పసిడి బొంగరాలు
ఓ పాప పుట్టాడు !
ఎందుకు పుట్టాడో .........ఏం చేద్దామని పుట్టాడో.........
ఏం తిందా మని పుట్టాడో!
ఏం అనుభవించాలని పుట్టాడో.........ఏం ఆనందించాలని పుట్టాడో!
ఏం సాధిద్దామని పుట్టాడో.........ఏం సంపాదిద్దామని పుట్టాడో!
ఏం వింటాడో!ఏం చూస్తాడో! ఏం చేస్తాడో!
_కానీ ఒక పాప పుట్టాడు !
పుట్టడానికి కారణం తలితండ్రులంటారు కొందరు.బ్ర హ్మ నిర్ణయ మంటారు మరి కొందరు .పాపడు చేసుకొన్న పూర్వ పుణ్య మంటారు మరి కొందరు.
కారణ మేమైనా కావచ్చు ఒక పాపడు పుట్టాడు. మానవ కోటిలో కలిసాడు. జనాభాలో చేరి పోయాడు. అంతవరకూ ఎరుగని వాడు కొందరికి ఎరిగిన వాడయ్యాడు. తలితండ్రులకు తన వాడయ్యాడు.బంధువులకు మన వాడయ్యాడు. బాలల ప్రపంచం లో ఒక సభ్యు డయ్యాడు. ఊహలు
తెలియవు కనుక నిర్భయుడయ్యాడు.
ఇలా ఎందఱో...ఎందఱో పుడతారు.అందులో కొందరు పాపాయిలు,కొందరు పాపళ్ళు.
కొందరు పసిడి తొట్టెలో ఊగుతారు .కొందరు పాత బట్ట లలో ఊగుతారు.
పాపడు పుట్టగానే తల్లుల రొమ్ములు కొమ్ము చెంబులవుతాయి ఎదలు బూరుగ దూది దిళ్ల వుతాయి . కళ్ళు వెన్నెల్లో నంది వర్ద నాలవుతాయి.చేతులు చేతులు గుండెలను గొలుసు వేసి కట్టిన ఉయ్యాల లవుతాయి. పెదవులు చదువులు రాక పోయినా కదిలి కవనాలు చెబుతాయి.
ఎద కదలి పాటలు పాడుతుంది. తల్లిలో ఆశలు చిగురిస్తాయి.తండ్రిలో ఆశయాలు కల లల్లు కొంటాయి.
పాపడు ఎక్కడ వుంటే అక్కడ అతని చుట్టూ నవ్వులు పువ్వులే! పన్నీటి దివ్వేలే! కనిపించ కుండా వినిపించే మువ్వల సవ్వడులే!
ఒక పాపడు పుట్టాడనేది పరమాక్ సత్యం . ఆ సత్యం చుట్టూ శివం సుందరం
నృత్యం చేస్తాయి.అది సత్యో త్సవం !నిత్యో త్సవం !
రచన _ రావూరు
No comments:
Post a Comment