Pages

Sunday, January 18, 2009

పట్టు కమీజులు తొడిగి ,కాలి గజ్జెలు సవరించి నుదుట నామం దిద్ది రెండు బాదిత గింజలు అతికించి నట్లున్న చుబుకంపై నల్లని దిష్టి చుక్క పెట్టి మెడలో ముత్యాలు,పచ్చలు,పులిగోరు హారాలు, అలంకరించి నడుముకు మామిడి పిందెల మొలత్రాడుకట్టి శ్రావణ మేఘాలవంటి జుట్టును పొదివి మెరుపుతీగాతో బంధించి గిలక ఉయ్యాలలో పడుకోపెట్టింది యశోద. ఉయ్యాల పందిర్లో చిలకలు వ్రేలాడుతున్నాయి.కృష్ణయ్య ఊఁ,ఆ అంటాడేమో ఆ స్వరాలు నేర్చుకొందామని ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. స్వరాల సొగసులన్నీ మీ గొంతులో పెట్టి మిమ్మల్ని సృష్టి చేస్తే

ఇంకా తనివి తీరలేదా? అన్నట్లు నా నాదాలు కావాలా? అని కనురేప్పలతో వెక్కిరిస్తున్నాడు కృష్ణయ్య.రాత్రంతా కన్నయ్య పక్కలో ఆడుకొన్న వెన్నెలని వెనక్కి తోసి సూర్య కిరణాలు లోపలికి దూసుకు వచ్చాయి.గాలి మాత్రం అలుపు లేకుండా చల్లగా వీస్తూనేవుంది.కొంటె పిల్లలు వచ్చి కేరింతాలాడి కృష్ణయ్య నిద్ర చెడగొడతారని తలుపులు దగ్గర పెట్టి వెనక్కి వెనక్కి చూస్తూ వెళ్ళబోయిన యశోద మళ్ళీ వెనక్కి వచ్చినది.కన్నయ్యకు కప్పిన జలతారు శాలువా సర్ది,ముంగురులు అద్ది వెళ్ళలేక వెళ్ళలేక వంటింట్లోకి వెళ్ళింది యశోద గది గుమ్మం దగ్గర ఇద్దరు ముద్దుగుమ్మలు వామన గుంతలాడుతున్నారు.ఇత్తడి వామన గుంటలలో తెల్లని చిన్ని చిన్ని గవ్వలు లెఖ్ఖ పెడుతూ వదులుతూంటే అవి ఝల్లు ఝల్లు శబ్దాలు చేస్తున్నాయి.వారి చేతి గాజులు ఘల్లు ఘల్లు మనే శబ్దాలు నిశ్శబ్దానికి హెచ్చరికలు చేస్తున్నాయి.మరో వేపు దృష్టి సారించాడు శివుడు.వాకిట్లో పారిజాతం వాళ్ళు తెలియకుండా విరగ బూసి ప్రాంగణం అంతా జలజలా పూలు రాల్చింది. భూమాత ఎంత ఘట్టిదో అంత గొప్పది.గుండె విచ్చిందంటే గుబాళిపులే

అని తెలియ దానికో లేక కన్నయ్య వచ్చి అక్కడ రెండడుగులు వేస్తాడని ఆశో ! ఎర్ర మందారాలు కొమ్మలు మరింత సాగ దీసుకొని ఊగి ఊగి కృష్ణుడిని చూడాలని వేర్రివై కళ్లు ఎర్రబడ్డ కన్నేపిల్లల్లావున్నాయి

No comments: