Pages

Monday, October 21, 2019

నేనెంత

నేనెంత 
                ముచ్చ్చిలిగుంట నాకు గుర్తు లేదు.కానీ ఎప్పుడో బామ్మతో ఉన్నట్లు లీలగా గుర్తు. వాకిట్లో పెద్ద టెక్కాలుండేవి. ఇల్లు ఎత్తుగా ఉండేది. నాకు మా నాన్నగారంటే ఎక్కువ అనుబంధం. అమ్మకి ప్రేమ ఉండేది,కానీ ముద్దులు కురిపించడం ,గారాం చెయ్యడం లాలనగా కబుర్లు చెప్పడం చేసేదికాదు. నాన్నగారు మాత్రం మమతా కురిపించేవారు. నాన్నగారు కనిపించక పొతే గిలగిలా లాడేదాని. అమ్మని నాన్నగారు ఎక్కడికి పంపేవారుకాదు. ఎప్పుడో ఒకేసారి పంపేవారు. అక్కడికి వెళ్ళగానే నాన్నగారు కనపడక బెంగతో పాలు తాగక ,నిద్ర పోక ,జ్వరం వచ్ఛేది . మా అమ్మమ్మవాళ్ళు కూతురు ఇంటికి వచ్చిందని ఆనంద పడిపోతుంటే నేను ఆ ఆనందాన్ని ఒక్కరోజు నిలపెట్టేదాన్ని కాదు. నాకు బాగాలేకపోతే మా అమ్మ ఖంగారు పడిపోయేది. రెండో రోజే ప్రయాణం కట్టేది. మా వూరు వఛ్చి మా వాకిట్లో బండి దిగగానే నాన్న కనిపించక గానే మొహం చాటంత అయి మామూలుగా అయిపోయేదాన్ని, మా అమ్మకి లోలోపల బాధ కలిగేదేమో!
                                  మా అమ్మ మౌన యోగి.  కొంచెం జ్ఞానం వచ్చ్చాకమేము ఖొజ్జిలి పేటలో ఉండేవాళ్ళం. నన్ను అక్కడ కోటవారితాళ్ళదగ్గర బడిలో చేర్చారు. ఆ బడిప్రధాన ఉపాధ్యాయురాలు  మ్ము ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. ఆమెపేరు రాజమ్మగారు. వాళ్ళది పెద్ద భాగం ,మాది చిన్నది. మా వంటింటికి మధ్య తడికే ఉండేది. నేనెప్పుడైనా మారాం చేస్తే టీచర్ గారు తడిక వెనక నుంచి "ఊ అనేవారు,అంటే నేను నోరెత్తేదాన్ని కాదు. ఇంటివాళ్ళు దొడ్డివేపు చిన్న భాగం లో ఉండేవారు.  రాజమ్మ టీచర్ గారి చెల్లెలు ,తమ్ముడి సంసారం అక్కడే ఉండేవారు.మేము వాళ్ళు రాజమ్మ టీచర్ గారి మాట నెత్తిన పెట్టుకొనేవాళ్ళం. అక్కడ మా ఇంటికి కుడివైపు చివర దుర్లా రమణమ్మగారు ఉండేవారు. జానకీరాణితో అప్పటి స్నేహబాంధవ్యం . మాకు ఎడమ వేపు వీధి వైపు ఆంధ్ర బ్యాంకు ఉండేది. అవుటపల్లి హనుమంత రావు గారు ఉండేవారు. లోపలగా కంచి వాసుదేవరావు, కె.ఆర్ కె మోహన్ ,జయలక్ష్మి వుండెవారు  . మాఇంటికి వాళ్ళ ఇంటికి మధ్య గోడ సగం విరిగి ఉండేది. వీధిలోంచి వెళ్లనక్కర లేకుందాం ఆగోడదగ్గర కూర్చుని పిల్లి పిల్లలతో ఆడుకొనేవాళ్ళం. రాజమ్మ టీచరుగారింట్లో మీనాక్షి  అనేఅమ్మాయి ఉండేది. నాకంటేచాలా పెద్దది. అయినా మేము తాటాకు బొమ్మలతో పెళ్లిళ్లు చేసిఆడుతుంటే తాను పెద్దగావుంది ఆడించేది.
                                   మా నాన్న గారు ఆఫీసుకు వెళ్ళేటప్పుడు రోజూ  నాతొ చెప్పి 'ఆడుకొ అమ్మా!అల్లరిచెయ్యకు, నేను తొందరగావచ్చ్చేస్తా." అని చెప్పి వెళ్లేవారు.ఒకరోజున నాతొ చెప్పకుండా వెళ్లిపోయారు. ఇల్లంతా వెతికా కనపడేలా. వీధిలోకి వఛ్చి చూస్తే గొడుగు వేసుకు వెళ్లి పోతున్నారు.దుఃఖం వచ్చ్చేసింది.కడుపు ఉబ్బిపోయింది. కన్నీళ్లు కారిపోతున్నాయి. ఆయన వెనక "నాన్నా"'నాన్నా" అంటూ ఏడుస్తూ పరుగెత్తతున్నా. ఆయనకేమితెలుసు?ఆయన వెనక్కి తిరిగి చూడలేదు.ఇంకా ఉక్రోషం ఎక్కువయిపోయింది. రోడ్డు చివర నాన్న గారు ఎడమ వే పుకి తిరిగారు,అప్పుడుచూశారు,గొడుగు ముడిచి చేతికి తగిలించుకొని వెనక్కి పరుగెత్తుకు వఛ్చి నన్నెత్తుకొని"ఏమైంది తల్లీ!ఏమైంది? అన్నారు. దుఃఖం ఆపుకొని చెప్పాను అయ్యో అందుకా !ఒక్కదానివీ ఇంత దూరం వచ్చ్చావా!అని ఉత్తరీయం తో మొహం తుడిచి ఇంటికి తీసుకు వఛ్చి మా అమ్మని కేకలేశారు. పిల్ల వస్తూంటే చూసుకోనక్కరలేదా?అని వెళ్లి పోయారు. పక్కనే ఎక్కడో  ఆడుకొంటున్నాననుకోంది  అమ్మ. అమ్మకి కోపం వచ్చింది. అప్పుడు అమ్మ చేతిలో ఉప్పు బుట్టవుంది.దానితో నన్నొక తోపు  తోసి చెప్పకుండా ఎందుకు వెళ్ళావు?నన్ను చివాట్లు పెట్టారు"అంది.కానీ కొట్టలా! మధుర మైన బాల్యం ,మళ్లీమళ్ళీరాని బాల్యం       

No comments: