Pages

Wednesday, October 23, 2019

నేనెంత

నేనెంత 
     నాన్నగారు పరీక్షల్లో ఒక ప్రశ్నలో కథ వ్రాయమంటే పద్యాలలో వ్రాస్తే గొప్పగా ఉంటుందని మొత్తం పద్యాలు వ్రాశారట. బోలెడు మార్కులు వస్తాయని ఆశ తో ఎదురుచూస్తుంటే,'కద వ్రాయమంటే పద్యాలలో ఎందుకు వ్రాసావు అని ఎర్రసిరాతో సున్నాపెట్టాడట.  అది చూసి నాన్నగారు చాలా నిరాశ చెందారు.  బందరు లో ముట్నూరి కృష్ణా రావు గారి  సంపాదకత్వం తో కృష్ణాపత్రిక వారపత్రిక వచ్ఛేది. ఆపత్రికకు సాహిత్య పరం గానూ,దేశ భక్తి పరం గానూ,వేదాంత పరంగానూ ఒక విశిష్ట మైన స్థానం ఉండేది. సినిమా సమీక్షలు,కోర్టు ప్రకటనలు ,కూడా ఉండేవి. మా  నాన్నగారికి ఆ పత్రికలో పని చెయ్యాలని గొప్ప కాంక్ష ఉండేది. కిరసనాయిలు అమ్మే దుకాణం లోనూ,ఎలెక్ట్రిక్ దుకాణంలో బల్బులు అమ్ముతూనూ ,సాయంత్రం దాకా గడిపి ,రోజూ కృష్ణా పత్రిక ఆఫీసుకు వెళ్లేవారు. చిన్నగా సినిమా సమీక్షలు అవీ
వ్రాసేవారు,అవి పత్రికలో వేసే వారు. 
                 కృష్ణా పత్రిక  కళాకారులందరికి  ఒక ఆలయం లా ఉండేది. అక్కడి దేవత  సరస్వతి .స్థానికంగా ఉండేవారు,వేరే వూళ్లనించి వచ్చ్చేవారు  కృష్ణాపత్రికాలయానికి వఛ్చి దర్శించు కొని వెళ్లేవారు. మా నాన్నగారు నన్ను అప్పుడప్పుడూ ఆఫీసుకు తీసుకు వెళ్లేవారు. 
              ఆఫీసు ప్రవేశంలో చిన్నగట్టు,నడవా ఉండేవి. అలా వెడితే చిన్న వరండా. అక్కడ క్రోటను మొక్కలు ,అందమైన రాతి శిల్పాలు ఉం డేవి.అక్కడే రోజూ కళాకారులతో సాయంత్రం వేళా దర్బారు జరిగేది. అక్కడ జరిగిన సంభాషణ లన్నీ నాన్నగారు పన్నీటి జల్లు అనేశీర్షిక కింద వారం వారం వ్రాసేవారు. ఆవరండాకి ఎడమవైపు రెండు గదులుండేవి. అక్కడే మేనేజరు కాజ శివరామయ్యగారు, అకౌంటెంట్ గా మల్లినాథులు కూర్చునేవారు. పక్క గదిలో పెద్ద పెద్ద చెక్క రాక్ లు ఉండేవి. అక్కడ బ్లాకులన్నీ ఉండేవి. చక్కల మీద లేదు తో బొమ్మలు తిరగేసి ఉండేవి   ,ఒకచోట లోతుగా ఒకచోట ఎత్తుగా ఉండేవి.వాటివెనక నంబరు వ్రాసి ఉండేవి.ఆనెంబర్ల ప్రకారం బొమ్మలు ప్రింట్ చేసి పుస్తకాలు ఉండేవి. వాటిని ఆధారంగా కావలసిన బొమ్మలు తీసి మిషనులో పెట్టి ప్రింట్ చేసేవారు. ఆబ్లాకుల తయారీ మద్రాసులో జరిగేది. మనం బొమ్మ పంపిస్తే అయిదారు రో లాలో బ్లాకు తయారు చేసి పోస్ట్ లో పంపేవారు. ఒకోసారి సమయానికి అందవని ముందుగానేబ్లాకులు తయారు చేయించి పెట్టుకొనేవావారు.  
                        వరండాలో మరో గాడి ఉండేది. లోపలికి వెళ్ళగానే తలుపు పక్కన కృష్ణా రావుగారు. పడక కుర్చీలో కూర్చుని ఉండేవారు. గుమ్మానికి ఎదురుగా మానాన్నగారు కుర్చీ ,మేజాబల్ల, పక్క నే కమలాకర వెంకట్రావు గారు కూర్చునేవారు. అక్కడే పెరట్లోకి తలుపు ఉండేది. అక్కడ బోలెడు మొక్కలు,శిల్పాలు ,కనువిందుగా ఉండేవి. ఆతోటకానుకొని పొడుగాటి షెడ్లో ప్రెస్ ఉండేది. అక్కడ కంపోసింగ్, ప్రింటింగ్ జరిగేవి. ఒక్కొక్క అక్షరానికి  తలకట్టు ,కొమ్ములు,వత్తులు  ఉండేవి.కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని  కంపోజ్ చేసేవారు.  

                         
         

1 comment:

Rajamouli Nidumolu said...

ఇలా జ్ఞాపకాలని అక్షర రూపంలో పెట్టటం చాలా మంచి పని. 
ఎవరికీ తెలుస్తాయి  ఇవన్నీ.  ఇంకో ప్రశ్న రావచ్చు.. ఎవరికీ కావాలి ఇవన్నీ ? అని.   
మనకనవసరం.. అంతే. నా  జ్ణాపకాలు .. నాఇష్టం...  మీకు ఇష్టమైతే చదూకోండి .. లేకపోతె వదిలెయ్యండి.  
వదిన గారూ.  మీ ప్రయత్నం సత్ప్రయత్నం. నిర్విఘ్నంగా మదిలో దాచుకున్నవన్నిటినీ... వ్రాయండి. అందివ్వండి. అందరికీ.  .చదువుకున్నోళ్ళు నేర్చుకుంటారు చాలా.  చదవద్దనుకునే వారు  అన్నీ నేర్చినవారే అయిఉంటారు కదా !!  
-- రాజమౌళి