Pages

Sunday, October 12, 2008

వీణ

మాఇంటి ఇలవేల్పు
ప్రొద్దున లేచి కాఫీ కప్పు పుచ్చుకొని వరండాలో కుర్చివేసుకొని ఒళ్లో
కాగితాలు ఫైలు కలం పెట్టుకు కూర్చునేవారు నాన్నగారు.ఆ కాగితాల
మీద ఒక అక్షరం పడిందంటే సరస్వతి వీణ లో ఒకతీగ పలికినట్లే
అనిపించేది.సరస్వతి అనగానే వీణ గుర్తుకు వస్తుంది.వాణి వీణ మీటి
సంగీతంలోని సప్తస్వరాలను సప్తప్రవాహాలుగా మానవులకి అంది స్తూ
వుంటుంది.మా అక్కయ్య వీణ వాయించేది.అదిచూసినప్పుడల్లా నేనూ
అలా వీణ పట్టుకు ఎప్పుడు వాయిస్తానా? అనికలలు కనేదాన్ని.అక్కని బతిమాలి తనదగ్గర పాఠాలు ప్రారంభించాను.తరవాత మంచి మాస్టారు
దొరికారు .పెళ్ళికాక ముందు అంతా తీరుబడిగా వున్నట్లు,ఏపనైనా
చేసేయ్యగల మన్నట్లు పొగరు ధైర్యము వుండేవి.ఆరునెలలు విద్యాభ్యాసము జరిగింది .
పూర్వము పెళ్ళికి ముందు ఆడపిల్లలందరూ సంగీతం నేర్చుకొనేవారు.
కళాపోషణ ఎలావున్నా కాలక్షేపము జరిగేది.పెళ్లి అయాక హార్మణీ
అటకమీద అమ్మాయి వంటింట్లోను.కీర్తనలదాకా వచ్చాను,పసుపుతాడు మెళ్ళో పడింది.పల్లెటూరి కాపురం.వీణ మాస్టారి కోసం వెతికితే ఒకాయన
వయోలిన్ మీద వీణ నేర్పిస్తానన్నారు.మనకంత అద్భుతమైన తెలివి
లేదుకనక సంగీతానికి స్వస్తి చెప్పాను.ఈమధ్య ఒకసుందర మైన సంధ్య
వేళ నాకు,నా జిగరి దోస్త్ కి వీణ నేర్చుకోవాలనే కోరిక బలీయంగా కలిగింది .
తనూ ఒకానొకప్పుడు వీణ నేర్చుకొని వాయించేసమయం లేక వాయించమని అడిగేవాళ్ళు లేక మూల పడేసింది.ఒకటిచరు దొరికారు.
ఒకవీణమీదే ఇద్దరం ప్రాక్టిసు చేసుకొని తంటాలు పడ్డాము.
ఇంతలొ మాతాతగారి వూరు నూజివీడు వెళ్ళడం తటస్థించింది.
నూజివీడు వీణలు ప్రసిద్ది చెందినవి.ఎలావున్నాయో అని చూడటానికి వెళ్లి
ముగ్ధురాలనయి ఒకటి కోనేసుకోడం జరిగింది.అది ఒక చిన్న ఇల్లు.వరండానే షాపుగా చేసుకొని అమ్ముతున్నారు.కుటుంబ సభ్యులందరూ ఆపనులేచేస్తూవుంటారు.పనస చెక్క తేవడం ,తిఇగాలు కొనడం, నగిషీల పని అన్ని చేస్తారు.ఎవరేనా సిటీ లనుంచి ఆర్డర్లు ఇస్తే వాళ్ళే తెచ్చి ఇస్తారు.విదేశాలకి కూడా పాక్ చేసి పంపిస్తారుట. వీణ ని రెండుభాగాలుగా చేసి సూట్ కేసులో పాక్ చేస్తారుట.అక్కడ ఆభాగాలను
వీణగా కూర్చు కోవచ్చు.కొంచెం ఆలస్యం అయినా వీణ వాళ్ళే తెచ్చారు.
హారతి ఇచ్చి బల్లమీద వీణ పెట్టె పెట్టాము.ఇంట్లో వీణ వుంటే ఎంతో నిండుగా వుంది.జంట స్వరాలు వాయించినా ఎంతో హాయిగా వుంటుంది.
సంగీతానికి మహత్తర మైన శక్తి వుంది.ఈమధ్య ఒకాయన టి.విలో చెప్పారు,మానసికంగా ఎదగని పిల్లలదగ్గర సంగీతం వినిపిస్తే
వారిలో స్పందన కలిగిందట.సంగీతం రోగనివారిణి .
కొన్ని జబ్బులకి కొన్నిరాగాలద్వారా చికిత్స చేయవచ్చట.
రక్త హీనత =ప్రియదర్శిని ,సామవేద
ఆస్తమా=పూరియా,మాల్కోస్ ,యామిని
కాన్సెర్ =నాయకి కన్మవర,సిద్ధభైరవి ,రాగశ్రీ
నర్వసేనేస్ =సామవేద,అహీర్, భైరవి,పూరియా
హార్ట్ డిసీస్ =భైరవి,శివ రంజని,అల్హయా,బిలావల్
హైబి.పికి =హిందోళ,పూరియా,కౌన్సి ,కన్హారా
ఎసిడిటి =మార్వా,దీపక్ ,కళావతి
అల్సర్ =మధుమతి ,దీపక్
శరీర వ్యాధులు =మేహమల్హార్ ,ముల్తాని మధుమతి
డయాబిటిస్ =ఔనాపురి ,జేజేవన్తి
కలర్ బ్లైన్దేడ్ =కన్హారా ,ములతానీ
హైఫివర్ =మాల్కోస్, బసంత్ బహార్,
లుక్యేమియా =ఆసావతి ,రాంకలి ,సామవేద
డాక్టర్లు కూడా సంగీత ము తెలిసినవారయితే మొదట సంగీతం తో
చికిత్స చేసి తరువాత మందులు వాడాలంటే వాడవచ్చు అంటున్నారు.
అందుకే చాలామంది నిద్ర పోయేటప్పుడు,మనస్తాపంగా ,చికాకుగా వున్నప్పుడు మీకిష్టమైన పాటలు వినండి ఉపశమనం కలుగుతుంది
అంటారు.భగవంతుడిచ్చిన సదుపాయాలతో లాభాలు పొందండి.
శరీరంలో వుండే షట్చక్రాలకు ,జాతకంలో వుండే గ్రహాల నడవడికకు
ఆరోగ్యానికి చాలా సంబంధం వుందిట.సంగీతానికి చెవులని అద్దెకిచ్చి
సంతోషాన్ని సొంతం చేసుకోండి.సంగీతం బాగా రావాలన్దోయ్ .అప్పుడే దాని ప్రభావం. ఏమిటో యమధర్మ రాజు పిలిచేలోలోగా ఒక్కసారి" కొమ్మలో కోయిలా కూయంటది" పాట వీణమీద వాయించగాలనో?లేదో?

1 comment:

భావకుడన్ said...

ఆ వాగ్దేవి మీ మొర ఆలకించి ఇన్నేళ్ళ మీ కోరిక తీరుస్తుంటే ఇంకా ఒక్క పాట వాయించగలనా అంటారేంటండి----సుబ్బరంగా ఒక చిన్న కచేరి కూడా చేసేస్తారులెండి.

త్వరలో మీ ఆ కోరిక కూడా తీరాలని, మేము అది మీ టపాలో చదవాలని ఆశిస్తూ అభినందనలు.

(can you please remove word verification for comments?)