Pages

Friday, October 1, 2010

మా బందరు

చల్ల బజారు
చెమ్మన గిరి పేటలో వుండగా మా తాతయ్యతో [నాన్నగారినాన్న}పెరుగు కొనడానికి" చల్లబజారు" కు వెళ్ళే కార్యక్రమం చాలా సరదాగా వుండేది.మాఇంటి పక్క సందులోకి వెళ్లి ఎడమ చేతి వేపుకు తిరిగితే పెద్ద మైదానం వుండేది,అదే చల్ల బజారు.ఎవరికన్నా ఇంటి గుర్తులు చెప్పాలంటే అదేనండీ!చల్లబజారు ఆనుకొని వున్నా సందులోనే మూడో ఇల్లుమాది.అని చెప్పేవారు.చల్లబజారు చాలా ఫేమస్ .చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి అక్కడ పెరుగు అమ్మేవారు.పెరుగు బజారు అంటే చల్ల వుండ దనుకొంటా రానో ఏమో చల్లబజారు అనేవారు,కాని అక్కడ పెరుగు,చల్ల ,వెన్న కొండొకచో కూరలుకూడా ఉండేవి.గురజాడ రాఘవ శర్మగారు కూడా మా చల్ల బజారుకు రావలసిందే!అక్కడ ఎవరేనా రసజ్ఞులు తారస పడితే పదిపద్యాలువినిపించ వలసిందే! చల్ల బజారులో పెరుగు జాడీలు పట్టుకు నుంచుని ఘంటల తరబడి జనాలు మాట్లాడుకొనే వాళ్ళు.చుట్టరికాలు తిరగేసేవాళ్ళు,అంతెందుకు పెళ్లి సంభందాలు కూడా కుదుర్చుకొనే వాళ్ళు.
తెల్లవారేసరికి ఆ మైదానం అంతా గొల్ల భామలతో వారి తట్టలతో నిండిపోయేది. తోడూ పెట్టిన పెరుగు ముంతలు చిన్నా పెద్దా తట్టలో సర్దుకొని దానిపై ఒక పాత గుడ్డ కప్పి పట్టుకోచేవారు. చుట్టూ పక్కల గ్రామాల వారంతా మా బందరు బస్తీలో ఎక్కువ ఖరీదుకు పెరుగు అమ్ముకోవాలని వచ్చేవారు."పెరుగుసంత"అనోచ్చుదాన్ని. మా తాతయ్య సన్నగా పొడుగ్గా ఉండేవాడు. ఎప్పుడూ ఎండల్లో తిరిగితిరిగి కమిలిన వంకాయ రంగులో వుండేది ఆయన శరీరం.అయిదు ఊళ్ళకి కరిణీకం చేసేవారట. ఆయన చొక్కా వేసుకొనే వారుకాదు.పంచె ఉత్తరీయం .ఉత్తరీయం బుజాన వేసుకు ఒకకోస కుడి చేతి కిందనుంచి ముంజేతి పైకి వేసుకొనేవారు.చంకలో పొడుగాటి జాది ఇరికిన్చుకొని ఎడంచేత్తో నా చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళేవారు. పెరుగు కొనడానికి ఆస్థాన రుచి విశేష జ్ఞురాలిని
నేను. ఆమైదానంలో పెరుగుతట్టలు అర్ధ చంద్రాకారంగా పెట్టుకు కూర్చునే వారు.అణా ముంత ,బేడముంత ,పావలా ముంత,రూపాయిముంత అని సైజు వారీగా ముంత లుండేవి.పెరుగు అరచేతిలో వేయించుకొని పుల్లగా వుందో,తియ్యగా వుందో తిని చెప్పడం మన పని.ఒక కొస నుండి మొదలుపెట్టేవాడుతాతయ్య."బాబుగారూ!మా పెరుగుకొనండి!తియ్యగా ఘట్టిగా వుందండి అని పిలుస్తూ వుండేవారు.మా తాతయ్యకి చాలా మంది తెలుసు కాబోలు ఆ గొల్లవారితో హాస్యాలాడేవాడు. హాస్యంలో చనువు ,హుందాతనం,సరసం తొంగి చూసేవి,వాళ్ళేమి అనేవారుకాదు.ఒకోతట్ట దగ్గర నిలబడి నేను చెయ్యి పెడితే నా చెయ్యి కిందకి దింపి "ఇది మొగుడికే గడ్డ పెరుగు వెయ్యదు మనకేమి అమ్ము తున్దిలే అని లాక్కుపోయేవాడు.ఒకొరి మున్తల్లో పెరుగు పైన నీరు తేలుతూ వుండేది,కొనండి బాబూ అనేదామే ,సరేలే!నీపెరుగెంత ఘట్టిదో తెలుస్తూనేవుంది.నిగనిగలాడే నీవోళ్ళు,ముంత నిండా నీళ్ళు. అనేవాడు.నేను అలాగే కాస్త కాస్త పెరుగుతింటూ ఎప్పుడు పొట్ట నిండితే అప్పుడు పెరుగు పుల్లగావున్న సరే "ఇది తీసుకో తాతయ్యా!అనేదాన్ని.అప్పుడు తాతయ్య జాడీ నిండా పెరుగు కొనేవాడు.రోజు ఈ కార్య క్రమం ఘంటా రెండు ఘంటలు నడిచేది.తాతయ్య జాడీ నిండా పెరుగుకోనడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే "వాళ్ళ అబ్బాయి ఆపెరుగు సగం అన్న పోసుకోవాలని.మానాన్న కి పెరుగుకి ఆరు మైళ్ళ దూరం. విస్తట్లో నాలుగు మెతుకులు పెట్టుకొని దానిమీద చెంచా పోసుకోనేవాడుమా నాన్న.తరవాత జాడీ చూసి మా తాతయ్య అమ్మని నన్ను కూకలేసేవాడు. "వంట చెయ్యగానే సరా! ప్రేమగా కొసరివడ్డించాలి. అని.

5 comments:

పరిమళం said...

'చల్ల బజారు' నేను ఎప్పుడూ వినలేదండీ....బాగున్నాయ్ తాతగారి ముచ్చట్లు !

మాగంటి వంశీ మోహన్ said...

అమ్మా

ఈ చల్లబజారులో కూర్చునే గొల్ల ఒకామె, (పేరు తెలియదు కానీ మేమంతా గొల్ల అనే పిలిచేవాళ్ళం) చల్లపల్లిలో తన కూతురిని చూట్టానికి వచ్చినప్పుడు మా అమ్మమ్మగారింటికి కూడా వచ్చేది. వస్తూ ఒక పెద్ద కుండెడు పెరుగు, తాటిముంజలు, తేగల సీజనైతే తేగలు తీసుకొచ్చేది. మా అమ్మమ్మ కమలమ్మ గారంటే బోల్డంత అభిమానం ఆ గొల్లకి. ఆ రోజు అమ్మమ్మగారింట్లో పిల్లలకు పండగే!...

ఎన్నో ఏళ్ళకు ఆ గొల్లను గుర్తు చేశారు మళ్ళీ...

జై బందరు, జై చల్లపల్లి

వంశీ

భావన said...

వో మీరు చల్ల బజారు దగ్గరా? మా పెదనాన్న గారు గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర వుండేవారు. ఆకు కూరల కోసం వెళ్ళేవాళ్ళం. నేను అక్కడే రుస్తుంబాదా మునిసిపల్ హై స్కూల్ లో చదువుకున్నా. అక్కడ పొద్దుటే బోలెడన్ని ఆవులు గేదలు వుండేయి.. కావలసిన వాళ్ళం వెళ్ళి పాలు పితికించుకుని వచ్చే వాళ్ళం. అవునండీ వంశీ గారు జై బందరు. :-)

RAM CH said...

చాన్నాళ్ళకి నాకు తోడుగా కొందరు బందరు పిచ్చోళ్ళు దొరికారు.. చాలా సంతోషంగా వుంది.. ఇన్నాళ్ళూ ఈ సైట్ ఎలా తప్పించుకుందా నానుంచి అని ఆలోచిస్తున్నా

RAM CH said...

చాన్నాళ్ళకి నాకు తోడుగా కొందరు బందరు పిచ్చోళ్ళు దొరికారు.. చాలా సంతోషంగా వుంది.. ఇన్నాళ్ళూ ఈ సైట్ ఎలా తప్పించుకుందా నానుంచి అని ఆలోచిస్తున్నా