Pages

Friday, November 16, 2012

కన్నాంబ గారి టాక్ షొ

          కన్నాంబ  గారి   టాక్ షో
                      కౌముదిలో కిరణ్ ప్రభ గారు    వినిపించిన   టాక్ షో     కన్నాంబ గారినిగురించినది విన్నాక   గత స్మృతులు మనసులో మెదిలాయి.  మేము 51లో    మద్రాసు మకాము మార్చాము. మానాన్నగారు సినిమా రచయితగా స్థిర పడాలని   మద్రాసు వెళ్ళారు.  లక్ష్మి అనే ఒక సినిమాకు  మాటలు వ్రాసారు.   తరువాత భానుమతిగారు అవకాశం    ఇచ్చి చక్రపాణి    వ్రాయించారు.  అప్పుడు   కన్నాంబ గారి సంస్థ  రాజ రాజే శ్వ రీ ఫిలిమ్స్ లో నాగభూషణం గారు    పిలిచారు.  కిరణ్ ప్రభ గారు చెప్పినట్లు    నాగ భూషణం గారు   ఫష్ట్  తారీకు ముందురోజే  జీతాలు ఇచ్చేవారు.  మా నాన్నగారు చెప్పీవారు  ఎక్కడున్నాసరే పిలిచి చెక్కు ఇచ్చేవారుట .నిజానికి భరణీ  సంస్థ  వారు ,వీరు   ఖచ్చితంగా  జీతాలు అంద  చేసేవారు.
                      పాటల రికార్డింగ్ జరిగే ట ప్పుడు   వాయిద్య కారులు    ఎవరు వచ్చికోరినా   వారికి   నాగభూషణం గారు అవకాశం  ఇచ్చేవారట.   ఎవరిని కాదు ,లేదు అనేవారు కాదట. ఇక కన్నాంబ గారిని స్టూడియో లో చూస్తూ వుండేదాన్ని. ఎందుకంటే   మద్రాసు  కు  బంధువులు ఎవరు వచ్చినా వారికి సినిమా షూటింగు చూడాలనే కోరిక గాధంగా వుండేది. నాగభూషణం గారి  షూటింగులకి   తీసుకువేల్లెవారునాన్న.  నేను వాళ్లకి తోడుగా వెళ్ళేదాన్ని. ఒకసారి అలా వెళ్ళినపుడు   కన్నాంబ గారు,ఎస్ .వరలక్ష్మిగారు ,జిక్కి ముగ్గురు కూర్చుని మాట్లాడుతున్నారు.కన్నాంబ గారు   ఒక రాగం ఆలాపించి ఏదీ!మీరు అనండి అన్నారు. వరలక్ష్మి గారు ఎప్పుడూ సంగీతం నేర్చుకొంటూనే వుండేవారు. ఆమె ఆరాగం అందుకోలేకపోయారు, జిక్కి అందుకోలేక పోయారు. వాళ్ళిద్దరూ చేతులు జోడించి "తల్లీ! నీలా మేము ఎక్కడ  పాడగలం   ,మమ్మల్ని వదిలిపెట్టు" అన్నారు.సంగీతంలో ఆవిడకి అంత  ప్రతిభ.
                       ఆమె సినిమా షూటింగ్లో  ఏదైనా   దుఃఖ సంఘటన  లో కన్నీరు కార్చవలసి వస్తే   గ్లిసరిన్ అవుసరం లేకుండానే ఆమె కు కన్నీళ్ళు  వచ్చేవిట .మానాన్నగారు వారికి సతీ సక్కుబాయి ,సతీ సావిత్రి ,కృష్ణ మాయ, నాగపంచమి  సినిమాలకు మాటలు,పాటలు వ్రాసారు. మాపెళ్లి  రిసేప్షన్ కి ఆమె వచ్చారు.  వెళుతూ వెళుతూ మెట్లదగ్గర నిలబడి    మావారి   చేతులు రెండూ పట్టుకొని "అల్లారు ముద్దుగా పెంచుకొన్నారు రావూరు గారు జాగ్రత్తగా చూసుకో నాయనా!అని కళ్ళనీళ్ళు పెట్టుకొన్నారు.మా ఆయన   చాలా   ఖంగారు పడి "అలాగే!అలాగే!అని పదిసార్లు చెప్పారు. కన్నంబగారు, నాగభూషణం గారు ఇద్దరూ    అందరిపట్లా    ఆప్యాయంగా వుండేవారు. నాగ భూషణం  గారి చివరి దశ వింటే    కళ్ళు చెమర్చాయి.  ఈజన్మలో చేసిన పుణ్యం   ఈజన్మకి కాదు,మరుజన్మకే!అంటారు ఇదేనేమో!అనిపించింది. ఇవన్నీ జ్ఞప్తికి తెచ్చిన కిరణ్ ప్రభ గారికి    ధన్యవాదాలు.

1 comment:

Kottapali said...

చాలా బావుంది. కన్నాంబగారు బాబాయిగార్ని ఖంగారు పెట్టేశారన్నమాట :)