ నన్ను
కౌస్తుభా ధారుడానవే!
కంటికి కాటుక పెట్టెదా గోపాలకృష్ణా
కౌస్తుభ ధారుడానెదా!
ఇది ఎంతో ఇష్టంగా పాడేవాళ్ళము.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
emta mamchi paatalanu malla maataraaniki amdimchaarammaa. adbhutam krishna leelaamrutam.
Post a Comment