Pages

Saturday, August 9, 2008

సైడ్ ఎఫెక్ట్స్ ...

                            
                  మనలొ   గుణాలే  మనల్ని  సుఖాలనుంచి,  శాంతినుంచి, సంతోషం  నుంచి  దూరం  చేస్తాయి.
    మనం  వాత్సల్యం  చూపిస్తే  తిరిగి  మనకి   కృతజ్ఞతలు  అందక పోవచ్చు కాని,   విరుధ్ధ  భావాలు  ఎదుటివారిలో  తలెత్తవు,  మనం  ప్రేమిస్తే   ఎదుటివారికి  అందుకొని  ఎదలో  పదిలంగా  దాచుకొనే  శక్తి  లేకపోవచ్చు  కాని,  మనపై  బాణాలు  సంధించాలనే  భావన  రాకపోవచ్చు, మనం  జాలి  చూపిస్తే  అర్ధం  చేసుకోక  పోవచ్చు  కాని  దానికి  బదులు కోపం  రాకపోవచ్చు,కాని  మనం ద్వేషిస్తే,  కసి  గా వుంటే,  అహంకారం  ప్రదర్శిస్తే దానికి  మాత్రం  మనకి  తగిన  ఫలితమే  అందుతుంది. మనకి  కసి  ఎందుకొస్తుంది?  ఏదో  మనం  కోరుకొన్నది  రాదని  తెలిసాక,  దాన్ని పొందలేమని  తెలిసాక,  అదిరాకుండా  మనల్ని  ఎవరో  అడ్డుకొంటున్నారని  అనుమానం  వచ్చినపుడు  ఈ కసి  పెరిగిపొతుంది. భారతీయ  సిధ్ధాంతం  ప్రకారం,  మనకి  ఏది  చెందాలో  అది   సముద్రంలో  పారేసినా  మనల్ని  వెతుక్కొంటూ  మనదగ్గరికి  వస్తుంది,మనకి  ఏది చెందదో  అది  ఎదురుకుండా  వున్నా  మన  చేతికందదు. కొనుక్కున్న  పుస్తకం  చదవలేము,  మనసు పడి  కొనుక్కొన్న  చీర  ఎవరికో  పెట్టాల్సి  వస్తుంది,వెళ్ళాలన్న  చోటుకి  వెళ్ళలేము.ఎవరికోసమో  తయారు చేసిన  భోజనం  ఎవరికో  ప్రాప్తం  అవుతుంది ఈ  కీలకం ఈ భావాలు  అవగాహన  కావటం కష్టం. ఇక  అహంకారం  ప్రపంచం  వేపు  చూపు లేక   అహంకారం  పెరిగిపోతూ  వుంటుంది.ఏమి చూసుకొని  అహంకారం?  మనం  ఎందులో  గొప్ప?  అని ప్రశ్నించుకొంటే బాగు బాగు.

అందంగా  వున్నామనుకొంటే,  మనకంటే  అప్సరసలు లాటి వాళ్ళూ  ఎంతో  మంది, ధనవంతులమా?  అనుకొంటే  లక్ష్మీ  కటాక్షం  అద్దం  మీది  ఆవగింజ లాంటిది,  ఎప్పుడు  ఎవరి  చేతుల్లోకి  వెళ్ళి పోతుందో  తెలియదు, పాట లోనూ, ఆటలోనూ, వంటల లోనో   ప్రావిణ్యం  సంపాదించా మనుకొంటే  మనల్ని  తలదన్నేవారున్నారు, ఈ ఆలోచనే  లేకుండా మిడిమిడి జ్ఞానంతో చుట్టు  పక్కల  వాళ్ళని  ఈగల్లా  దోమల్లా  చూస్తే  వాళ్ళూ  మనుషులేగా!  వాళ్ళకి  ఆత్మ  గౌరవం లేదా? నీపదవిని బట్టో,  బంధుత్వాన్ని  బట్టో,నిన్ను  మొహం  మీద  అనక  పోయినా  ఆమాటలు,  చేష్టలు  గుండేల్లో  గూడుకట్టూకొని,సమయం  రాక  పోతుందా?  అని  లోలోపల   పళ్ళు కొరుకుతూనే వుంటాయి."నీటికి  నాచు  తెగులు,మాటకి  మాటతెగులు". జాతి,మతము,హోదా  వీటిని  గుణించుకొంటూ  పోతే   మనిషిని  మనిషిగా  చూడాలనే  చూపు  తగ్గిపోతుంది.మేమేం మనుష్యులం కామా?ఉప్పు కారం  తిని   బ్రతకడం  లేదా? చచ్చిన  పాముల  పడివుండాలా?  అని ప్రశ్నించ వచ్చు.అకారణంగా  చెడ్డ  భావాలు  ప్రకటించడం సరియైన  పనికాదు.  అందునా  మాట  జారితే  ఇక  జన్మ  వైరమే! ఒక  మాట  తప్పుగా  జారిందో  జన్మంతా  కన్నీళ్ళు  కార్చినా  అది  వెనక్కి  రాదు. చెడు  బావాలు  వచ్చినా  అవి  నిగ్రహించుకో గలిగితే  మనిషి  చరిత్ర  మలిన మవదు. "గొప్ప  నగలు  గల  షరాబు  కొట్టులోన  రంగు  రంగుల  భరిణ లో  రత్నములను,  దాచి,తీయుచు మూయుచు  ధరను  చెప్పు  రీతిగా  నుండవలె  పల్కు  రీతులెన్నాఅన్నాడొక  కవి.మాట  మేధస్సులో  పుట్టి  రూపు  సంతరించుకొని,  రెండు పెదవుల  తలుపులు  తెరచుకొని  బయటికి  రాబోయే ముందు,మనకి  మనమే  ఒక్క క్షణం  విమర్శ  చేసుకొని  ఆ మాట  పలకడం  ఉచితమా  కాదా?  అనే  ప్రశ్న  వేసుకొంటే  సగం  మాటలు  మనదగ్గిరే  వుంటాయి. చాలా  మంది   సీమ  టపాకాయల్లా  మాటలు  పేల్చేసి "  క్షమించ  మంటారు."అడుసు  తొక్కనేల కాలు  కడుగనేలా!"అడుసు  అంటే  బురద.మనిషి మనిషిని  చూసి  "ఇహి" అని  నవ్వాలంటే  భయం,  నవ్వితే మాట్లాడాల్సి  వస్తుంది,  మట్లాడితే  ఎదన్నా  సహాయం  అడిగితే  చేయాల్సి  వస్తుంది,అని   మానవత్వపు  పొర  తీసేసి,  దానవత్వపు  దుస్తులు  ధరించి కస్సు  బుస్సు  మంటూ  కాలం  గదుపుతున్నారు.ఎదుటి  వ్యక్తి  మనసులో  మన  పట్ల  ఏహ్యం  వుంటే  ఇద్దరిమధ్య  సామత్స్యం  వుంటుందా? వాళ్ళతో  బ్రతకాలంటే  ఎంత  కృత్రిమం గావుంటుంది? కృత్రిమత్వంలోంచి  కుళ్ళూ  పుడుతుంది కాని  పూలు  పూయవు.ఎన్ని  మతాలని  పరిశీలించినా,ఎన్ని  ధర్మాలని క్రోడీకరించినా,ఎన్ని గ్రంధాల  మౌలిక  సందేశం  తెలుసుకొన్నా"మనిషిని  మనిషిగా  చూడు  అనే   సందే్శమే   అందుతుంది,  అప్పుడు  పుట్టలో  పాలు  పొయ్యకపోయినా  ఫరవాలేదు,  గుళ్ళో  కొబ్బరికాయ  కొట్టక  పోయినా  ఫరవాలేదు,  గంగలో  ముంగక  పోయినా  నష్టం  లేదు.మాటల్లో,  చేతల్లొ,చేష్టల్లో  మంచిని  పెంచడం,  పంచడం  అలవర్చుకోవాలి.

2 comments:

teresa said...

బాగా చెప్పారు.

చిలమకూరు విజయమోహన్ said...

మా రాయలసీమ లో దీనిపై ఒక సామెత వుంది.తులం నాలుక అల్లాడిచ్చే బదులు దడెం తలకాయ ఊపేది మేలు.(ఇక్కడ దడెం అంటే 3 కేజీలు)