Pages

Tuesday, December 2, 2008

కుక్కులు

కుక్కులు
జీవితం అలవాట్లపుట్ట ఆచారాల గుట్ట.ఆచారాల మాట ఎలావున్నా, అలవాట్లు మారిపోతున్నాయి.వాటితో పాటు వాటికి సంబంధించిన మాటలు కూడా అడుగున పడిపోతున్నాయి. దొంగలు తరుముతున్నట్లు మనుషులు పరుగులు పెడుతున్నారు.స్థిమితం అనేది గాలికి పేలపిండిలా కొట్టుకుపోయింది.మొన్న పది మంది కూర్చుని మాట్లాడుతున్నాము."కుక్కులు " అంటే ఏమిటో తెలుసా?అన్నాను.కుక్కలా?అన్నారు కాదు అన్నా.కుక్కలికి ఇప్పుడు ఎంతో గౌరవం పెరిగింది.దాన్ని పెంచే యజమాని హోదా అంతా దానిలోనూ కనపడుతూంది.విదేశాలలో అయితేచెప్పక్కర్లా!వాటి ఫుడ్ కి,బెడ్ కి ,డ్రెస్స్ లకి వేరే వేరే షాపులు వెలిశాయి.ఎంతోఖరీదుపెట్టి కొని వాటిని అలంకరిస్తున్నారు.మనుష్యులకి మల్లే వాటికి వాష్ రూంలు వెలిశాయి."కుక్కులు"
అనే తెలుగు మాట తెలియదు కాని"కుక్" అంటే తెలుసుట. ఎందుకు తెలియదూ?ఈమధ్య చాలా మంది వంట ఇంటి మొఖం చూడటం లేదుకదా?తుమ్ము తుమ్ముకొన్నందుకు నేనేశ్రీరామ రక్ష అనుకొవాలి.వినండి అన్నా!
పూర్వం మొగవాళ్ళకి కూడా నారీ మణుల లాగే నిడుపాటి వెంట్రుకలు వుండేవిట.తల్లులు నిద్రలేవగానే ఆడపిల్లలతోపాటు వీరికి తలకి కొబ్బరినూనె రాసి ,వెంట్రుకలు చిక్కు తీసి ముడి పెట్టేవారట.కేశ సంపద ఎవరికి ఎక్కువ వుంటే అక్కడ"పేలు" అనేఅతి చిన్న జంతువులు సంసారం పెట్టి రాజ్యమేలేవి.వాటిపై సామెతలు కూడా పుట్టాయి."పేనుకు పెత్తనమిస్తే తలాంతా కొరికి పెట్టిందని" అనేవారు.ఈ పేలకి ఎంత శక్తి అంటే ఆడా మగా, వయస్సు తో సంబంధం లేకుండా తలని కొరికి బట్టతలచేస్తాయి. పెరుగు పెద్దతనం చెరిస్తె, పేలు సిగ్గు తిసేస్తాయి.అవి తలపై ఆనందంతో గుంపుగా షికార్లు చేస్తూంటె మనిషికి పిచ్చెక్కుతుంది.ఎక్కడున్నాసరే!రెండు చేతులా తల బరికేస్తుంటారు.పేలు రోజూ పురుడు పోసుకొంటూంటె "ఈళ్ళు"అంటే పేలగుడ్లు క్షణ క్షణాభి వ్రుధ్ధి చెందుతాయి.అవి పుర్రెని ఘట్టిగా అతుక్కొని తలలో రక్తం పీల్చి పెరుగుతాయి.వాటిని మొదట్లోనే హతమార్చాలని ఆడవాళ్ళు గోళ్ళతో వాటిని బలవంతం గా లాగేవారు.అయినా అవి ఇవతలకి వచ్చేవికావు.రెండు బొటన వ్రేళ్ళ మధ్య ఆఈపిని బంధించి నొక్కేవారు.అప్పుడు చచ్చేది. ఈ ఈపులను హతమార్చే ప్రక్రియనే "కుక్కులు" అంటారు.తలలో బంతిపూలు పెట్టుకొంటే పేలుపడతాయనే వాళ్ళు.క్రమవారీగా తలంటు పోసుకోక పోతే ఈ పేలు పడ్తాయి.ఇవి తమకి ఆతల నచ్చక పోతే హై జంప్ చేసి చాక చక్యంగా నాలుగయిదు తలలు దాటి ఆరో తల మీదకి వెళ్ళి పడతాయి.
మధ్యాన్నం భోజనాలయాక తల్లులో,అత్తలో, అక్క చెల్లెళ్ళో,ఈకుక్కులు వేసేవారు.అలా కుక్కులు వేస్తూంటే ఎంత హాయిగా వుంటుందో అనుభవేక వేద్యమేకానీ వర్ణనాతీతం.ఇంగ్లీషువారి అడుగుజాడల్లో మనవాళ్ళూ నడవడం మొదలయాక పిలకలు ముడులు తీసేసి క్రాఫులు పెట్టుకొన్నారు.దాంతో పేలుపోయి,కుక్కులు వేయించుకొంటూ అరమోడ్పుకన్నులతో హాయిననుభవించే అవకాశం వారికి పోయింది. అలవాటయిన ప్రాణం కనుక ఉత్తుత్తి "కుక్కులు వేయమని,అమ్మలని,చెల్లెళ్ళని,కూతుళ్ళని బతిమాలేవాళ్ళు.పేలు ఈపి వుంటే "కుక్కులు" వెయ్యొచ్చుగాని,ఉత్తుత్తిగా కుక్కులు వేయడమంటే విసుగు. వేసే వాళ్ళమీద ఆప్యాయత వుంటే తప్ప.
నాచిన్నతనంలో మాపెద్దనాన్న,మాబాబాయి వరండాలొ నీరెండలో కూర్చుంటే, వచ్చి నాఒళ్ళొ తల పెట్టుకొని "నాలుగు కుక్కులు"వెయ్యరా తల్లీ!కళ్ళుమూసుకు నిద్ర పోతా ,అనేవారు.నాకు బాగా గుర్తు అలా కుక్కులు వెసినప్పుడల్లా మాపెద్దనాన్న మూరెడు పొడుగున్న కారప్పూస పొట్లాము తెచ్చి పెట్టేవారు. మా బాబాయి మాత్రం ఇన్ ష్టాంట్ గా అణాలు,బేడలు ఇచ్చేవాడు.ఎంత గర్వం వచ్చేదో!తలలో జుట్టు కుదుళ్ళలో నూనె రాచి మెల్లగా మర్దన
చేస్తేఎంత హాయిగా వుంటుందో!అలా చేస్తూ కబుర్లు చెపుతూంటె,ఎంతహాయిలేభళా!ఈకాలం పిల్లలు నూనె రాసుకోరుగద!ఫాషన్ కాదుగద!జుట్టు పెంచుకోరుగద!జుట్టు పెరిగితే తలంటి పోసుకోడం కష్టం కద!
పేలు బలంగా నువ్వు గింజల్లా,నల్లగా పెరిగేవి. చంపుతే కిసుక్కుమని శబ్దం వచ్చేది.ఇంట్లొ ఎవరైనా గర్భిణీ స్త్రీలు వుంటే వారికి ఆడపిల్ల? మగపిల్లాడా? అంటె పేలు జొశ్యం చెప్పేవి.నేలమీద ఇసుక పోసి మధ్యలో గుంట చేసి దానిలో ఒక పేనుని వదిలేవారు.అది బయటికి రావడానికి తూర్పు వేపు పైకెక్కితే ఆడపిల్ల అని,పడమర వైపు పైకి ఎక్కితే మగపిల్లాడని అనుకొనేవారు.ఇప్పుడవి తప్పుకొన్నాయి చాలావరకు."కుక్కులు"మాట ఎగిరిపోయింది.

1 comment:

Anonymous said...

ఎందుకో తెలియదుకాని బాలింతలతో పేలు తీయించుకుంటే ఇక మళ్ళీ రావనేవారు
బహుసా వాళ్ళు అప్పుడు ఖాళీగా వుంటారు కాబట్టి ఈ పని పురమాయించేవారమో కదండీ