Pages

Tuesday, October 15, 2019

నేనెంత 
                              ప్రతి మనిషి   మస్తిష్కం లొనూ ఒక కెమెరా ఉంటుంది. స్మృతి బలపడుతూనే   అది క నిపించిన దృశ్యాలను  మనసులో పదిల పరుస్తుంది.పసితనం  లో మొదటి దృశ్యం  నుంచి అవి పెరుగుతూ ఉంటాయి. వాటిని నెమరు వేసుకొంటే జీవన గ్రంధం  మొదలవుతుంది. .నా గురించి ఏదైనా వ్రాయాలని కూర్చుంటే ఈ అఖండ బ్రహ్మాడం లో    నేనెంత?  అనిపించి  కలం కింద పెట్టేసాను. కానీ ఇప్పుడు జీవితం చివరి మెట్టు మీద నిలబడ్డాక  నా జ్ఞాపకాలన్నీ నాలోనే ఇగిరి పొతే ఎలా?  తోటి వారితో పంచుకొని తేలిక చేసుకొందాం మనసుని  అనిపించింది. వరుస క్రమం తప్పినా ఏరుకొన్న జ్ఞాపకాలను పరుద్దామని ప్రయత్నం. 
                   అవిఘ్నమస్తు 
    లలితా భట్టారికా బాలాత్రిపుర సుందరీ మహాకాళీ  మహాలక్ష్మీ 
మహా సర్వస్వత్యై నమ:
              మేము బందరులో ఉండేవాళ్ళం . మా నాన్నగారు కృష్ణా పత్రికలో పనిచేసేవారు. నాకప్పుడు మూడేళ్లు వుంటాయేమో. 
రెండవ ప్రపంచ యుద్ద్ధం వచ్చింది. నా మనసులో జ్ఞాపకాన్ని 
చెప్పినపుడు మా నాన్నగారు చెప్పిన వివరము ఇది. యుధ్ధభయం  అందరూ గజగజ లాడిపోయారు. ఎప్పుడు ఏ క్షణం లో ఊరి మీద బాంబులు వేస్తారో అని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ఉండేవారు వీధుల్లో గాడిపొయ్యి లాటి గోతులు తవ్వి పెట్టారు. ఇసుక బస్తాలు పెట్టారు బాంబులు వేస్తారనే సూచన తెలియగానే సైరను కూస్తుంది . అందరూ పరుగెట్టికు వెళ్లి  ఆగోతుల్లో దాక్కుని ఇసకబస్తాలు మీద వేసుకోండి అని హెచ్చ్చరికలు చేశారు. ఆడవాళ్ళకి , పిల్లలకి, వృధ్ధులకి ఇది సాధ్యమా?అందరూ సంసారాల్ని  దూరంగా పల్లెలకు పంపేశారు. 
                                    ముట్నూరి కృష్ణారావు గారి సారధ్యంలో పత్రిక నడుస్తుండేది. ప్రజలకి అది ఒక సలహాదారు, ఒక శ్రేయోభిలాషి, దేశభక్తి శంఖారావం మా నాన్న గారు ఆ సమయంలో పత్రిక విధుల నుంచి తప్పుకోవడం  ఇష్టం లేక 
మా అమ్మని నన్ను మా పెదనాన్న గారి వూరు వెళ్లిపొమ్మన్నారు. 
ఎద్దు బండీ వఛ్చి వాకిట్లో నుంచుంది. మా అమ్మకి నాన్నగారిని ఒక్కరిని విడిచి వెళ్లడం ఇష్టం లేదు. ఆరోజుల్లో ఎవరు ఎప్పుడు దేశం కోసం జైలుకు వెళిపోతారో తెలిసేదికాదు. మేము ఊరెళ్లి పొతే నాన్నగారు జైలుకి వెళ్లి పోతారని అమ్మకి భయం. అప్పుడు మేము ఉన్న ఇల్లు ఎత్తుగా ఉండేది. వాకిట్లో మెట్లు ఉండేవి. మానాన్నగారు పైన నిలబడ్డారు, అమ్మ నన్నెత్తుకొని కింద నిబడి ఒకటే ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తోందో నాకు  తెలియక పోయినా  అమ్మ ఏడుస్తోందని నేనూ ఏడుస్తున్నాను. మానాన్నగారు"ఊ బండి ఎక్కండి "అన్నట్లు తల ఊపారు .అమ్మ ఇంకా ఏడుస్తూంటే కిందకి వఛ్చి "నేను మిమ్మల్ని వదిలి జైలుకువెళ్లానులె,'అని వాగ్దానం చేసి బండి ఎక్కించారు. ఇది నా దృష్టి పాఠం లో నిలిచిన మొదటి చిత్రం .[సశేషం ]

No comments: